కుమార్తె పెళ్లి కోసం ఆర్థిక సాయానికి దరఖాస్తు.. ఐదేళ్లయినా అతీగతీ లేదు!

ABN , First Publish Date - 2022-05-29T02:02:26+05:30 IST

దేశ రాజధానికి చెందిన ఓ నిర్మాణ రంగ కూలీ తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించాడు. అందుకు

కుమార్తె పెళ్లి కోసం ఆర్థిక సాయానికి దరఖాస్తు.. ఐదేళ్లయినా అతీగతీ లేదు!

న్యూఢిల్లీ: దేశ రాజధానికి చెందిన ఓ నిర్మాణ రంగ కూలీ తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించాడు. అందుకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతూ 2017లో  ఢిల్లీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (DBOCWWB)క దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అతడి దరఖాస్తును బుట్టదాఖలు చేసిన అధికారులు ఐదేళ్లుగా తిరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడేమో తీరిగ్గా వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, అది ఇస్తేనే దరఖాస్తు పరిష్కారం అవుతుందని తీరిగ్గా చెబుతున్నారు. 


దీంతో ఇక లాభం లేదని భావించిన బాధిత కూలీ బన్వరీలాల్.. అడ్వకేట్ చిరయు జైన్ ద్వారా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణ రంగ కూలీల్లోని కుటుంబాల్లో పెళ్లిళ్లు అయితే బోర్డు సాయం చేస్తుందని, తాను 2017 దరఖాస్తు చేసుకున్నానని, తన కుమార్తె వివాహం జరిగిన ఐదేళ్లవుతున్నా బోర్డు ఇప్పటి వరకు పరిష్కరించలేదని ఆ పిటిషన్‌లో బన్వరీలాల్ ఆవేదన వ్యక్తం చేశారు.


పిటిషనర్ తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ష్యేల్ ట్రెహాన్.. ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసి ఐదేళ్లు అయిందని, ఇప్పుడేమో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం అడుగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. అది లేకుండా దరఖాస్తును పరిష్కరించడం అసాధ్యమని చెబుతున్నారని పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు 26న మ్యారేజ్ కార్డు, మ్యారేజ్ ఫొటోలను సమర్పించినప్పటికీ దరఖాస్తు పరిష్కారం కాలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బోర్డు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేశారు.

 

Updated Date - 2022-05-29T02:02:26+05:30 IST