కూలీల సొమ్ముకూ కక్కుర్తి!

ABN , First Publish Date - 2021-07-27T07:14:47+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నిర్మాణదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కార్మిక సెస్‌ నిధులు దారి మళ్లుతున్నాయి

కూలీల సొమ్ముకూ కక్కుర్తి!

భవన నిర్మాణ కార్మికుల సెస్‌ పక్కదారి

రూ.750 కోట్లు దారి మళ్లింపు

1200 కోట్లలో మిగిలింది 450 కోట్లే

నిర్మాణదారుల నుంచి వసూలు

ఇతర అవసరాలకు వాడకం

కార్మికుల సంక్షేమం మాత్రం గాలికి 

దీనిపై ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి వెల్లడి

గతంలో అమలైన పథకాలన్నీ మాయం

టీడీపీ హయాంలో వారికి ప్రత్యేక సాయం

కార్మికుడి భార్య ప్రసవానికి 20 వేలు

పని ప్రదేశంలో కార్మికుడు గాయపడితే 3 నెలలపాటు 2 వేల చొప్పున సాయం 

ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చు

రెండేళ్లుగా ఇవన్నీ నిలిపివేసిన సర్కారు


రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది భవన నిర్మాణ  కార్మికులున్నారని అధికారిక అంచనా. వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే... ‘కొత్త ఇసుక పాలసీ’ పేరిట రీచ్‌లు మూసేసింది. ఇసుక అందుబాటులో లేక నిర్మాణాలు ఆగిపోయి... భవన నిర్మాణ కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరువైంది. ఆ తర్వాత... కరోనా లాక్‌డౌన్‌తో మళ్లీ పని దూరమైంది. వెరసి... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీరికి ఇక్కట్లే! 


కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణదారుల నుంచి ప్రత్యేకంగా సెస్‌ వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని భవన నిర్మాణ కార్మికుల బాగు కోసమే ఖర్చు పెట్టాలి. కానీ... వైసీపీ సర్కారు ఈ మొత్తాన్ని కూడా దారి మళ్లిస్తోంది.


భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత! దీనిని వైసీపీ సర్కారు విస్మరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్డర్ల నుంచి వసూలు చేసే సెస్‌ను దారి మళ్లించడమే కాకుండా వీరి కోసం గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఎత్తేశారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నిర్మాణదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కార్మిక సెస్‌ నిధులు దారి మళ్లుతున్నాయి. జగన్‌ సర్కారు తన పథకాల అమలు కోసం, పాలనా ఖర్చుల కోసం వీటిని వాడేస్తోంది. సుమారు రూ.1,200 కోట్లు ఉండాల్సిన సెస్‌ నిధులు.. ఇప్పుడు కేవలం రూ.450 కోట్లే ఉన్నాయని సమాచారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.750 కోట్లను ప్రభుత్వం ఇతర అవసరాలకు తీసేసుకుని వాడుకుందన్నమాట. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో ఈ కార్మికుల కోసం అమలుచేసిన ప్రత్యేక సంక్షేమ పథకాలనూ నిలిపేసింది. రాష్ట్రంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న భవన నిర్మాణరంగం నుంచి.. నిర్మాణదారుల నుంచి లేబర్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోంది. అపార్ట్‌మెంట్లు, సొంతఇళ్లు, వాణిజ్య భవనాలు.. ఇలా ఏది కట్టినా అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటారు.


ఈ దరఖాస్తు ఫీజులోనే లేబర్‌ సెస్‌ను కూడా కలిపి వేస్తారు. భవన నిర్మాణ ఖర్చును అంచనా వేసి అందులో 1శాతం లేబర్‌ సెస్‌గా వేస్తున్నారు. ఇదేమీ చిన్న మొత్తం కాదు. కోటి రూపాయల ఖర్చుతో భవనం కడుతున్నారంటే లక్ష రూపాయలు ఈ సెస్‌ కింద చెల్లించాలి. ఎవరైనా రూ.25 లక్షలతో సొంతిల్లు కట్టుకుంటుంటే దానికి రూ.25 వేలు లేబర్‌ సెస్‌ కట్టాల్సిందే. రోజుకు 10 మంది కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే ప్రతి భవన నిర్మాణదారుడూ ఈ సెస్‌ కట్టితీరాలి. గ్యాస్‌ పైప్‌లైన్లు, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టర్లూ ఈ సెస్‌ను కట్టాల్సిందే. ఈ సొమ్మంతా లేబర్‌ బోర్డు ఖాతాలోకి వెళ్తుంది. రాష్ట్రంలోనే అతి పెద్ద అసంఘటిత రంగంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అవసరమైన పథకాలు ఈ సొమ్ముతో అమలుచేయాలి. వారి ఆరోగ్యం కోసం సాయం చేయాలి. వారు భవనాల్లో పనిచేస్తున్నప్పుడు కిందపడి గాయాలైతే పనిచేయలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి.. వారికి ఆ సమయంలో సాయం అందించాలి. అయితే జగన్‌ ప్రభుత్వం అలా ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందించడం లేదు. కొవిడ్‌ కాలంలోనూ ఇవ్వడానికి మనసొప్పలేదు.


ఈ సంక్షేమ పథకాలూ  బంద్‌ 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లేబర్‌సెస్‌ ద్వారా వచ్చిన మొత్తం నుంచి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. కార్మికుడి భార్య ప్రసవ సమయంలో రూ20వేలు చెల్లించేవారు. వారి ఆస్పత్రి ఖర్చులకు, మందులు, పౌష్టికాహారం కోసం ఇవి ఉపయోగపడేవి. కార్మికులు పనిప్రదేశంలో గాయపడితే వారికి సాయం అందించేవారు. ఉదాహరణకు.. రాడ్‌బెండింగ్‌ పనిచేసేవారికి ఇనుపచువ్వలు గుచ్చుకుని గాయపడినా, భవనం పైనుంచి పడి మేస్ర్తీలు గాయపడినా.. నెలకు రూ.3వేల చొప్పున 3నెలల పాటు ఈ నిధి నుంచి సాయం అందించేవారు. అదేవిధంగా ఎవరైనా భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే మట్టి ఖర్చులకు డబ్బిచ్చేవారు. అయితే జగన్‌ ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ ఆపేసింది. అన్నీ నవరత్నాల్లో చూసుకోవాలని చెబుతోంది. రెండేళ్ల నుంచి లాక్‌డౌన్‌లతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు మరింతసాయం చేయకపోగా.. ఉన్నవి కోసేయడం ఏమిటని రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటసుబ్బయ్య ప్రశ్నించారు. దీనిపై ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2021-07-27T07:14:47+05:30 IST