సునీల్ జాఖర్‌ సస్పెన్షన్‌కు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సిఫారసు

ABN , First Publish Date - 2022-04-26T22:57:35+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్‌ను రెండేళ్ల పాటు..

సునీల్ జాఖర్‌ సస్పెన్షన్‌కు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సిఫారసు

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్‌ను రెండేళ్ల పాటు సస్పెండ్ చేయాలని, పార్టీ పదవులన్నింటి నుంచి తొలగించాలని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సిఫారసు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కేరళ నేత కేవీ థామస్‌ను కూడా తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ మంగళవారంనాడిక్కడ సమావేశమైంది. మేఘాలయలో అధికార మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎంహెచ్ఏ)కు సపోర్ట్ చేసిన ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానానికి కమిటీ సిఫారసు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన క్రమశిక్షణా కమిటీకి పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోని సారథ్యం వహిస్తున్నారు. ఇతర సభ్యులుగా తారిఖ్ అన్వర్, జేపీ అగర్వాల్, జి.పరమేశ్వర్, అంబికా సోనీ ఉన్నారు. కారణాంతరాల వల్ల ఈ సమావేశానికి అంబికా సోనీ హాజరుకాలేదు.


కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశానికి ముందు సునీల్ జాఖర్ ఓ ట్వీట్ చేస్తూ ''ఇవాళ, ఇంకా ఎవరికైనా అంతరాత్మ అనేది ఉంటే వారిపై వేటు పడుతుంది'' అని అన్నారు. జాఖర్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో అధికారాన్నిఆప్‌కి కాంగ్రెస్ కట్టబెట్టిందని, దీనికి చన్నీనే బాధ్యుడని అన్నారు. కాగా, ఏప్రిల్ 9న కేరళలో సీపీఎం ఏర్పాటు చేసిన సెమినార్‌కు కాంగ్రెస్ అభిప్రాయాలకు భిన్నంగా థామస్ హాజరయ్యారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కేరళ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే, మేఘాలయలోని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ బలపరిచిన అధికార భాగస్వామ కూటమిలో చేరారు. దీంతో వారికి పార్టీ షోకాజ్ నోటీసులు పంపింది.

Updated Date - 2022-04-26T22:57:35+05:30 IST