అగ్నిపథ్‌తో యువత భవిష్యత్‌ నాశనం

ABN , First Publish Date - 2022-06-28T05:19:27+05:30 IST

కేంద్రం ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు.

అగ్నిపథ్‌తో యువత భవిష్యత్‌ నాశనం
భీమవరం గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నేతల నిరసన

భీమవరం అర్బన్‌, జూన్‌ 27: కేంద్రం ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. పథకాన్ని విరమించుకోవాలని ఆందోళన చేసిన ఆర్మీ అభ్యర్ధులపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జి అద్దంకి దొరబాబు మాట్లడుతూ దేశ రక్షణ విభాగానికి విఘాతం కలిగించే అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసేవిధంగా అగ్నిపథ్‌ ఉందన్నారు. దేశ రక్షణ విషయంలో బీజేపీ నకిలీ దేశభక్తి బట్టబయలైందన్నారు. దేశ రక్షణ విభాగం సైతం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనా బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పుచ్చకాయల రత్నరాజు, నాయకులు తమలంపూడి వంశీరెడ్డి, సింహాద్రి శ్రీనివాస్‌, దుక్కా సోమేశ్వరి, బొట్టా విశాలక్షి, కరణం రాము తదితరులు పాల్గొన్నారు.


కాళ్ళ: అగ్నిపథ్‌ ఉద్యోగాలు యువతకు పార్ట్‌టైమ్‌ జాబ్‌ లాంటివని కాంగ్రెస్‌ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. కాళ్ళలో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిపథ్‌ ప్రక్రియలో కేవలం నాలుగేళ్లు ఉద్యోగాలివ్వడం యువత భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసిందన్నారు. దేశరక్షణలో సైనికుల ప్రాత ఎంతో కీలకమని, అలాంటి సైనికులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తరువాత వారిని కొంతకాలానికే పరిమితం చేయడం సరికాదన్నారు. సైనికులుగా పనిచేసిన వారిని ఉద్యోగ విరమణ తర్వాత అందాల్సిన లబ్ధిని ఇవ్వ కుండా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారాం, జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రా పార్థు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:19:27+05:30 IST