Mehangai Par Halla Bol : ధరల పెరుగుదలపై కాంగ్రెస్ యుద్ధం నేటి నుంచి

ABN , First Publish Date - 2022-09-04T16:41:36+05:30 IST

త్వరలో గుజరాత్ (Gujarat), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)

Mehangai Par Halla Bol : ధరల పెరుగుదలపై కాంగ్రెస్ యుద్ధం నేటి నుంచి

న్యూఢిల్లీ : త్వరలో గుజరాత్ (Gujarat), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) శాసన సభల ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ (Congress)  వేగం పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం ఓ సభను నిర్వహించబోతోంది. దీనికి ‘మహంగాయీ పర్ హల్లా బోల్’ (Mehangai Par Halla Bol) అని పేరు పెట్టింది. 


కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఆ పార్టీ అగ్ర నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ ఇన్‌ఛార్జులు సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి రామ్‌లీలా మైదానానికి బస్సుల్లో వెళ్తారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు సభలో మాట్లాడతారు. 


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ, ద్రవ్యోల్బణంపై తమ పోరాటం ఈ సభతోనే ముగిసిపోదని చెప్పారు. ఈ నెల 7 నుంచి భారత్ జోడో యాత్రను నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రలో అనేకమంది కాంగ్రెస్ నేతలు, ఎంపీలు పాల్గొంటారని చెప్పారు. ఈ యాత్ర కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు జరుగుతుందన్నారు. ధరల పెరుగుదల వంటి సమస్యల గురించి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనడంపైనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి పెట్టిందని దుయ్యబట్టారు. 


కాంగ్రెస్ నిరసన కార్యక్రమం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రహదారుల మూసివేత, దారి మళ్లింపు గురించి ఢిల్లీ పోలీసులు ట్విటర్ ద్వారా ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు. రామ్‌లీలా మైదానంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసులతోపాటు పారామిలిటరీ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తారని చెప్పారు.


Updated Date - 2022-09-04T16:41:36+05:30 IST