అంగన్‌వా‘డీలా’!

ABN , First Publish Date - 2021-01-17T05:59:17+05:30 IST

చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు దశాబ్దాల కిందట అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోంది.

అంగన్‌వా‘డీలా’!
చిన్న నారాయణపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవన నిర్మాణం

 

కేంద్రాల నిర్వహణలో కానరాని పురోగతి
నిలిచిపోయిన నూతన భవనాల నిర్మాణం
బిల్లులు చెల్లించకపోవడమే కారణం
నీరుగారుతున్న లక్ష్యం
 (టెక్కలి రూరల్‌)

చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు దశాబ్దాల కిందట అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోంది. వీటికి నిధులు అధిక సంఖ్యలో కేటాయిస్తున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. వందలాది కేంద్రాలకు ఇప్పటికీ సొంతగూడు లేదు. అద్దె భవనాల్లో అత్తెసరు వసతులతో నెట్టుకొస్తున్నాయి. టీడీపీ హయాంలో మంజూరైన అంగన్‌వాడీ భవనాల నిర్మాణం నిలిచిపోయింది. వాటికి సంబంధించి పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఒక్కో భవనానికి రూ.7.50 లక్షల వంతున ఉపాధి నిధులు మంజూరు చేశారు. నాలుగేళ్ల కిందట పనులు ప్రారంభించినవి సైతం బిల్లులు చెల్లించక నిలిచిపోయాయి. ఇప్పుడు పనులు ప్రారంభిద్దామనుకున్నా పెరిగిన ముడిసరుకు ధరలతో అంచనాలు పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో అంగన్‌వాడీ భవన నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇదీ పరిస్థితి
జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,192 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 3,403 మెయిన్‌, 789 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో 3,403 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,136 మంది సహాయకులు విధులు నిర్వహిస్తున్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 756 మంది పని చేస్తున్నారు. జిల్లాలో 1,205 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 1,768 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 1,219 కేంద్రాలు అద్దె మినహాయింపుగా ఉన్నాయి. 2016-19 మధ్య ఫేజ్‌-1, 2 కింద జిల్లాకు 842 భవనాలు మంజూరయ్యాయి. ఉపాధి హామీ నిధులు రూ.7.50 లక్షలు కేటాయించారు. కానీ కేవలం 346 కేంద్రాల నిర్మాణమే పూర్తయ్యింది. 244 కేంద్రాల పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 77 కేంద్రాల పనులు ప్రారంభించాల్సి ఉంది. బిల్లుల చెల్లింపు సక్రమంగా లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీని ప్రభావం ఫేజ్‌-3పై పడింది. 317 కేంద్రాలు మంజూరైనా..అసలు ఒక్కదాని పనులు కూడా ప్రారంభం కాలేదు. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. నాడు-నేడు పనుల ద్వారా అభివృద్ధి చేయనున్నట్టు స్పష్టం చేసింది.  ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రకటన కార్యరూపం దాల్చలేదు.

  ఉన్నతాధికారులకు నివేదించాం
అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వివిధ దశల్లో నిలిచిపోయిన భవనాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు ప్రారంభయ్యేలా చూస్తాం.           
- జి.జయదేవి, ఐసీడీఎస్‌ పీడీ, శ్రీకాకుళం




Updated Date - 2021-01-17T05:59:17+05:30 IST