Congress Chintan Shivir : మైనారిటీలను ప్రభుత్వం హింసిస్తోంది : సోనియా గాంధీ

ABN , First Publish Date - 2022-05-13T21:27:27+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలను

Congress Chintan Shivir : మైనారిటీలను ప్రభుత్వం హింసిస్తోంది : సోనియా గాంధీ

ఉదయ్‌పూర్ (రాజస్థాన్) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలను హింసిస్తోందని, మహాత్మా గాంధీ హంతకులను కీర్తిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థల విధానాలపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆమె కాంగ్రెస్ మేధోమథనం సమావేశంలో మాట్లాడారు. 


కాంగ్రెస్ మేధోమథనం సమావేశాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్’ పేరుతో మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలను సోనియా గాంధీ ప్రారంభించారు. బీజేపీ, ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థల వల్ల ఈ దేశం ఎదుర్కొంటున్న లెక్కలేనన్ని సవాళ్ళ గురించి చర్చించుకునేందుకు, అదేవిధంగా అర్థవంతమైన ఆత్మావలోకనం చేసుకునేందుకు ఈ సమావేశాల వల్ల మనకు అవకాశం లభించిందని చెప్పారు. 


‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ అనే నినాదాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన సహచరులు వినిపిస్తున్నారని, వారి దృష్టిలో ఈ నినాదం నిజమైన అర్థం ఏమిటో ఇప్పుడు చాలా స్పష్టంగా, అత్యంత బాధాకరంగా తెలిసిందని చెప్పారు. ఈ నినాదం అర్థాన్ని వివరిస్తూ, దేశంలో విభజనను సృష్టించి, కొందరిని శాశ్వతంగా ఓ వైపునకు చేరే విధంగా చేయడం, ప్రజలు నిరంతరం భయం, అభద్రతా భావాలతో జీవించేలా చేయడం అని తెలిపారు. దీనిని మరింత వివరిస్తూ, మన సమాజంలో అంతర్భాగం, మన గణతంత్ర దేశంలో సమాన స్థాయి పౌరులు అయిన మైనారిటీలను హింసాత్మకంగా టార్గెట్ చేసి బాధించడం, తరచూ క్రూరంగా హింసించడం అని తెలిపారు. 


ఇది మన ముందు ఉన్న అనేక అంశాలపై ఆలోచించవలసిన సందర్భం కూడానని తెలిపారు. జాతీయ సమస్యల గురించి ఆలోచించడానికి, పార్టీ వ్యవస్థ గురించి అర్థవంతంగా ఆత్మావలోకనం చేసుకోవడానికి ఇది ఓ అవకాశమని తెలిపారు. పార్టీలో మార్పులు ప్రస్తుతం చాలా అవసరమన్నారు. మన పనితీరును మార్చుకోవలసిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత ఆకాంక్షల కన్నా పార్టీకి పెద్ద పీట వేయాలన్నారు. ‘‘పార్టీ మనకు ఎంతో ఇచ్చింది. మనం పార్టీకి తిరిగి ఇవ్వవలసిన సమయం ఇది’’ అన్నారు. 


Read more