పతనం అంచున రాజ్యాంగ విలువలు

ABN , First Publish Date - 2020-09-30T07:20:32+05:30 IST

కరోనా నీడలో పార్లమెంటు సమావేశాలు కేవలం పదిరోజుల పాటే జరిగి వాయిదాపడ్డ తర్వాత దేశ రాజధానిలో ఒక స్తబ్ధత నెలకొన్నది. నిత్యం ఆరోగ్యంగా కనిపించి,...

పతనం అంచున రాజ్యాంగ విలువలు

చర్చలను స్వాగతిస్తూ బిల్లులను ఆమోదింపచేసే తత్వం తమకు లేదని మోదీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులవిషయంలో స్పష్టం చేయగా అదే అప్రజాస్వామిక దారిలో భారతీయ జనతా పార్టీ కూడా నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీ ఆఫీసు బేరర్లను నియమించిన తీరుతెన్నులే అందుకు నిదర్శనం. ఇప్పుడు ప్రకటించిన జగత్‌ప్రకాశ్ నడ్డా టీమ్‌ను ఎవరితో చర్చించి రూపొందించారో ఎవరికీ తెలియదు. అసలు ప్రధాన కార్యదర్శులు కూడా తాము ఉంటామో, ఊడతామో చివరి వరకూ చెప్పలేకపోయారు. 


కరోనా నీడలో పార్లమెంటు సమావేశాలు కేవలం పదిరోజుల పాటే జరిగి వాయిదాపడ్డ తర్వాత దేశ రాజధానిలో ఒక స్తబ్ధత నెలకొన్నది. నిత్యం ఆరోగ్యంగా కనిపించి, తనకు ఏమీ కాదని చెప్పే కేంద్రమంత్రి సురేశ్ అంగడి, మొదటిసారి రాజ్యసభకు ఎన్నికైన బిజెపి ఎంపి అశోక్ గస్తీ, వైసీపీకి చెందిన తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రాదరావు, కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపి వసంతకుమార్ మరణించారు. దేశవ్యాప్తంగా పలువురు శాసనసభ్యులు కూడా కొవిడ్ వాతపడ్డారు. ఎల్లెడలా కరోనా కేసులు పెరిగి మన కళ్ల ముందే సామాన్యులు, మహానుభావులు కుప్పకూలిపోతున్నారు. ఢిల్లీలో కరోనా రెండోసారి విజృంభిస్తుండడంతో అసలు పరిస్థితి ఎక్కడకు దారితీస్తుంది, ఎంతకాలం ఈ మృత్యునీడలో బతకాలి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


బహుశా తాము ఇక చేసేది ఏమీ లేదని ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల వరకు తీర్మానించుకున్నట్లు కనపడుతోంది. అవసరమైతే చిన్న చిన్న లాక్‌డౌన్‌లు విధించాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు సూచించి ఊరుకున్నారు. ఆయన చేసే ప్రసంగాల్లో కరోనా గురించి ప్రస్తావన ఏ మాత్రం ఉండడం లేదు. భారతదేశంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడేందుకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటున్నామని గత మేలో ప్రధానమంత్రి ప్రకటన చేసిన తర్వాత కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అయిదు రెట్లు పెరిగింది. మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ పదేళ్లు దాటిన ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా సోకే అవకాశాలున్నాయని ఐసీఎంఆర్ సర్వే చెప్పడం ఆందోళనకరం.


అయినప్పటికీ జీవితాలు ఆగకూడదని, సాగిపోవాలని ప్రభుత్వాలు నిర్ణయానికి రావడంలో ఆశ్చర్యం లేదు. పరిస్థితులు తమ చేతుల్లో లేకపోవడం ఒక కారణమైతే దేశ ఆర్థికవ్యవస్థ, పాలనావ్యవస్థను గాడిలో పడేయాల్సిన బాధ్యత కూడా వాటిపై ఉండడం మరో కారణం. అందుకే యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించేందుకు క్రమంగా అనుమతించక తప్పని పరిస్థితి ఏర్పడింది.


ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య కార్యకలాపాలు ఏదోరకంగా సాగుతున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు, సభలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇవి ఒక ఊరట కలిగిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరిగిన పది రోజులూ ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, ఒక దిగ్బంధన వాతావరణం ఏర్పడిన్పటికీ, ఢిల్లీలో సజీవ రాజకీయ వాతావరణం మళ్లీ ప్రవేశించినట్లు, పరిస్థితులు గాడిలో పడ్డట్లు అనిపించింది. చాలా రోజుల తర్వాత రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సమావేశాలు నిర్వహించడం, సభ్యులు వివిధ అంశాలపై ప్రసంగించడం చూసినప్పుడు దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఎంత విలువైనదో అనిపించింది. సరే, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభుత్వం సరిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయకుండా తమ ఎజెండాను దూకుడుగా అమలు చేయడం అనారోగ్యకరంగా అనిపించినప్పటికీ ప్రతిపక్షాలు వాకౌట్లు చేయడం, సభను బహిష్కరించడం, సస్పెన్షన్లకు దారితీసే విధంగా వ్యవహరించడం, గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం, రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వినతిపత్రాలు సమర్పించడం వంటి దృశ్యాలు దేశంలో ప్రజాస్వామ్యానికి ఊపిరినిచ్చే విమర్శ సజీవంగా ఉన్నదనే అభిప్రాయానికి ఆస్కారం కలిగించాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏది చేసినా ప్రతిపక్షం కానీ, ప్రజలు కానీ సహించి ఊరుకుంటే ఆ ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. సరిగ్గా ఈ తరుణంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, దేశంలో పలు స్థానాలకు ఉప ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించడం దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను కరోనా వంటి మహమ్మారి కూడా ఆపలేదన్న సందేశాన్ని పంపింది. ఈ భయానక పరిస్థితుల్లో ప్రపథమంగా జరుగుతున్న అతి పెద్ద ఎన్నికల ప్రక్రియ ఇది. కరోనా నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను ఇష్టారాజ్యంగా నిర్వహించి అనుకున్న బిల్లులను వేగంగా ఆమోదింపచేసుకున్నట్లే బీహార్ ఎన్నికల ప్రక్రియను కూడా ముగించి విజయం చేజిక్కించుకోవాలని మోదీ ప్రభుత్వం ఆశించడంలో తప్పేమీలేదు. అయితే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి నానా యాతనలు పడి బీహార్ చేరిన 18.87లక్షల మందిలో 16.6 లక్షల మందికి పైగా వలస కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఎన్నికల కమిషనే ప్రకటించినందువల్ల వారి తీర్పు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతుందా అన్నది చర్చనీయాంశమైంది.


పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులను దూకుడుగా గందరగోళం మధ్యనే ఆమోదింపచేసిన ఘట్టంలో జరిగిన దృశ్యాలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌ను చాలా బాధపెట్టినట్లు ఇటీవల ఆయనను కలిసినప్పుడు అర్థమయింది. హరివంశ్ మౌలికంగా పాత్రికేయుడు. ‘ప్రభాత్ ఖబర్’ అన్న పత్రికను చేపట్టి దానికి అనతికాలంలోనే బహుళ జనాదరణ సాధించిపెట్టిన హరివంశ్ ఇదే పత్రికలో లాలూ ప్రసాద్ పశుగ్రాస కుంభకోణాన్ని బయటపెట్టి ఉత్తమ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. నితీశ్ కుమార్ పార్టీ తరపున ఎంపి అయిన తర్వాత సెంట్రల్ హాలులో ఆయన రాజకీయ నాయకుల మధ్య కన్నా జర్నలిస్టుల మధ్య కూర్చుని కబుర్లు చెప్పేందుకు, రాజకీయ విశ్లేషణ చేసేందుకు ఇష్టపడేవారు. సభావ్యవహారాల కమిటీలో ఎజెండాను ఆమోదించిన తర్వాత అందుకు అనుగుణంగా సభను నిర్వహించడం తన విధి అని భావించే హరివంశ్ వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేయడంలో తన తప్పేమిటని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. విచిత్రమేమంటే ఇలాంటి బిల్లులను ఆమోదింపచేసేటప్పుడు వివిధ పార్టీలతో మాట్లాడడం, రాష్ట్రాలను సంప్రదించడం చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వహించకపోవడం వల్లే ప్రతిపక్షాల ఆగ్రహాన్ని తాను ఎదుర్కోవాల్సి వచ్చిన విషయం ఆయనకు తెలియనిది కాదు. అయినప్పటికీ ఒక జర్నలిస్టు మరో పాత్రను నిర్వహించాల్సి వచ్చినప్పుడు పడే మానసిక సంఘర్షణను ఆయన ఎదుర్కోక తప్పలేదు.


