రఘురామను రైల్లో చంపేందుకు కుట్ర!

ABN , First Publish Date - 2022-07-06T08:06:10+05:30 IST

రఘురామను రైల్లో చంపేందుకు కుట్ర!

రఘురామను రైల్లో చంపేందుకు కుట్ర!

సత్తెనపల్లిలో బోగీ తగలబెట్టి అంతమొందించాలని పఽథకం

ఇది తెలిసి బేగంపేటలోనే దిగిపోయిన ఎంపీ

అదే రైలులో కిషన్‌రెడ్డి కూడా రావాలి

అయితే ప్రభుత్వ పెద్దలే రావొద్దని ఆపారు

సత్తెనపల్లిలో సీసీ ఫుటేజీ తీస్తే అన్నీ బయటపడతాయ్‌

బాబాయినే చంపి గుండెపోటన్నారు ఎంపీని లేపేయడం పెద్ద విషయమా?

టీడీపీ నేత బొండా ఉమ ధ్వజం


అమరావతి, జులై 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు ప్రధాని పర్యటనకు వస్తే మార్గమధ్యంలో రైల్లో హత్య చేయాలని పథక రచన జరిగిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సత్తెనపల్లి వద్ద రైలు బోగీ తగలబెట్టడం ద్వారా ఆయన్ను చంపాలని ప్రణాళిక రూపొందించారని.. రైలు ఎక్కిన తర్వాత ఈ సమాచారం తెలియడంతో రఘురామరాజు వెంటనే తర్వాతి స్టేషన్లో దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ఇదే రైలులో పక్క బోగీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ప్రయాణించాల్సి ఉందని.. ఎంపీ హత్యకు పఽథక రచన చేసిన ప్రభుత్వ పెద్దలు మంత్రిని రైల్లో రావద్దని చెప్పి ఆపారని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి నిజాలు బయటకు రావడానికి సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా స్థానిక ఎంపీగా అందులో పాల్గొనాలనుకున్న రఘురామరాజును అడుగడుగునా వేటాడినట్లుగా వెంటాడారని విమర్శించారు. ‘ఆంధ్రకు చెందిన వంద మంది సీఐడీ,  పోలీసు అధికారులను హైదరాబాద్‌లో మోహరించారు. ఆయన భీమవరం రోడ్డుమార్గంలో వెళ్తారా.. రైల్లో వెళ్తారా.. హెలికాప్టర్‌లో వెళ్తారా అని ప్రతి క్షణం కూపీ లాగారు. ఆయన హెలికాప్టర్‌లో ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల మైదానంలో దిగడానికి అనుమతి కోరితే కలెక్టర్‌ ద్వారా నిరాకరించారు.  ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో దిగవచ్చని ఆ స్కూల్‌ యాజమాన్యం వద్ద నుంచి ఎంపీ లేఖ తీసుకుంటే యాజమాన్యాన్ని బెదిరించి ఆ లేఖను వెనక్కి తీసుకునేలా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భీమవరానికి నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వస్తున్నారని తెలిసి రఘురామరాజు కూడా అదే రైలులో పక్క బోగీలో రిజర్వేషన్‌ చేయించుకున్నారు. ఇది తెలియగానే ప్రభుత్వ పెద్దలు కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి రైల్లో రావద్దని.. మర్నాడు విమానంలో రావాలని కోరి ఆయన రైలు ప్రయాణం రద్దు చేయించారు. తోటి సామాజిక వర్గం అనుకున్నారో లేక పక్క బోగీలో మంత్రి ఉండగా తామేదైనా చేస్తే ఆయనకు ఇబ్బంది అనుకున్నారో తెలియదు గానీ కిషన్‌రెడ్డితో రైలు ప్రయాణాన్ని మాన్పించారు. అదే రైలులో రఘురామ వస్తే మార్గమధ్యంలో సత్తెనపల్లి స్టేషన్‌ వద్ద ఆయన ప్రయాణిస్తున్న బోగీని తగలబెట్టి హత్య చేయాలని పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనిపై మాకు కచ్చితమైన సమాచారం ఉంది. భీమవరం రావడం కోసం రఘురామరాజు హైదరాబాద్‌లో లింగంపల్లి స్టేషన్లో ఈ రైలు ఎక్కారు. రైలు ఎక్కిన తర్వాత ఆయనకు సత్తెనపల్లి పథక రచనపై ఉప్పందింది. దీంతో తర్వాతి స్టేషన్‌ బేగంపేటలో ఆయన రైలు దిగిపోయారు. ఆయనకు ఈ భూమ్మీద నూకలు ఇంకా ఉండి బతికి బయటపడ్డారు. లేకపోతే ఆయన మరణించి మూడో రోజు అయి ఉండేది’ అని పేర్కొన్నారు.


ఎంపీ ప్రాణాలకే రక్షణ లేకపోతే..

సొంత బాబాయిని లేపేసి గుండె పోటని చిత్రీకరించిన ఘనులకు సొంత పార్టీ ఎంపీని లేపేయడం పెద్ద విషయమేమీ కాదని, కాకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఎంపీ ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్యుల గతేమిటని బొండా ప్రశ్నించారు. ఆ రోజు సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌కు బయటి వ్యక్తులు ఎవరెవరు వచ్చారో.. ఆ పట్టణంలో బయటి వ్యక్తుల సంచారం ఎలా ఉందో సీసీ కెమేరాల ఫుటేజీ తీస్తే అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేయిస్తేనే ఈ మొత్తం కుట్ర బయటకు వస్తుందని.. తమ చేతులు పరిశుభ్రంగా ఉన్నాయనుకుంటే సీబీఐ విచారణకు జగన్‌ ప్రభుత్వం ఆదేశించాలని సవాల్‌  విసిరారు. ‘రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోంది. టీడీపీ వారిని యథేచ్ఛగా చంపుతున్నారు. నన్ను కూడా మాచర్లలో చంపాలని చూశారు. ముఖ్యమంత్రి మొదలుకొని ఆ పార్టీ నేతలు హత్యల్లో మునిగి తేలుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను చంపాడు. తమ అవినీతికి... అక్రమాలకు అడ్డు వచ్చినా, ప్రశ్నించినా లేపడానికి వెనకాడడం లేదు. వివేకా హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనా బాంబులు వేస్తామని బెదిరించారు. వీటన్నిటిపై కేంద్రం కూడా ఆలోచించాలి. సీబీఐకి అప్పగిస్తే అన్నీ బయటకు వస్తాయి’ అని బొండా తెలిపారు

Updated Date - 2022-07-06T08:06:10+05:30 IST