పైలట్‌ లేని కాంగ్రెస్‌

Jul 14 2020 @ 01:11AM

రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు ఊహించిందే. నాలుగునెలల క్రితం మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను కుప్పకూల్చినప్పుడే, ఇక రాజస్థాన్‌ వంతు అని అనేకులు అన్నారు.  ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నవి కావు. దాదాపు మూడేళ్ళుగా ఆ మంట మండుతూనే ఉంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రలో నీ పాత్ర ఎంతో చెప్పమంటూ సచిన్‌కు నోటీసులు అందడం చిట్టచివరి అస్త్రం మాత్రమే. ఉపముఖ్యమంత్రిగా ఉన్నందున తనకు హోంశాఖ ఇచ్చి, తనవారు ఓ నలుగురికి మంచి పదవులిస్తే సర్దుకుపోతానన్నాడు సచిన్‌. అది జరగకపోగా, ముఖ్యమంత్రి గెహ్లాట్‌ తనచేతిలో ఉన్న పోలీసు డిపార్టుమెంట్‌ను ఆయుధంగా వాడి, కుట్ర సిద్ధాంతాలతో చుట్టూ ఉచ్చుబిగించడంతో సచిన్‌కు నిష్క్రమణ వినా మరో మార్గం లేకపోయింది. 


ఎప్పటిలాగానే, కాంగ్రెస్‌ అధిష్ఠానం సంక్షోభ నివారణ పేరిట ఇద్దరు దూతలను అక్కడకు పంపింది. కట్టుకొయ్యలనుంచి గుర్రాలు తప్పించుకున్న తరువాతే మనం మేల్కొంటామా? అని కపిల్‌ సిబాల్‌ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ, కట్టుకొయ్యే బలంగా లేదు. బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సర్కారును కూల్చే కుట్ర జరుగుతున్నదంటూ ఓ ఇద్దరిని ట్రాప్‌ చేసి, ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్‌ విప్‌ సహా అనేకులకు స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ నోటీసులు ఇవ్వడం వెనుక అంతిమంగా దానిని తన మెడకు చుట్టే వ్యూహం ఉన్నదని సచిన్‌ అనుకోవడంలో తప్పేమీ లేదు. ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు భారతీయ జనతాపార్టీ కుట్రలు చేస్తున్నదనీ, తమ ఎమ్మెల్యేలకు పది పదిహేనుకోట్ల రూపాయలు ఆశచూపుతోందని అశోక్‌ గెహ్లాట్‌ విమర్శిస్తున్నారు. బీజేపీ అధికారదాహానికీ, అడ్డుతోవలకు గోవా, మధ్యప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాలను ఉదహరిస్తున్నారు. డెబ్బయ్‌మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ బలంగా ఉన్న తన ప్రభుత్వాన్ని కూల్చలేదనీ, తన పార్టీలో అసమ్మతి ఉన్నప్పుడు మాత్రమే అది చక్రం తిప్పగలదని ముఖ్యమంత్రికి తెలియకపోదు. పైలట్‌ను తనదారికి తెచ్చుకోవడానికీ, ఇచ్చిపుచ్చుకోవడానికి ఆయన ప్రయత్నించినదేమీ లేదు. ఉపముఖ్యమంత్రిని నామమాత్రం చేసి అన్ని నిర్ణయాలు, నియామకాలు, బదిలీలు సహా సర్వాధికారాలూ ఆయనే చెలాయిస్తూ వచ్చినందునే ఈ మూడేళ్ళకాలంలో ఇరువురి మధ్యా విభేదాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న మాట నిజం. ఆ అవకాశం దానికి ఇవ్వకుండా, పార్టీ చీలిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రిది. బీజేపీ కుట్రలను సంఘటితంగా ఎదుర్కోవడానికి బదులు, ఆయన సచిన్‌ను ఇరికించేందుకు ప్రయత్నించినందునే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపముఖ్యమంత్రిగా ఉంటూనే శత్రువులతో చేతులు కలిపి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారనే నింద ఈ రాజద్రోహం కేసు ద్వారా సచిన్‌పై పడినట్టయింది. సచిన్‌ నిజంగానే కుట్రచేస్తున్నా, దానిని అంతర్గతంగా వమ్ముచేయాల్సిన ముఖ్యమంత్రి సచిన్‌ మీద బురదజల్లి బయటకు పోయేట్టు చేశారు.


‍సచిన్‌ పక్షాన పదిహేనుమందికి మించి ఎమ్మెల్యేలు లేరని వార్తలు వస్తున్నాయి. ఆయనకు ముప్పైమంది బలం ఉన్నదన్న మాట అబద్ధమే అనుకున్నా, సీఎల్పీ సమావేశానికి కనీసం ఇరవైమంది గైర్హాజరీతో గెహ్లాట్‌ బలం కూడా సన్నగిల్లిన విషయం వాస్తవం. మద్దతుదారులు నిజంగానే వందకుపైగా ఉంటే నేరుగా గవర్నర్‌ ముందే ఈ బలప్రదర్శన చేయవచ్చును కదా అని సచిన్‌ వర్గం సవాలు విసురుతున్నది. ఇక్కడ హాజరైనవారు రేపు సచిన్‌ పక్కన చేరరని కూడా అనుకోనక్కరలేదు. గెహ్లాట్‌ నాయకత్వంలో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపాలైతే, 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి సచిన్‌ ముఖ్యకారకుడని అంటారు. రాహుల్‌ సన్నిహితుడిగా ఎంతో శ్రమించి పార్టీకి విజయాన్ని చేకూర్చిన సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చివరకు సోనియా మాట కాదనలేక, రాహుల్‌ కూడా చేతులెత్తేయడంతో సచిన్‌ ఉపముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకున్నారు. కానీ, తన కుమారరత్నం కోసం గెహ్లాట్‌ క్రమంగా పొగబెడుతూ సచిన్‌ను పార్టీనుంచి పోయేట్టు చేశారు. గెహ్లాట్‌ వర్గీయులపై ఐటీ దాడులతో బీజేపీ తనవంతుగా ఏవో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సచిన్‌కు చెప్పుకోదగ్గ బలం లేకపోతే అది ప్రత్యక్షంగా రంగంలోకి దిగే అవకాశాలు లేవు. సచిన్‌ సొంతపార్టీ పెడితే ఉన్న నలుగురూ కూడా తోడునిలుస్తారన్న నమ్మకం లేదు. బలహీనపడిన గెహ్లాట్‌ ప్రభుత్వం ప్రస్తుతానికి ఏదోలా నిలదొక్కుకున్నా, రాజస్థాన్‌ రాజకీయం ఇంకా ముగిసిపోలేదు. బలంగా ఉన్న ప్రభుత్వాలను ఇలా చేజేతులా నాశనం చేసుకోవడం కాంగ్రెస్‌కు అలవాటే.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.