ఇటుక పేర్చలేరు.. సిమెంట్‌ పూయలేరు!

ABN , First Publish Date - 2021-06-17T04:01:41+05:30 IST

కరోనా ప్రభావం.. నిర్మాణ రంగంపైనా పడింది. ఓవైపు కర్ఫ్యూ ప్రభావం, మరోవైపు నిర్మాణ సామగ్రి ధరల భారంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పెరుగుతున్న సిమెంట్‌, ఇసుక, ఇనుము ధరల ప్రభావంతో భవన నిర్మాణదారులు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మాణ రంగం కుదేలై.. కార్మికులకు ఉపాధి కరువవుతోంది. ఏడాది వ్యవధిలో ఇనుము, సిమెంట్‌ తదితర నిర్మాణ సామగ్రి ధరలు 30శాతానికిపైగా పెరిగాయి. కర్ఫ్యూ సాకుతో కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి.. ధరలు పెంచేశారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం కూడా దృష్టి సారించకపోవడంతో నిర్మాణదారులకు భారం తప్పడం లేదు.

ఇటుక పేర్చలేరు.. సిమెంట్‌ పూయలేరు!




-నిర్మాణ రంగం కుదేలు!

- ధరల ప్రభావంతో నిలిచిన పనులు

- కార్మికులకు తప్పని ఇబ్బందులు

(టెక్కలి)

కరోనా ప్రభావం.. నిర్మాణ రంగంపైనా పడింది. ఓవైపు కర్ఫ్యూ ప్రభావం, మరోవైపు నిర్మాణ సామగ్రి ధరల భారంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పెరుగుతున్న సిమెంట్‌, ఇసుక, ఇనుము ధరల ప్రభావంతో భవన నిర్మాణదారులు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మాణ రంగం కుదేలై.. కార్మికులకు ఉపాధి కరువవుతోంది. ఏడాది వ్యవధిలో ఇనుము, సిమెంట్‌ తదితర నిర్మాణ సామగ్రి ధరలు 30శాతానికిపైగా పెరిగాయి. కర్ఫ్యూ సాకుతో కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి.. ధరలు పెంచేశారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం కూడా దృష్టి సారించకపోవడంతో నిర్మాణదారులకు భారం తప్పడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 20 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. క్యూబిక్‌మీటర్‌ ఇసుక రూ.475. కాగా,  ట్రాక్టర్‌ ఇసుక సుమారు 30 కిలోమీటర్లు రవాణా చేయాలంటే దాదాపు ఏడువేల రూపాయలు  పలుకుతోంది. ఇక ఇనుము ధరలు కామధేను టన్ను రూ.63వేలు పలుకుతుండగా,  విశాఖ స్టీల్‌ రూ.70వేలు ఉంది. సిమెంట్‌ విషయానికి వస్తే 53గ్రేడ్‌ టన్ను రూ.7వేలు ధర పలుకుతుండగా.. గ్రేడ్‌ లేని సిమ్మెంట్‌ రూ.6,400కు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇనుము టన్ను సుమారు రూ.42వేలు ఉండగా, ఈ ఏడాది రూ.21వేలు అదనంగా పెరిగింది. ఒక బస్తా సిమెంట్‌ గత ఏడాది రూ.280 ఉండగా, ఇప్పుడు రూ.350కి చేరుకుంది. ట్రాక్టర్‌ ఇసుకపై కూడా గత ఏడాదితో పోల్చితే రూ.వెయ్యి చొప్పున అదనపు భారం పడుతోంది. ఇలా ధరల భారంతో భవన నిర్మాణపనులకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.  గతంలో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ భవన నిర్మాణాలు, వంతెనలు, రక్షణగోడలు, ఇళ్ల కాలనీలు, సీసీ రోడ్లు, డ్రైన్లు తదితర పనులు పెద్దఎత్తున నిర్వహించేది. ఇప్పుడు ఆ తరహా పనులు లేకపోయినా భవన నిర్మాణ రంగం పనులు మాత్రం పెరిగిన ధరల మూలంగా దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 




Updated Date - 2021-06-17T04:01:41+05:30 IST