Agnipath protests : జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ ధర్నా ఆదివారం

ABN , First Publish Date - 2022-06-18T18:22:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసన తెలుపుతున్న

Agnipath protests : జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ ధర్నా ఆదివారం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసన తెలుపుతున్న యువతకు కాంగ్రెస్ (Congress) సంఘీభావం తెలిపింది. యువతకు మద్దతుగా ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద పెద్ద ఎత్తున సత్యాగ్రహ (Satyagraha) ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారని తెలిపింది. 


రక్షణ దళాల్లోకి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించిన అగ్నిపథ్ (Agnipath) పథకంపై దాదాపు ఏడు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఇళ్ళపై నిరసనకారులు దాడి చేశారు. 


యువత నిరసనల కారణంగా దేశవ్యాప్తంగా శుక్రవారం 340 రైళ్ళ రాకపోకలపై ప్రభావం పడింది. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, 94 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, 140 ప్యాసింజర్ రైళ్ళ రాకపోకలను రద్దు చేశారు. 65 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, 30 ప్యాసింజర్ రైళ్ళ సేవలను పాక్షికంగా రద్దు చేశారు. 


కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, దేశ ప్రజలకు మేలు చేయని పథకాలను ప్రకటించడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని మండిపడింది. బీజేపీ నేతల ఆలోచనారహిత, అవివేక చర్యల వల్ల యావత్తు దేశం నేడు మండుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. 


Updated Date - 2022-06-18T18:22:20+05:30 IST