పంజాబ్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ వాయిదా తప్పదా?

ABN , First Publish Date - 2021-12-31T21:27:22+05:30 IST

శాసన సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్

పంజాబ్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ వాయిదా తప్పదా?

న్యూఢిల్లీ : శాసన సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో బీజేపీ, సమాజ్‌వాదీ, ఆప్ తదితర పార్టీలు కృషి చేస్తుండగా, పంజాబ్‌లో జనవరి 3న తలపెట్టిన కాంగ్రెస్ సభ వాయిదా పడక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. 


రాహుల్ గాంధీ బుధవారం ఉదయం వ్యక్తిగత కార్యక్రమాల కోసం విదేశాలకు వెళ్ళారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ఓ నెల రోజులపాటు ఆయన విదేశాల్లో పర్యటించారు. సరిగ్గా ఈ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు స్వదేశానికి వచ్చారు. ఆయన తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ నేతలను ఇరుకున పెడుతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జీవాలా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కొద్ది రోజులు వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్ళారని, బీజేపీ, దాని మీడియా మిత్రులు అనవసరంగా వదంతులను ప్రచారం చేయవద్దని కోరారు. 


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికలు త్వరలో జరుగుతాయి. ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలై ఉంది. అదే విధంగా రాజకీయ పార్టీలు గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో జనవరి 3న పంజాబ్‌లోని మోగా జిల్లాలో బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ప్రధాన ఆకర్షణగా రాహుల్ గాంధీ నిలవాలని కోరుకుంది. ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించింది. కానీ ఆయన వ్యక్తిగత పర్యటన పేరుతో విదేశాలకు వెళ్ళిపోవడంతో, ఈ సభను వాయిదా వేయక తప్పదేమోనని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.


Updated Date - 2021-12-31T21:27:22+05:30 IST