పడకేసిన ఇళ్ల నిర్మాణం

ABN , First Publish Date - 2022-07-01T06:26:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పడకేశాయి.

పడకేసిన ఇళ్ల నిర్మాణం
గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో బేస్‌మెంట్‌ స్థాయిలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలు

జగనన్న కాలనీల్లో మందకొడిగా పనులు

రెండు నెలల నుంచి మంజూరుకాని బిల్లులు

జిల్లాలో రూ.20-25 కోట్ల మేర పెండింగ్‌

బిల్లుల కోసం హౌసింగ్‌ ఆఫీస్‌ల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు

చేతిలో డబ్బులు లేకపోవడంతో పనులు నిలిపివేత

జిల్లాలో 31,763 ఇళ్లకుగాను ఇంతవరకు 112 మాత్రమే పూర్తి

పునాదుల స్థాయిలో 24,198 ఇళ్లు!



(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పడకేశాయి. చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు మంజూరు కాకపోవడంతో పలువురు లబ్ధిదారులు తదుపరి పనులు ఆపేశారు. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పటికీ అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే పనులు ఎలా కొనసాగించాలని లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లుల కోసం గృహనిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెబుతున్న సమాచారం మేరకు ఏప్రిల్‌ వరకు పూర్తయిన పనులకు మాత్రమే బిల్లులు మంజూరయ్యాయి. మే, జూన్‌ నెలల్లో చేసిన పనులకు సంబంధించి రూ.20-25 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. 

పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో మొత్తం 787 ఇళ్ల స్థలాల లేఅవుట్‌లు వేసి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50,249 మందికి పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షల చొప్పున కేటాయించింది. ఇంటి నిర్మాణం విషయంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్‌...ఇసుక ఉచితంగా సరఫరా చేయడం, రూ.20,250 విలువ చేసే 90 బస్తాల సిమెంటు, రూ.28 వేల విలువ చేసే అర టన్ను ఐరన్‌ అందజేసి మిగిలిన సొమ్మును (రూ.1,31,750) నాలుగు విడతల్లో చెల్లించడం. రెండో ఆప్షన్‌...ఇసుక ఉచితంగా సరఫరా చేసి, రూ.1.8 లక్షలతో లబ్ధిదారులకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకోవడం. మూడో ఆప్షన్‌...ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి, లబ్ధిదారులకు అప్పగించడం. దీంతో ఎక్కువ మంది ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. తీరా ఇళ్ల నిర్మాణం మొదలయ్యే సమయానికి మూడో ఆప్షన్‌ అమలుకు ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఒకటి, రెండు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకుని లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకోవాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే స్థలం పట్టా రద్దవుతుందని అధికారులు హెచ్చరించడంతో లబ్ధిదారులు చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసి పనులు మొదలు పెట్టారు. ఇదే సమయంలో సిమెంటు, స్టీలు, పిక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రెండో ఆప్షన్‌ కింద ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులపై అదనపు భారం పడింది. ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.8 లక్షలకుతోడు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి ఆప్షన్‌ ఎంచుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక, స్టీలు, సిమెంటు చాలకపోవడంతో అదనంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఏప్రిల్‌ నెల వరకు దాదాపు రూ.67 కోట్లు విడుదలయ్యాయి. మే, జూన్‌ నెలల్లో నిధులు విడుదల కాలేదు. మొత్తం మీద రూ.20-25 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో వున్నట్టు అధికారులు చెబుతున్నారు. రెండు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో పలువురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను ఆపేశారు. ఇప్పటికే వేలాది రూపాయలు అప్పులు చేశామని, ఇంటి నిర్మాణం కోసం మరింత అప్పు చేసే స్థోమత లేదని అంటున్నారు.

నత్తనడకన ఇళ్ల నిర్మాణాలు

జిల్లాలో 50,249 మందికి పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. వివిధ కారణాల వల్ల వీరిలో 18,486 మంది లబ్ధిదారులు నిర్మాణాలు మొదలు పెట్టలేదు. మిగిలిన 31,763 మందిలో ఇంతవరకు 112 మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. పునాదుల స్థాయిలో 24,198 ఇళ్లు, బేస్‌మెంట్‌ స్థాయిలో 4,870, గోడల స్థాయిలో 1,022, శ్లాబ్‌ స్థాయిలో 1,561 ఇళ్లు వున్నాయి.


బుచ్చెయ్యపేట మండలంలో 274 ఇళ్లకు సంబంధించి రూ.1.79 కోట్ల బిల్లులను ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. కోడ్‌ జనరేట్‌ కాకపోవడంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. 

గొలుగొండ మండలంలో 1,598 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 157 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. సుమారు రూ.1.10 కోట్లు లబ్ధిదారులకు అందాల్సి వుంది. 

రోలుగుంట మండలంలో 547 ఇళ్లు మంజూరయ్యాయి. పునాదుల స్థాయిలో 334, బేస్‌మెంట్‌ స్థాయిలో 121, శ్లాబ్‌స్థాయిలో 26 ఇళ్లు ఉన్నాయి. ఇంతవరకు పది ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. చేసిన పనులకు రూ.1.65 కోట్లకు ఏప్రిల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. ఇంతవరకు నిధులు విడుదల కాలేదు.


Updated Date - 2022-07-01T06:26:03+05:30 IST