గౌరవల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: Revanth Reddy

ABN , First Publish Date - 2022-07-01T21:47:57+05:30 IST

Hyderabad: గౌరవల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రాజెక్టు రీ డిజైన్ వల్ల ముంపు గ్రామాల సంఖ్యను పెంచారని ధ్వజమెత్తారు.

గౌరవల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: Revanth Reddy

Hyderabad: గౌరవల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రాజెక్టు రీ డిజైన్ వల్ల ముంపు గ్రామాల సంఖ్యను పెంచారని ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. నిర్వాసితులకు దక్కాల్సిన న్యాయపర హక్కుల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

రీ డిజైన్ వల్ల ముంపు గ్రామాల సంఖ్య 8కి పెరిగింది.

‘‘తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో, రైతుల పొలాలకు నీళ్ల పేరుతో మీరు చేస్తున్న ఆరాచకాలు హద్దులు దాటుతోంది. రైతుల పొలాల్లో నీళ్ల సంగతి దేవుడెరుగు. వారి కళ్లలో మాత్రం నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారాలు చేసుకోవడం నాణేనికి ఒక వైపు మాత్రమే, కానీ నాణేనికి రెండో వైపు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

       కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన గౌరవల్లి ప్రాజెక్టులో మీ రీ డిజైన్ ఫలితంగా ముంపు గ్రామాల సంఖ్య 1 నుంచి 8 పెరిగింది. మొదట్లో ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపునకు గురైంది. రీ డిజైన్ ఫలితంగా అదనంగా మరో ఏడు గ్రామాలు.. తెనుగుపల్లి, మదెల్లపల్లి, సోమాజితండా, చింతల్ తండా, పొత్తపల్లి, జాలుబాయి తండా, తిరుమల్ తండా మునిగిపోతున్నాయి.

     తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరం ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు తక్కువ లేదని మీరే చెబుతున్నారు. గౌరవల్లి నిర్వాసితుల భూములకు మాత్రం ఆ ధర ఎందుకు వర్తింపజేయడం లేదు. పునరావాసానికి సంబంధించి కొందరికి ఎకరాకు రూ.2.10 లక్షలు, మరికొందరికి రూ.6.90 లక్షల పరిహారం అందించినట్లు మీ అధికారులే చెబుతున్నారు. కానీ అన్ని కుటుంబాలకు పరిహారం అందలేదని, సామాజిక సర్వేలో చాలా మంది తప్పిపోయారని నిర్వాసితులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు పూర్తికావొస్తున్నా 186 మందికి అసలు పరిహారమే అందలేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి, తర్వాత మేజర్లయిన వారిని కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికి రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి.

     ప్రాజెక్టుల కోసం రైతులు భూములను త్యాగం చేశారు. ఇంత చేస్తే నిర్వాసితులకు ఏం మిగిలింది? పరిహారం అడిగిన పాపానికి వారిపై లారీచార్జ్ చేయడమే కాకుండా అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారు. రైతుల భూములు లాక్కుని... పరిహారం ఇవ్వకపోగా అరెస్టులు చేయడం.. బేడీలు వేయడం.. గజ దొంగల్లా వారిని ట్రీట్ చేయడం అత్యంత ఆటవిక చర్య. గతంలో నిర్వాసితుల తరపున మా ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్ రావును కలిస్తే ఏవో మాటలు చెప్పారు తప్ప సమస్యను పరిష్కరించలేదు.

     గతంలో ఖమ్మంలో అదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారు. ఇప్పుడు గౌరవల్లి రైతులకు బేడీలు వేసి వారి ఉసురు పోసుకుంటున్నారు. రైతు రాజ్యం అంటే ఇదేనా? పది మందికి అన్నం పెట్టే అన్నదాత చేతికి సంకెళ్లు వేయడం యావత్ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని దృశ్యం. దీనికి మీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. నిర్వాసితులు కోరుకున్న విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి.  2013 భూసేకరణ చట్టం  ప్రకారం పరిహారం చెల్లించాలి. లేకపోతే నిర్వాసితుల పక్షాన వారికి దక్కాల్సిన న్యాయపర హక్కుల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది.’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

       సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఉంది ఈ  గౌరవెల్లి ప్రాజెక్ట్‌. జూన్ 14వ తేదీన హుస్నాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట జరిగింది. దీంతో లాఠీచార్జి చేసి 17 మంది భూనిర్వాసితులపై కేసులు నమోదు చేశారు. ఇందులో బద్దం శంకర్‌రెడ్డి, అంగెటి తిరుపతిరెడ్డి, రాగి శ్రీను, భూక్య సక్రూలను అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ జైలుకు తరలించారు. పోలీసులు వారి చేతులకు సంకెళ్లు వేసి హుస్నాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. వారి రిమాండ్‌ను జడ్జి మరో 14 రోజులకు పొడిగించారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు, భూ నిర్వాసితులకు మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు కేవలం తమపైనే కేసులు నమోదు చేసి  కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని నిర్వాసిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దొంగతనం, సంఘ విద్రోహులు, హత్యనేరం చేసిన నిందితుల్లాగా భూ నిర్వాసితులకు సంకెళ్లు వేస్తారా..? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ భూ నిర్వాసితులను బేడీలు వేసి కోర్టుకు తీసుకరావడం అమానుషమని, వారు హంతకులు కాదని, వారి హక్కుల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశారే తప్పా ఎలాంటి నేరం చేయలేదని పలువురు బహిరంగంగానే పోలీసులను విమర్శించారు. 

Updated Date - 2022-07-01T21:47:57+05:30 IST