నిజానికి వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం ఇంత దూకుడుగా ప్రవేశపెట్టి వాటిపై రాష్ట్రపతితో సంతకం చేయించి చట్టాలుగా మార్చడం రాజ్యాంగ సమ్మతమా అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఒక కాంగ్రెస్ ఎంపి సుప్రీంకోర్టు తలుపు తట్టాడు కూడా. నిజానికి ఐటీసీ లిమిటెడ్- వెర్సెస్‌ ఏపీఎంసి కేసులో 2002లోనే సుప్రీంకోర్టు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో వివిధ రాష్ట్రాల చట్టాలే చెల్లుతాయని పేర్కొంది. కేంద్రం తెచ్చిన టొబాకో బోర్డు చట్టాన్ని కొట్టి వేసింది. వ్యవసాయ మార్కెట్‌లపై పార్లమెంట్‌కు చట్టాలు చేసే అధికారం లేదని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నియమించిన అశోక్ దాల్వాయి కమిటీ పేర్కొంది. నిజానికి ప్రముఖ వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ సిఫారసులనే తాము అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది కాని, వ్యవసాయ మార్కెట్‌లను ఉమ్మడి జాబితాలో చేర్చాలని స్వామినాథన్ కమిషన్ ఎప్పుడో సిఫారసు చేసింది. 2012 మే 5న అప్పటి ప్రభుత్వం లోక్‌సభలో ఈ విషయంపై స్వయంగా ప్రకటన చేసింది. అయితే మార్కెట్ కమిటీలను ఉమ్మడి జాబితాలో చేర్చే ఉద్దేశం లేదని 2018 మార్చి 27న నరేంద్రమోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆరోగ్యకరమైన చర్చలను స్వాగతిస్తూ బిల్లులను ఆమోదింపచేసే తత్వం తమకు లేదని మోదీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల విషయంలో స్పష్టం చేయగా అదే అప్రజాస్వామిక దారిలో భారతీయ జనతాపార్టీ కూడా నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా మహమ్మారి వ్యాపించిన తర్వాత బిజెపి కేంద్ర కార్పొరేట్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడి అపాయింట్‌మెంట్లు దొరకడం గగనమయ్యాయి. రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి బిజెపి పార్టీ అశోకారోడ్‌లో ఉన్నప్పుడు చాలా సందడిగా కనిపించేది. పార్టీ ప్రధాన కార్యదర్శుల గదుల వద్ద జనం వేచి చూస్తూ కనపడేవారు. దీనదయాళ్ మార్గ్‌లోకి బిజెపి కార్యాలయం మారాక పరిస్థితి మారింది. మామూలుగానే సందడి కోల్పోయిన ఆ కార్యాలయం ఇప్పుడు కరోనా మూలంగా మరింత నిర్మానుష్యంగా మారింది. గతంలో పార్టీ ఆఫీసు బేరర్లను నియమించేటప్పుడు ప్రజాస్వామికంగా ప్రక్రియ సాగేది. సీనియర్ నేతలు రకరకాల పేర్లను సూచించేవారు. ఆ పేర్లపై అంతర్గత చర్చ జరిగేది. మొత్తానికి పకడ్బందీగా ఒక మంచి టీమ్ బయటకువచ్చేది. వెంకయ్య, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, అనంతకుమార్ లాంటి నేతలు ఆ రకంగానే పార్టీ పదవుల్లోకి వచ్చారు.


ఆ తర్వాత కుశాభావు థాక్రే, వెంకయ్య తదితరులు కూడా ఇదే ప్రక్రియ అవలంబించి పలువురితో చర్చించి ఎంతో కసరత్తు చేసి టీమ్‌ను నియమించేవారు. ఇప్పుడు ప్రకటించిన జగత్‌ప్రకాశ్ నడ్డా టీమ్‌ను ఎవరితో చర్చించి రూపొందించారో ఎవరికీ తెలియదు. అసలు ప్రధాన కార్యదర్శులు కూడా తాము ఉంటామో, ఊడతామో చివరి వరకూ చెప్పలేకపోయారు. మొత్తం ప్రక్రియ అంతా ఎంతో అసహజంగా, పెద్దగా సంప్రదింపులు లేకుండా, ఒకరిద్దరితో చర్చించి మాత్రమే జరిగినట్లు కనపడుతోంది. బిజెపిలో ప్రధాన కార్యదర్శి పదవి ఒకప్పుడు చాలా కీలకమైనది. పార్టీలో దిస్థాయి నుంచి ఎంతో కష్టపడి వచ్చిన వారికి ఆ అవకాశం దక్కేది. ‘నాకు మంత్రి పదవి కన్నా మహామంత్రి (ప్రధాన కార్యదర్శి) పదవి ఇష్టం’ అని ఒక సీనియర్ నేత గర్వంగా చెప్పుకున్న రోజులున్నాయి. అలాగే అత్యంత సీనియర్ నేతలను, మాజీ ముఖ్యమంత్రులను ఉపాధ్యక్ష పదవుల్లో నియమించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. బహుశా కీలక నిర్ణయాలు తీసుకునేవారు పై స్థాయిలో ఇద్దరో, ముగ్గురో కావడం వల్ల టీమ్ ఎలాగుంటే మాత్రం ఏమిటన్న అభిప్రాయంతో దాన్ని ఏర్పాటు చేసినట్లు కనపడుతోంది. రెండవది, గతంలో బిజెపిలో ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జిలు ఎంతో క్రమశిక్షణతో, నైతికవర్తనతో వ్యవహరించేవారు. కాని ఇప్పుడు వారిలో అనేకమంది ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, వంటవాడితో సహా తమ పిఏలను తమ వెంట విమానాల్లో తీసుకువెళ్లడం, వసూళ్లు చేయడం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాలే ఒక పార్టీ ఎంత వేగంగా పెరిగిందో అంత వేగంగా పతనమయ్యేందుకు దారితీస్తాయనడంలో సందేహం లేదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి) 

Updated Date - 2020-09-30T07:20:32+05:30 IST