Hardik patel లేఖలో సారాంశమిదే...

ABN , First Publish Date - 2022-05-18T23:55:29+05:30 IST

''రామమందిరం, 370 అధికరణ వంటి పలు అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అవరోధాలు (Roadblock) సృష్టించడానికే పరిమితమైంది'' అని పాటిదార్..

Hardik patel లేఖలో సారాంశమిదే...

న్యూఢిల్లీ: ''రామమందిరం, 370 అధికరణ వంటి పలు అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అవరోధాలు (Roadblock) సృష్టించడానికే పరిమితమైంది'' అని పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ అన్నారు. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్ బుధవారంనాడు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. గుజరాత్ పరంగానే కాకుండా దేశానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన తప్పుపట్టారు. గుజరాత్‌పై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదని, కేవలం విధానాలు, కార్యక్రమాలను వ్యతిరేకించడానికే పరిమితమవుతూ వచ్చిందని, అధికార పార్టీకి ప్రత్నామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ వైపు చూసేలా ఎలాంటి ప్రయత్నాలను కాంగ్రెస్ చేయలేకపోయిందని అన్నారు.


జాతీయ ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాల విషయంలోనూ సమర్ధవంతంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైందని హార్దిక్ పటేల్ తన లేఖలో పేర్కొన్నారు. 370వ అధికరణ, అయోధ్యలో రామమందిరం, సీఏఏ-ఎన్ఆర్‌సీ, జీఎస్‌టీ  అమలు వంటి పలు అంశాల్లో కాంగ్రెస్ అవరోధాలు సృష్టించిందని విమర్శించారు. ప్రజాక్షాంక్షను ప్రతిబింబించే ఇలాంటి అంశాల విషయంలో పాజిటివ్ పాత్ర వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేదన్నారు. ''అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, 370వ అధికరణ రద్దు కావచ్చు, జిఎస్‌టీ అమలు కావచ్చు...వీటన్నింటికీ ఇండియా చిరకాలంగా ఒక పరిష్కారం కోరుకుంటోంది. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ Roadblock పాత్రే పోషించింది. ఆటంకాలు కలిగించింది. ఇండియాకు, ముఖ్యంగా గుజారాత్‌‌కు, పాటిదార్ వర్గానికి సంబంధించిన అంశాలకు వచ్చే సరికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడానికే కాంగ్రెస్ పరిమితమైంది. ప్రజలకు సరైన రోడ్‌మ్యాప్ చూపించలేకపోయంది. ఇందువల్లే  కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ తిరస్కారానికి గురైంది'' అని పాటిల్ ఘాటుగా విమర్శించారు.


రాహుల్‌పైనా విమర్శలు...

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా హార్దిక్ నిశిత విమర్శలు చేశారు. ''దేశం క్లిష్ట దశలో ఉన్నప్పుడు, రాహుల్ అవసరం ఉందనుకున్నప్పుడు ఆయన విదేశాల్లో ఉండేవారు. గుజరాత్ నేతలు సైతం రాష్ట్ర పర్యటన వచ్చే కేంద్ర నాయకులను ప్రజలతో మమేకమయ్యేలా యాత్రలు తీసేందుకు బదులు... ఆ నేతల అవసరాలు తీర్చేందుకే ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు'' అని హార్దిక్ తప్పుపట్టారు.

Updated Date - 2022-05-18T23:55:29+05:30 IST