పునర్వైభవం దిశగా కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-04-15T07:41:35+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో...

పునర్వైభవం దిశగా కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలన్నా, తెలంగాణలో కాంగ్రెస్‌ పనైపోయిందనే ప్రచారానికి తెరదించాలన్నా నాగార్జున సాగర్‌‍లో కాంగ్రెస్‌ జెండా ఎగరేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదనే భావనకు పార్టీ అధిష్ఠానం వచ్చింది. ఆ దిశగానే ‘ఆపరేషన్‌ సాగర్‌’ ఫార్ములాను సిద్ధం చేసింది. 


నాగార్జున సాగర్‌‍లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఇరుపార్టీలూ బలంగా ఉన్నాయి. యువత మద్దతుతో బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వాస్తవానికి 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఏడు వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. యాదవ సామాజిక ఓటర్ల మద్దతుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య యాదవ్‌ నాటి ఎన్నికల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితా రెడ్డికి నాటి ఎన్నికల్లో 1.8 శాతం (సుమారు 2,600 ఓట్లు) మాత్రమే వచ్చాయి.


ఆ తరువాత 2019 ఏప్రిల్‌‍లో జరిగిన లోక్‌‍సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‍కు సాగర్‌ నియోజకవర్గంలో మూడు వేల మెజారిటీ లభించింది. తర్వాత మే నెలలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 75,050 ఓట్లు సాధిస్తే, కాంగ్రెస్‌ పోటాపోటీగా 68,871 ఓట్లు సాధించి సవాల్‌ విసిరింది. అదే సమయంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 64 స్థానాలకు గాను 26 సాధించింది. ఐదూ పదీ ఓట్ల తేడాతో పలు సీట్లు ఓడిపోయింది. 


గత ఏడాది డిసెంబరులో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించడంతో అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆయన సాగర్‌ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదన్న భావన స్థానిక ప్రజల్లో ఉంది. జానారెడ్డి హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందనే చర్చ మొదలైంది. పైగా ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ వర్గ విబేధాలతో సతమతమవుతోంది. 


కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌‌తో సహా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు కూడా ఇదే పల్లవి ఎత్తుకున్నారు. నిజం గానే కాంగ్రెస్‌ యాభై ఏళ్ల పాలనలో తెలంగాణకు మంచేమీ జరగలేదా? తెలంగాణ అభివృద్ధిలో అసలు కాంగ్రెస్‌ పాత్రే లేదా? లేక ప్రజలను మభ్యపెట్టడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఈ ప్రచారానికి తెరలేపారా? చరిత్రలోకి వెళ్లి వాస్తవాలను తెలుసుకుందాం.


తెలంగాణలో భారీ ప్రాజెక్టులు నాగార్జున సాగర్‌, శ్రీశైలం, పోచంపాడు, ఎస్సార్సీపీ ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌ హయాంలో నిర్మించినవే. వీటివల్ల బీడు భూములుగా మారిన లక్షలాది ఎకరాలు నేడు నీటితో కళకళలాడుతున్నాయి. ఒక్క నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోనే దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించిన ఘనత నిస్సందేహాంగా కాంగ్రెస్‌ పార్టీదే. టీఆర్‌ఎస్‌ పాలనలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు నీరు అందడం లేదు. భారీ ఎత్తున అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలూ ఉన్నాయి. 


సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని యూపీఏ పాలనలో చేపట్టిన విప్లవాత్మక చర్యలు ఎన్నో ఉన్నాయి. 2004కు ముందు వరకు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు గాలికొదిలేసిన పేదల జబితా చాంతాడంత ఉండేది. ఇకపై ఎవరూ పని లేదనే కారణంతో మరణించకూడదనే లక్ష్యంతో యూపీఏ పాలనలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ విప్లవాత్మక చట్టంతో పేదల ఇళ్లల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాల్సిందేననే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దే.


తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఏపీలో కాంగ్రెస్‌ భూ స్థాపితం అవుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని, దళితుడినే తెలంగాణ తొలి సీఎం చేస్తానని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చివరకు మాట తప్పి ముఖ్యమంత్రి పదవి కోసం సోనియాగాంధీనే వెన్నుపోటు పొడిచారు. 1200 మంది అమరవీరుల బలిదానాలతో తెలంగాణ ఆవిర్భవిస్తే, వారి త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తన స్వార్థపూరిత కుటుంబ ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. 


ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ‘ఉద్యోగాల భర్తీ’ అనే అంశం ప్రధాన ప్రతిపక్షాల, నిరుద్యోగుల ప్రధాన నినాదమైంది. కానీ కాంగ్రెస్‌ హయాంలో ఏనాడూ ఈ పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి, పీవీ నర్సింహారావు మొదలు కుని డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి వరకు ఏటా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేసిన చరిత్ర ఉంది. ‘నీళ్లు–నిధులు–నియామకాలు’ ప్రధాన నినాదంగా ఏర్పడిన రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలనలో ఈ మూడు అంశాల్లోనూ విఫలమైంది. 


గత రెండేళ్ళుగా తెలంగాణలోని కాంగ్రెస్‌ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్న మాట వాస్తవం. కానీ కొద్దిరోజులుగా పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్‌ నెలకొంది. అందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాకూర్‌ నడుం బిగించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణను అమలు చేస్తుండటం మొదటిది కాగా... ఇటీవల సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన రైతులతో ముఖాముఖి యాత్ర, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాద యాత్ర రెండో కారణం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు పెంచుకుని భారీ మెజారిటీ సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జానారెడ్డి భావిస్తుండగా, జానారెడ్డి గెలుపుతో కాంగ్రెస్‌‍కు ఢోకా లేదని, టీఆర్‌ఎస్‌‍కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే తప్ప బీజేపీ కాదనే సంకేతాలను తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు పంపాలని టీపీసీసీ భావిస్తోంది. ఆ దిశగానే ‘ఆపరేషన్‌ సాగర్‌’ ఫార్ములాను అమలు చేస్తున్నది.

తిరుమలగిరి సురేందర్‌

జర్నలిస్ట్‌

Updated Date - 2021-04-15T07:41:35+05:30 IST