కాంగ్రెస్ సారథిపై కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-29T23:50:12+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి సారథి లేరని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్

కాంగ్రెస్ సారథిపై కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి సారథి లేరని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తనకు తెలియదన్నారు. కేంద్రంలో కూర్చున్న 20 మందితో ప్రజాస్వామ్యం కొనసాగదని వ్యాఖ్యానించారు. తాము తమ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూనే ఉంటామని చెప్పారు.  పంజాబ్‌లో కాంగ్రెస్ సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో నవజోత్ సింగ్ సిద్ధూకు విభేదాలు రావడంతో కొద్ది నెలలపాటు సంక్షోభం ఏర్పడింది. ఆ తర్వాత జూలై 23న సిద్ధూకు పీపీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ముఖ్యమంత్రి పదవికి దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేశారు. సిద్ధూ అకస్మాత్తుగా మంగళవారం పీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.  సిద్ధూ  రాజీనామా చేయడంతో ఆయనకు సన్నిహితులైన ఓ మంత్రి, ముగ్గురు కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొద్ది నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి.


కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలని గత ఏడాది ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీకి పూర్తి కాలపు, సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని ఈ నేతలంతా కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహించాలని, పార్టీ పునరుజ్జీవానికి సమష్టి మార్గదర్శనం కోసం సంస్థాగత నాయకత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 


ఈ లేఖ రాసిన 23 మందిలో ఒకరైన కపిల్ సిబల్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం పంజాబ్‌లో పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన కాంగ్రెస్ నేతల తరపున తాను మీడియాతో మాట్లాడుతున్నానని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి, సీడబ్ల్యూసీకి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ పార్టీ నాయకత్వం చేపట్టబోయే చర్యల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. తాము (జీ-23 నేతలు)  పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారం కాదని, పార్టీ అధిష్ఠానానికి సన్నిహితులుగా పేరుపడినవారు అధిష్ఠానాన్ని వదిలిపెట్టారని, అధిష్ఠానానికి సన్నిహితులుకానివారుగా పేరుపడినవారు అధిష్ఠానంతో కలిసి ఉన్నారని చెప్పారు. 


సీడబ్ల్యూసీలో చర్చించాలి

ప్రస్తుతం మనం ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నామనే విషయంపై చర్చించేందుకు సీడబ్ల్యూసీని వెంటనే సమావేశపరచాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పార్టీ సీనియర్ నేత ఒకరు లేఖ రాసినట్లు లేదా త్వరలో రాయబోతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. తమ పార్టీకి ప్రెసిడెంట్ లేరని, అందువల్ల ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తమకు తెలియదని అన్నారు. ‘‘మాకు తెలుసు కానీ ఏమీ తెలియదు’’ అన్నారు. 


జీ హుజూర్‌ నేతలం కాము

తాము జీ-23 నేతలమని, జీ హుజూర్ 23 నేతలం కాదని అందరూ తెలుసుకోవాలన్నారు. తాము మాట్లాడుతూనే ఉంటామన్నారు. తమ డిమాండ్లను పునరుద్ఘాటించడం కొనసాగిస్తామని చెప్పారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయంపై దేశంలోని ప్రతి కాంగ్రెస్ నేత ఆలోచించాలన్నారు. పార్టీని విడిచిపెట్టినవారంతా తిరిగి రావాలని, కేవలం కాంగ్రెస్ మాత్రమే ఈ గణతంత్ర దేశాన్ని కాపాడగలదని అన్నారు. 


పాకిస్థాన్‌కు ప్రయోజనం

సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఈ విధంగా జరుగుతోందంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల పాకిస్థాన్‌కు, ఐఎస్ఐకి ప్రయోజనం కలుగుతుందన్నారు. పంజాబ్ చరిత్ర మనకు తెలుసునని, అక్కడ తీవ్రవాదం పెరగడం గురించి తెలుసునని అన్నారు. సమైక్యంగా ఉన్నామనే భరోసాను కాంగ్రెస్ కల్పించాలన్నారు. ఎవరికైనా సమస్యలుంటే, చర్చించవచ్చునన్నారు. 


కపిల్ సిబల్ ప్రస్తావించిన నేత గులాం నబీ ఆజాద్ అని తెలుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ సంక్షోభంపై చర్చించేందుకు వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరచాలని సోనియా గాంధీకి గులాం నబీ ఆజాద్ లేఖ రాశారని సమాచారం. 


Updated Date - 2021-09-29T23:50:12+05:30 IST