Congress పార్టీకి షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-03-13T18:01:05+05:30 IST

రాజకీయాలలో ఉన్నచోటున గుర్తింపు లభించడం లేదని మరోపార్టీలోకి వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ దేశమంతటా కాంగ్రెస్‌ పార్టీని కుంగదీసిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీనియర్‌ నేత ఇబ్రహీం

Congress పార్టీకి షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే...

- సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఇబ్రహీం రాజీనామా

- మైనార్టీలకు గుర్తింపు లేదంటూ ఆగ్రహం

-  మొదలయిన జంపింగ్‌లు


 బెంగళూరు: రాజకీయాలలో ఉన్నచోటున గుర్తింపు లభించడం లేదని మరోపార్టీలోకి వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ దేశమంతటా కాంగ్రెస్‌ పార్టీని కుంగదీసిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీనియర్‌ నేత ఇబ్రహీం రాజీనామా చేయడం ఆ పార్టీకి షాక్‌లాంటిదే. రాష్ట్ర రాజకీయాలలో ఐదు దశాబ్దాల అనుభవం కలిగి కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఇ బ్రహీం దాదాపు దశాబ్ద కాలంపైగానే కాంగ్రెస్‌లో కొనసాగారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా రు. సిద్దరామయ్యతో కలిసి జేడీఎస్‌లో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఇబ్రహీం 2008లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా సిద్దరామయ్యతో సన్నిహితంగా ఉండే ఇబ్రహీం కొన్నినెలలుగా కాంగ్రెస్‌ వీడతారని చర్చ సాగుతోంది. శాసనసభ సమావేశాలు సాగుతుండగానే ఇబ్రహీం కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పంపారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఆ లేఖను ప్రతిపక్షనేత  సిద్దరామయ్యకు పంపుతున్నట్లు ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలలో భవిష్యత్‌పై ఆందోళన మొదలయింది. తనతో పాటు మరింత మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతున్న పడవ లాంటిదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని, వచ్చినా సిద్దరామయ్య ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కాలేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని, ఏడు దశాబ్దాలలో మైనార్టీలు 90 శాతం కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చారన్నారు. కానీ పార్టీ అధ్యక్ష పదవి కానీ ప్రతిపక్ష హోదా కానీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇబ్రహీం ప్రసంగమంటే సొంతపార్టీ నేతలే కాదు ఇతర పార్టీల కార్యకర్తలు వినాలనుకునేవారు. ఐదు దశాబ్దాలుగా రాజకీయాలపై సమగ్ర అవగాహన కలిగినవారు. బహిరంగ వేదికలే కాకుండా సభలోను ఆయన మా టల తూటాలు అధికార, ప్రతిపక్ష సభ్యులకు ఆలోచన కలిగించేవి. అటువంటి అనుభవమున్న ఇబ్రహీం కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో అగ్రనేతలు ఆలోచనలో పడ్డారు. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత పలువురు మంత్రులు తమతో ఎంతోమంది టచ్‌లో ఉన్నారని, బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. గతంలో ఇటువంటి వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలు చేసినప్పుడు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రతిఘటించేది. కాంగ్రె‌స్‌లో చేరేందుకు పదులసంఖ్యలో సిద్ధంగా ఉన్నారని ధీటుగా సవాల్‌ చేసేవారు. ప్రస్తుతం మంత్రుల ప్రకటనకు రోజులు గడుస్తున్నా స్పందించేవారు కరువయ్యారు. రాష్ట్రంలో 2023 ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటికి బీజేపీని బలోపేతం చేసేందుకు ఢిల్లీనేతలు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ కొంత బలంగా ఉందనిపించినా జాతీయ స్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఏడాదికి ముందే జంపింగ్‌లు ఆరంభం కావడం కాంగ్రెస్‌కు కొత్తకష్టం వచ్చినట్లుగా మారింది. రాష్ట్రంలో సరిగ్గా రెండున్నరేళ్ల కిందట 17 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు జంప్‌ చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అటువంటి ప్రక్రియ సాగలేదు. హొసకోట ఎమ్మెల్యే శరత్‌ బచ్చేగౌడ ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండటమే కానీ మారలేదు. ఇలా ఇబ్రహీంతో ఆరంభమైన ఫిరాయింపులు ఎన్నికల నాటికి ఎన్ని మార్పులు తీసుకురానున్నాయనేది కీలకం కానుంది.

Updated Date - 2022-03-13T18:01:05+05:30 IST