లాక్‌డౌన్ పెడదామా?: కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

ABN , First Publish Date - 2021-11-13T18:12:35+05:30 IST

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కేంద్రాన్ని నిలదీస్తూ శనివారంనాడు..

లాక్‌డౌన్ పెడదామా?: కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ: ''జనం ఎలా బతకాలి? రెండ్రోజుల లాక్‌డౌన్ విధించడం కానీ, ఇంకేదైనా ఆలోచన కానీ చేస్తున్నారా? తక్షణం చర్యలు తీసుకోండి?''. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కేంద్రాన్ని నిలదీస్తూ శనివారంనాడు ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇళ్లల్లో కూడా మాస్క్‌లు ధరించాల్సి వస్తోందంటే వాయు కాలుష్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోందని అన్నారు. ఇది మామూలు సమస్య కాదన్నారు. ఢిల్లీలోని వాయికాలుష్యానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏమి చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.


పంట వ్యర్థాలను తగులబెట్టేందుకు 2 లక్షల మిషన్లు అందుబాటులో ఉండగా, మార్కెట్‌లో రెండు మూడు రకాల మిషన్లు ఉన్నాయని, కానీ  రైతులు అంత ఖర్చుతో కొనుగోలు చేయగలిగిన పరిస్థితుల్లో లేరని కోర్టు పేర్కొంది. ఈ మిషన్లను కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ  రైతులకు ఎందుకు సమకూర్చలేదు?" అని కోర్టు ప్రశ్నించింది.


''చిన్న పిల్లలు కూడా వాయుకాలుష్యంలోనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి వాతావరణానికి వారిని విడిచిపెడుతున్నాం. డాక్టర్ గులేరియా (ఎయిమ్స్ చీఫ్) సైతం పిల్లల్ని కాలుష్యం బారిన, డెంగ్యూ వంటి మహమ్మారిల బారిన పడేస్తున్నామని చెబుతున్నారు. వాయు నాణ్యతను సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఏఐక్యూ‌ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)ను 500 నుంచి 200 పాయింట్లకు ఎలా తగ్గిస్తారు?. తక్షణ చర్యలు కొన్నైనా తీసుకోండి. రెండు రోజుల లాక్‌డౌన్ విధించే ఆలోచన కానీ, మరేదైనా కానీ మీకు ఉందా? జనం ఎలా జీవించాలి?'' అని కోర్టు నిలదీసింది.

Updated Date - 2021-11-13T18:12:35+05:30 IST