భూ సేకరణ తర్వాతే మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2022-07-01T05:46:14+05:30 IST

మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణం పనులు భూసేకరణ తర్వాతనే చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. రైతుల నుంచి నిరసనలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

భూ సేకరణ తర్వాతే మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణ పనులు

గడ్కొల్‌ పంప్‌హౌజ్‌ పనులు నిలిపివేసిన అధికారులు

త్వరలో సారంగాపూర్‌, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్‌ల ట్రయల్‌ రన్‌

ఇరిగేషన్‌ భూముల్లో హరితహారం కింద నాటనున్న మొక్కలు

నిజామాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణం పనులు భూసేకరణ తర్వాతనే చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. రైతుల నుంచి నిరసనలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అప్పటి వరకు మంచిప్ప వద్ద చేపట్టిన గడ్కొల్‌ పంప్‌హౌజ్‌ పనుల నిర్మాణం కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. వానాకాలం ప్రారంభమై రైతులు పంట లు వేస్తున్నందున 21 ప్యాకేజీ కింద ఆయకట్టుకు నీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జూలై మొదటి లేదా రెండవ వారంలో సారంగాపూర్‌, మెం ట్రాజ్‌పల్లి వద్ద ట్రయల్‌రన్‌ నిర్వహించనున్నారు. అవసరాల మేరకు నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ నియోజకవర్గం పరిధిలో నిర్ణయించిన ఆయకట్టుకు పైప్‌లైన్‌ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. మోపాల్‌ మండలం మంచిప్ప వద్ద నిర్మించనున్న రిజర్వాయర్‌ పనులను భూసేకరణ తర్వాతనే చేపట్టనున్నారు. ఈ రిజర్వాయర్‌ ఎత్తును 3.5 టీఎంసీలకు పెం చడం వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది. ఆ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 1400 ఎకరాల వరకు భూములు, ఇళ్లను కోల్పోతుండడంతో వారు నిరసనలకు దిగారు. తమ భూములను ఇవ్వమని ప్రకటించారు. గత నెలలో పలు దఫాలు గడ్కొల్‌ పంప్‌హౌజ్‌ నిర్మాణ పనులు అడ్డుకున్నారు. మంచిప్ప వద్ద ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాలు చేయడంతో పాటు ప్రజాప్రతినిధులను కలుస్తూ వినతిపత్రాలు ఇచ్చారు. జిల్లా అధికారులకు పనులు చేపట్టవద్దని విజ్ఞప్తులను చేశారు. నిరసనలు పెరుగుతుండడంతో గడ్కొల్‌ పంప్‌హౌజ్‌ నిర్మాణ పనులు నిలిపివేశారు. రిజర్వాయర్‌ పనులు కూడా వాయిదా వేశారు. ముం పునకు గురయ్యే గ్రామాల్లో పలు దఫాలు చర్చించేందుకు నిర్ణయించారు. మంత్రుల సమక్షంలో సమావేశాలు జరిపి వారి నిర్ణయం ఆధారంగానే భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. రైతులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద కావాల్సిన పరిహారాన్ని అందించడంతో పాటు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. వచ్చే నెలలోగాని ఆ తర్వాతగాని నిర్ణయం తీసుకుని పనులను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గడ్కొల్‌ పంప్‌హౌజ్‌ నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేశారు. 

21ప్యాకేజీ కింద ఆయకట్టుకు నీరు..

మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణం కాకున్నా ప్రస్తుతం ఉన్న 21 ప్యాకేజీ కింద ఆయకట్టుకు నీళ్లు అందించాలని నిర్ణ యం తీసుకున్నారు. సారంగాపూర్‌, మెం ట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్‌ల పనులు పూర్తికావడంతో ట్రయల్‌ రన్‌ చేపట్టేందుకు నిర్ణయించారు. నవీపేట మండలం బినోల నుంచి నీటిని సారంగాపూర్‌పంప్‌హౌజ్‌కు మల్లించనున్నారు. సారంగాపూర్‌ పంప్‌హౌజ్‌ నుంచి నీటిని నిజాంసాగర్‌ కాల్వలోకి ఎత్తిపోయనున్నారు. ఈ కాల్వ ద్వారా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి వరకు నీటిని తరలిస్తారు. అక్కడ నుంచి పైప్‌లైన్‌ ద్వారా పంట పొలాలకు మరలిస్తారు. ఈ రెండుచోట్ల పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తవడంతో జూలై మొదటి లేదా 2వ వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు మొదలై వరద పెరగగానే ఎక్కువ మొత్తంలో పైప్‌లైన్‌ల ద్వారా సాగుకు ఇచ్చేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ నియోజకవర్గం పరిధిలో సుమారు 40 ఎకరాల వరకు వానకాలంలో ఆయకట్టుకు నీళ్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

చెరువు, కాల్వల గట్లపై మొక్కలు..

జిల్లాలో ఈ సంవత్సరం కాల్వలగట్లు, చెరువులగట్లు, ఇరిగేషన్‌ భూముల్లోనే ఎక్కువగా అధికారికంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ కాల్వల వెంట భూములను సర్వేచేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల కలిసి సర్వే నిర్వహిస్తున్నారు. సాగునీటిశాఖ భూములను నిర్వహించడంతో పాటు మిర్టింగ్‌ చేసిన ప్రాంతంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాల్వ, కాకతీయ, లక్ష్మికాల్వల పరిధిలో భూములు ఎక్కు వగా ఉండడం, గతంలో భూములు ఇచ్చిన రైతులు తిరిగి కలుపుకోవడంతో సమస్యలు వస్తున్నాయి. పలుచోట్ల రైతులు ఈ సర్వే నిలిపివేయాలని కోరుతున్నారు. అధికారులను అడ్డుకుంటున్నారు. తా మే కాల్వలకు భూములు ఇచ్చామని ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో సాగుచేసుకుంటామని ఈ భూములు తిరిగి తీసుకోవద్దని కోరుతున్నారు. కాల్వలు, చెరువుగట్ల వెంట 620 కి.మీల మేర మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. ఆ పరిధిలో సాగునీటిశాఖ భూములు ఉండడంతో స్వాధీనానికి చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల ఎక్కువ మొత్తంలో భూములు ఉండడం వల్ల వాటిని ప్రభుత్వ అవసరాలకు, క్రీడా ప్రాంగణాలకు, రైతుల కల్లాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకుంటున్నారు. రైతులకు అవగాహన కల్పిస్తూనే ఆయా గ్రామాల పరిధిలో వీటి కోసం వదిలేయాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల రైతుల నుంచి ఇబ్బందులు వస్తున్న వారికి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మంచిప్ప పంప్‌హౌజ్‌ నిర్మాణం పనులు నిలిపివేశామని చర్చల తర్వాత చేపడతామని సీఈ మధుసూదన్‌రావు తెలిపారు. రిజర్వాయర్‌కు సంబంధంలేని ప్యాకేజీ 21 పరిధిలో సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జూలైలో సారంగాపూర్‌, మెంట్రాజ్‌పల్లి ట్రయల్‌రన్‌ నిర్వహించి ఆయకట్టుకు నీటిని అందిస్తామన్నారు. జిల్లాలోని సాగునీటిశాఖకు సంబంధించిన కాల్వలు, చెరువుల గట్ల వెంబడి భూములను స్వాధీనం చేసుకుంటున్నామని వాటి పరిధిలో హరితహారం కింద మొక్కలు నాటుతామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-07-01T05:46:14+05:30 IST