కాంగ్రెస్‌యుక్త్ బీజేపీ: బీజేపీలో కాంగ్రెస్ నేతల చేరికపై శశిథరూర్

ABN , First Publish Date - 2022-01-26T18:36:32+05:30 IST

తమ ఇంటిని వదిలేసి వెళ్తున్నారు. బహుశా వారికి ఇంకేవో కలలు ఉండి ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ కూడా అంతా అలాగే ఉంది. అక్కడ కూడా అందరూ మనవారే ఉన్నారు..

కాంగ్రెస్‌యుక్త్ బీజేపీ: బీజేపీలో కాంగ్రెస్ నేతల చేరికపై శశిథరూర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాగా, బీజేపీ అంతా కాంగ్రెస్‌ నేతలతో నిండిపోతుందని, కాంగ్రెస్‌యుక్త బీజేపీగా మారిపోతోందని ఆయన సెటైర్లు వేశారు. బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఎవరి ఆశయాల కోసమో ఇళ్లు వదిలేస్తున్నారని, అక్కడ కూడా అంతా మన వాళ్లే ఉన్నారని థరూర్ సెటైర్లు వేశారు.


‘‘తమ ఇంటిని వదిలేసి వెళ్తున్నారు. బహుశా వారికి ఇంకేవో కలలు ఉండి ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ కూడా అంతా అలాగే ఉంది. అక్కడ కూడా అందరూ మనవారే ఉన్నారు’’ అని రాసుకొచ్చారు. చివర్లో బ్రాకెట్లో ‘‘కాంగ్రెస్‌యుక్త్ బీజేపీ’’ అని రాసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ నేతలంతా ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ నినాదాన్ని చాలా కాలంగా ఇస్తున్నారు. ఇది చాలా కాలంగా వినిపిస్తున్నదే అయినప్పటికీ మోదీ నాయకత్వం ఎక్కువ ప్రచారాన్ని కల్పించింది. ఆ నినాదాన్ని గుర్తు చేసేలా ‘కాంగ్రెస్‌యుక్త్ బీజేపీ’ అని థరూర్ ట్వీట్ చేశారు.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆర్‌పీఎన్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. గతంలోనే యూపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద కమల తీర్థం పుచ్చుకున్నారు. ఇక 2019లో యూపీ కాంగ్రెస్ ఇంచార్జీగా ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి బాధ్యతలు తీసుకున్న జ్యోతిరాదిత్య సిందియా సైతం బీజేపీలో చేరారు. వీరంతా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. వీరే కాకుండా అనేక మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

Updated Date - 2022-01-26T18:36:32+05:30 IST