Advertisement

మళ్ళీ వాయిదా

Jan 23 2021 @ 00:48AM

పార్టీఅధ్యక్ష ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శుక్రవారం తీసుకున్న నిర్ణయం అనూహ్యమైనది. సమస్య పరిష్కారాన్ని మరింతకాలం వాయిదావేయాలనీ, యథాతథస్థితిలో కొనసాగాలని అధిష్ఠానం నిర్ణయించింది. సమీపగతంలోనే రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ అంతర్గతంగా ఎదుర్కొన్న సంక్షోభాన్ని గమనించిన తరువాత, శుక్రవారం కీలకమైన నిర్ణయం వెలువడుతుందన్న నమ్మకం చాలామందికి కలిగింది. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ ఖరారవుతుందనీ, బడ్జెట్‌ సమావేశాలతో పాటుగానే ఈ పని కూడా పూర్తవుతుందనీ, రాహుల్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారనీ, ఏప్రిల్‌లో జరిగే ప్లీనరీలో తనకంటూ ఓ బలమైన యువ బృందాన్ని ప్రకటిస్తారని  మీడియా అంచనాలు వేసింది. ఇప్పుడు జూన్‌కల్లా కొత్త అధ్యక్షులవారిని ప్రతిష్ఠించుకోవాలని పార్టీ సంకల్పం చెప్పుకుంది. అంత వరకూ ఆగకూడదనుకున్నా రాష్ట్రాల ఎన్నికలు అందుకు అడ్డంపడుతున్నాయని పార్టీ వాదన. ఈ ఎన్నికలు హఠాత్తుగా ఊడిపడినవేమీ కావు. ఈ ఏడాది ఆయా రాష్ట్రాల్లో అవి జరుగుతున్న విషయమూ, ఎప్పుడు జరిగేదన్నదీ తెలిసిన అంశాలే. అందువల్ల, పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికలు పూర్తయ్యాకే ఫుల్‌టైమ్‌ అధ్యక్షుల ఎన్నిక ఆరంభించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయ ప్రభావం పార్టీ పెద్దకు ప్రత్యక్షంగా అంటకుండా సీడబ్ల్యూసీ జాగ్రత్తపడిందని భావించాలి.


పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో రాహుల్‌తో పాటు ఎందరు బరిలో ఉన్నా, అంతిమంగా నెగ్గేది ఎవ్వరో అందరికీ తెలిసిందే అయినా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మచ్చ వెంటనే తమకు అంటించుకోవడానికి ఎవ్వరు మాత్రం సిద్ధంగా ఉంటారు? అందువల్ల రాష్ట్రాల ఎన్నికల ముందు అధికారికంగా పార్టీ పగ్గాలు అందుకొని, ఫలితాల తరువాత అప్రదిష్టపాలయ్యేకంటే, అవి ముగిసిన తరువాతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఉత్తమోత్తమం. పుదుచ్చేరిలో తిరిగి గెలిచి తమ ప్రభుత్వమే ఏర్పడినా, తమిళనాడులో పొత్తులో భాగంగా కాసిన్ని విజయాలు సాధించినా, కేరళలో అధికారం అందుకోగలిగినా కొత్త అధ్యక్షులవారి ఖాతాలో ప్రశంసలు కురుస్తాయి. మిగతా అన్నింటినీ అటుంచినా, కేరళ, పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ కనుక తన పనితీరు నిరూపించుకోలేకపోతే ఆ మచ్చ రాహుల్‌కు ప్రత్యక్షంగా అంటకుండా చూడటం మరింత అవసరం. ఇలా ఏవో లెక్కలూ అంచనాల మధ్య అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు వద్దనుకున్నది అధిష్ఠానం. సంస్థాగత ఎన్నికలు జరిపించాలనీ, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనీ కోరుతూ డిసెంబరులో 23మంది సీనియర్ నాయకులు సోనియాకు ఘాటైన లేఖరాసిన తరువాత, పార్టీ అధ్యక్షురాలు వారిని సమాధానపరచడంలో భాగంగా ఏవో రోడ్‌మ్యాప్‌లంటూ ముందుకువచ్చాయి. ఫిబ్రవరికల్లా కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయన్న హామీతో పాటు, అంతలోగా షిండేవంటివారిని తాత్కాలికంగా కుర్చీలో కూచోబెట్టాలన్న ప్రతిపాదనలూ సాగాయి. ఇప్పటి నిర్ణయంతో కనీసం మరో ఐదునెలలు పార్టీ అదే స్థితిలో కొనసాగుతుందని అర్థం.


అధ్యక్షస్థానంలో ఉండికూడా ఎప్పుడు దానిని వారసులకు అప్పగిద్దామా అని చూస్తున్న సోనియాగాంధీ, అందుకోవడానికి మొన్నటివరకూ మానసికంగా సిద్ధంకాని రాహుల్‌ గాంధీ మధ్య పార్టీ నలిగిపోతోంది. ఇప్పటికీ ఆయన తయారుగా ఉన్నదీ లేనిదీ తెలియదు. శుక్రవారం సమావేశంలో సత్వరమే ఎన్నికలు జరగాలని ఎవరో అడిగితే అశోక్‌ గెహ్లాట్‌, ఆనంద్‌శర్మ వారిపై గట్టిగా కేకలేశారట. సార్వత్రక ఎన్నికల్లో ఓటమిని ఆధారంగా చేసుకొని రాహుల్‌ రాజీనామా అస్త్రంతో పార్టీలోని కురువృద్ధులపై కక్షసాధించే ప్రయత్నం చేశారు. రాహుల్‌ సాధించేదేమిటో తెలియదు కానీ, ఖాళీ అయిన ఆ స్థానాన్ని తాత్కాలికం అంటూనే సోనియా ఏడాదిన్నరగా మోస్తున్నారు. ప్రియాంక పగ్గాలు చేపడితే బాగుండునన్న కార్యకర్తల ఆశలు కూడా క్రమంగా వీగిపోయాయి. కనీసం, ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగినా క్షేత్రస్థాయిలో కాస్తంత ఉత్సాహం నింపవచ్చునన్న కిందిస్థాయి నాయకుల కలలూ శుక్రవారం నిర్ణయంతో కల్లలైనాయి. జూన్‌కల్లా కొత్త అధ్యక్షుల బాధ్యతల స్వీకరణ జరుగుతుందా అన్నది కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదే ఆధారపడవచ్చు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.