రేపటి నుంచి కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు

ABN , First Publish Date - 2022-04-28T16:37:28+05:30 IST

కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు ఈ నెల 29 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఈ మేరకు నగరంలో బుధవారం ఒక ప్రకటన

రేపటి నుంచి కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు

బెంగళూరు: కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు ఈ నెల 29 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఈ మేరకు నగరంలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతవరకు జరిగిన డిజిటిల్‌ సభ్యత్వం ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, 78 లక్షల మందికి ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉంటుందని చెప్పారు. ఓటర్ల జాబితాను ప్రకటించి ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలిపేందుకు 15 రోజుల పాటు సమయం ఇస్తామన్నారు. తొలి దశలో బూత్‌ స్థాయిలో పదాధికారుల ఎన్నిక అనంతరం రెండో దశలో అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందన్నారు. మూడో దశలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు పదాధికారులు, అధ్యక్షుల ఎన్నిక ఉంటుందన్నారు. చివరిగా కేపీసీసీ పదాధికారులు, ఏఐసీసీ సభ్యుల ఎన్నిక ఉంటుందన్నారు. రిటర్నింగ్‌ అధికారులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు వస్తారని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల కోసం సుదర్శన్‌ నాచియప్పన్‌, జోసెఫ్‌ అబ్రహాం, మోతీలాల్‌ దేవానంద్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కర్ణాటక దేశంలోనే తొలి స్థానంలో ఉందని డీకే శివకుమార్‌ వెల్లడించారు. మే 1 నుంచి కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని, వీరికి ప్రస్తుత ఏడాది జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఓటు వేసేందుకు హక్కు ఉండదని పేర్కొన్నారు.

Updated Date - 2022-04-28T16:37:28+05:30 IST