రాహుల్, రైతు శ్రేయస్సు విస్మరిస్తే ఎలా?

ABN , First Publish Date - 2020-10-16T05:47:39+05:30 IST

రైతులను ఆదుకోవడానికై కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలనే మోదీ సర్కార్ చట్ట రూపంలోకి తీసుకువచ్చింది. మరి రైతులోకానికి ఇతోధిక మేలు చేస్తున్న కొత్త వ్యవసాయ....

రాహుల్, రైతు శ్రేయస్సు విస్మరిస్తే ఎలా?

రైతులను ఆదుకోవడానికై కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలనే మోదీ సర్కార్ చట్ట రూపంలోకి తీసుకువచ్చింది. మరి రైతులోకానికి ఇతోధిక మేలు చేస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తూర్పారపట్టడంలో ఔచిత్యమున్నదా?


గ్రామస్వరాజ్యంతోనే శ్రీరామరాజ్యం సాధ్యం. నిజమే. అయితే స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి నేటివరకు రైతులను ఆకర్షించడానికి చెబుతున్న ఈ సూక్తులు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. లాల్ బహుదూర్ శాస్త్రి ‘జై జవాన్ - జై కిసాన్’ నినాదంతో సరిహద్దుల వెంట దేశ భద్రత కోసం త్యాగాలు చేసే సైనికులతోబాటు దేశంలో ప్రజల ఆహార భద్రత కోసం పరిశ్రమించే రైతాంగానికి స్ఫూర్తి నిచ్చారు. అయితే కాలక్రమేణ అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోవల్సిన దుస్థితి ఏర్పడ్డది. మధ్యవర్తుల రూపంలో ఏర్పడిన దళారీ వ్యవస్థ చక్రబంధంలో ఒకవైపున రైతులు నష్టాలలో నలిగిపోయారు. అలాగే వినియోగదారులు అయిన ప్రజలూ నష్టపోయారు. గత ఏడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సామాజిక కార్యకర్తలు దేశ పాలకులను ప్రశ్నించిన అంశం ఒక్కటే- ఏదైనా వస్తువును ఉత్పత్తి చేసిన లేదా సేవలను అందిస్తున్న సంస్థ లేదా వ్యక్తి స్వేచ్ఛ గా దేశంలో ఎక్కడైన తాము సొంతంగా నిర్ణయించిన ధరలకు మార్కెటింగ్ చేసుకోగలుగుతుంటే, రైతు పండించిన పంటకు ధర ముందుగానే రైతుకు ఎందుకు తెలియడం లేదు? రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛ గా దేశంలో తమకు నచ్చిన ప్రాంతాలలో ఎందుకు మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నారు? దళారుల కమీషన్ వ్యవస్థ వల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతుల కష్టం దోపిడీ అవుతుందనేది జనహితుల ఆవేదన. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలనే తలంపుతో గడచిన ఆరు సంవత్సరాల్లో అనేక సంస్కరణలను అమలు పరచింది. పలు చట్టాలు చేసింది. ముఖ్యంగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో భూసార పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలతో కూడిన విధానాలను ప్రవేశపెట్టి భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది. తద్వారా ఏ పంట వేస్తే నాణ్యతతో కూడిన అధిక దిగుబడి వస్తుందన్న అవగాహనను రైతులకు కల్గించారు. అంతే కాకుండా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను ఇతోధికంగా మెరుగుపరచడం జరిగింది. ఎరువుల ధరల నియంత్రణ, వేప పూత ఆధారిత ఎరువుల సరఫరా ద్వారా నకిలీ ఎరువుల వ్యాపారులకు చెక్ పెట్టడం జరిగింది. ఎరువుల కోసం రైతులు గంటలకొద్దీ క్యూలలో నిలబడవలసిన అవసరం లేకుండా చేశారు. కొరత లేకుండా సకాలంలో రైతులకు ఎరువులు అందేవిధంగా చేశారు. అలాగే సకాలంలో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సాహించారు.


రైతులను ప్రతికూల పరిస్థితుల నుండి బయటవేసి ఆదుకోవడానికి ఫసల్ బీమా యోజనను సమర్థంగా అమలు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం క్రింద 75 వేల కోట్ల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను 12.50 కోట్ల రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. వీటిని కొనసాగిస్తూనే, 2019లో మరల అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమానికి ప్రధాని మోదీ మరిన్ని చర్యలు చేపట్టారు. స్వామినాధన్ కమిషన్ సిఫారసు మేరకు పెట్టుబడికి 50% అదనంగా ఆదాయం వచ్చేవిధంగా, వినియోగదారులకు చౌకగా వ్యవసాయ ఉత్పత్తులు అందించేందుకూ రెండు కొత్త చట్టాలను తీసుకువచ్చారు. వినియోగదారుల రక్షణ చట్టానికి అవసరమైన సవరణలు చేశారు. 


పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన నూతన వ్యవసాయ చట్టాలలో ఒకటైన ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం - సౌలభ్యం) చట్టం- 2020’ ద్వారా రైతులు తమ ఫలసాయాన్ని వారు ఉత్పత్తి చేసిన రాష్ట్రంలో కానీ లేదా దేశంలో ఎక్కడైనా ఎటువంటి ఆటంకం లేకుండా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల రైతులు స్వేచ్ఛగా తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ లేదా మండీల వెలుపల తమకు నచ్చిన ధరకు అమ్ముకొనే వెసులుబాటు కలిగింది. దీనివల్ల, రైతులకు మంచి ధర రావడమే కాకుండా రవాణా, పన్నులు/లైసెన్స్ ఫీజులు వల్ల కలిగే ఆర్థిక భారంలో బాగా తగ్గుదల కనబడుతుంది. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలలో పన్నుల వసూళ్లు 8% వరకు ఉంది. ఈ చట్టం ద్వారా నిర్వహణ సౌలభ్యం కోసం ఈ-ట్రేడింగ్ ద్వారా తమ ఉత్పత్తులను తేలికగా ఇతరులకు అమ్ముకునే అవకాశం అన్నదాతకి కలిగింది. ఎవరైతే రైతుల నుండి కొనుగోలు మార్కెటింగ్‌లో భాగస్వామ్యం అవుతారో, వారే రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. మరో కొత్త వ్యవసాయ చట్టం ‘రైతు (సాధికారత-రక్షణ) ధరల భరోసా ఒప్పందం- వ్యవసాయ సేవ చట్టం -2020’ ద్వారా ‘ఒకే దేశం - ఒకే వ్యవసాయ మార్కెట్’కు అంకురార్పణ జరిగింది. రైతులు నేరుగా వ్యవసాయ ఆధారిత వ్యాపార సంస్థలు, టోకు, చిల్లర వర్తకులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారులతో అమ్మకాల లావాదేవీలు నెరపేందుకు మార్గం సుగమమయ్యింది.


రైతులు ఆయా సంస్థలతో చేసుకునే ఒప్పందాలకు రక్షణ కల్పించడమే కాక, ఉత్పత్తుల అమ్మకాలు జరిగిన మూడు రోజులలో రైతులకు చెల్లింపులు జరిగే విధంగా చట్టం చేయడమైనది. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసిన సంస్థలు ఒప్పందాల అమలులో ఇబ్బందులు వస్తే, పరిష్కారానికి జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. రైతులకు, వాణిజ్య సంస్థల మధ్య ఒప్పందాల ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల మొదలైన సేవలను పొందడమే కాకుండా ముందుగానే రైతు తమ ఉత్పత్తి ధర నిర్ణయించుకోవడం ద్వారా తమ ఆదాయం పెంచుకోవచ్చు. ఈ నూతన చట్టాలతోపాటు, వినియోగదారుల రక్షణ చట్టం సవరణ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ దిగుమతులపై నియంత్రణ, వివిధ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నిల్వల పై ఆంక్షలు మొదలైన అంశాలలో అనేక మార్పులను చేయడం జరిగింది.


మన దేశంలో రైతులకు అధిక దిగుబడి వచ్చినప్పుడు లేదా ఇతర దేశాల నుండి వ్యవసాయ ఆహార ఉత్పత్తులు అధిక మొత్తంలో దిగుమతి అయినప్పుడు మన రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటించి ధాన్యం, పప్పు దినుసులు, మొక్కజొన్న తదితర వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు రేషన్ అందిస్తుంది. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వలు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా, మండీల ద్వారా, మార్క్ ఫెడ్ ద్వారా ఇలా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను గోదాంలలో భద్రపరచి రాష్ట్రాలకు అర్హమైన దామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పై సప్లై చేస్తోంది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల పై ప్రకటించే కనీస మద్దతు ధరను కొనసాగిస్తున్నట్లు కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో కొత్త వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధర వ్యవస్థ రద్దు అవుతుందన్న ప్రతిపక్షాల ప్రచారంలో నిజం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారు. అలాగే రాష్ట్రాలలో స్థానిక వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతాయని చట్టంలో పేర్కొనడంతో, వాటిని మూత వేస్తారనే మరో వాదనలో పసలేదని రుజువయింది. ఈ కొత్త వ్యవసాయ చట్టాల అమలులో రాష్ట్రప్రభుత్వాల బాధ్యత చాల కీలకమైనది. ఈ చట్టాలను తీసుకురావడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే హామీని ప్రధాని మోదీ నెరవేర్చారు. మరి కొత్త వ్యవసాయ చట్టాలను సరిగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలూ రైతుల సంక్షేమం విషయమై తమ చిత్తశుద్ధి చాటాలి.


రైతులను ఆదుకోవడానికై కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలనే మోదీ సర్కార్ చట్ట రూపంలోకి తీసుకువచ్చింది. మరి రైతులోకానికి ఇతోధిక మేలు చేస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తూర్పారపట్టడంలో ఔచిత్యమున్నదా? 


-లంకా దినకర్

Updated Date - 2020-10-16T05:47:39+05:30 IST