Congressలో మరోసారి Cm రచ్చ

ABN , First Publish Date - 2022-05-20T17:47:59+05:30 IST

ముఖ్యమంత్రి ఎవరనేది బహిరంగంగా నాయకులు ఎవరూ వ్యాఖ్యానించరాదని, ఎక్కడా కార్యకర్తలు నినాదాలు చేయరాదంటూ కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరించినా అడపాదడపా

Congressలో మరోసారి Cm రచ్చ

- అవకాశమొస్తే దళితుల రుణాల మాఫీ: సిద్దరామయ్య      

- సిద్దు వ్యాఖ్యలతో డీకే శివకుమార్‌ వర్గీయుల అసంతృప్తి


బెంగళూరు: ముఖ్యమంత్రి ఎవరనేది బహిరంగంగా నాయకులు ఎవరూ వ్యాఖ్యానించరాదని, ఎక్కడా కార్యకర్తలు నినాదాలు చేయరాదంటూ కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరించినా అడపాదడపా ఎవరో ఒకరు ప్రకటిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్షనేత సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పోటీ పడుతున్నారు. సిద్దరామయ్య మరోసారి సీఎం కావాలంటూ పలు సందర్భాలలో చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్‌ బహిరంగంగా ప్రకటించారు. దీంతో జమీర్‌పై డీకే శివకుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో కాబోయే సీఎం అంటూ ఇద్దరికీ జిందాబాద్‌లు పలికిన సందర్భాలు లేకపోలేదు. ఇదే విషయమై ఢిల్లీలో పార్టీ  నేతలు ఒకటి రెండుసార్లు ఇద్దరికీ సూచించారు. సీఎం పేరు విషయంలో పంచాయితీ కూడా జరిగింది. ఢిల్లీ నేతల సూచనల మేరకు ముఖ్యమంత్రి ఎవరనేది గెలుపొందాక అధిష్టానం నిర్ణయిస్తుందని ఇద్దరూ ప్రకటించారు. దీంతో డీకే శివకుమార్‌ కాస్త సంతోషంగా ఉన్నారు. ఇలా సాగుతుండగానే మైసూరులో సిద్దరామయ్య బ్రిగేడ్‌ పేరిట ఓ గ్రూపు ద్వారా మరోసారి సీఎం కావాలనే రీతిలో ప్రచారం ప్రారంభించారు. గురువారం వసంతనగర్‌లోని మిల్లర్స్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్దరామయ్య మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్నప్పుడు దళితవర్గాల అభ్యున్నతి ప్రగతివైపు వెళ్లాలని భావించానని, అందుకే గ్రాంటును అరకోటి నుంచి కోటికి పెంచానన్నారు. కానీ తన తర్వాత సీఎంలుగా వచ్చినవారు అమలు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. తనకు మరోసారి సీఎంగా అవకాశం వస్తే దళితుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్నారు. ఎస్‌సీపీ, టీఎస్పీ గ్రాంట్లు(సబ్‌ప్లాన్‌) సహా కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినవారికే వినియోగిస్తామన్నారు. సిద్దరామయ్య మరోసారి సీఎం అయితే అంటూ వ్యాఖ్యానించడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది నాయకులు మాట్లాడరాదని అధిష్టానం సూచిస్తే ఆయన అటువంటి అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించడం డీకే శివకుమార్‌ వర్గీయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తానే సీఎం అని పదేపదే చెబుతుంటే మేమెందుకు పనిచేయాలి, అధిష్టానం ఎందుకనే రీతిలో డీకే అనుచరులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-05-20T17:47:59+05:30 IST