ltrScrptTheme3

కన్సల్టెన్సీల్లో కేటుగాళ్లు.. టెన్త్‌ పాస్‌ కాకున్నా..!

Jul 1 2021 @ 14:43PM

  • మెడికల్‌ సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు
  • మాటల గారడీతో అమాయకులకు వల 
  • అడ్వాన్సుల పేరిట రూ. కోట్లు వసూళ్లు

హైదరాబాద్‌ సిటీ : అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ ఓ మాయగాడు 15 మంది విద్యార్థుల నుంచి రూ. 37.55 లక్షలు కాజేసి పరారయ్యాడు. అప్పటికే ఆయా విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులకు చిక్కాడు. కేవలం విద్య పేరుతో మాత్రమే కాదు.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కూడా కొందరు నకిలీ కన్సల్టెంట్‌లు ముంచేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, అంతకు మించి వాక్చాతుర్యంతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. 


ప్యాకేజీలు మాట్లాడుకుని

గుర్తింపు పొందిన విద్యాలయాల నుంచి మెడికల్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ లాంటి కాలేజీల్లో సైతం సీట్లు ఇప్పిస్తామంటూ కొందరు కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నారు. గ్రూప్‌ వన్‌ నుంచి గ్రూప్‌ ఫోర్‌ దాకా... అటెండర్‌ నుంచి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఆఫ్రికా దేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తామని కూడా నమ్మిస్తున్నారు. బోర్డుపై సలహాలిస్తామని ప్రకటించి, లోనికి వచ్చిన వారికి సీటు గ్యారెంటీ అని నమ్మిస్తారు. ప్యాకేజీ మాట్లాడుకుని అడ్వాన్సు చెల్లించాలంటారు. నమ్మిన విద్యార్థుల నుంచి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, విదేశీ విద్యకు ఒరిజినల్‌ పాస్‌పోర్టు, సర్టిఫికెట్లు... కనీసం రూ. లక్ష నుంచి సీటును బట్టి బేరమాడతారు. లక్షల్లో అడ్వాన్సులు తీసుకున్న తర్వాత అసలు రూపం ప్రదర్శిస్తారు. 


అదిగో.. ఇదిగో అంటూ

డబ్బులు చెల్లించిన తర్వాత కాంటాక్ట్‌ చేసే వారికి వచ్చే వారం.. వచ్చే నెల అంటూ గడువు విధిస్తున్నారు. ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటారు. వాస్తవంగా ఆ కన్సల్టెన్సీలకు విదేశీ యూనివర్సిటీలు, సంస్థలతో సంబంధాలు ఉండవు. అసలు పదో తరగతి చదవని వారు కూడా నకిలీ కన్సల్టెన్సీలో కౌన్సిలర్‌గా చేరి ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఎదుటివారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటారు. 


సర్టిఫికెట్లతో బ్లాక్‌మెయిల్‌

సీట్లు, ఉద్యోగాల అవకాశాలు కల్పించకపోగా, తమ అడ్వాన్సులు చెల్లించాలని డిమాండ్‌ చేసిన వారిని సర్టిఫికెట్లను అడ్డం పెట్టుకుని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. సర్టిఫికెట్లను సంబంధిత వర్సిటీలకు పంపేశామని, తప్పనిసరిగా కావాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా మోసపోయిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉంటున్నా, పోలీసులు, కోర్టుల భయంతో ఫిర్యాదు చేయకుండానే చాలా మంది వదిలేస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న నకిలీ గాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 


జాగ్రత్తలు అవసరం

- ఏజెంట్ల చెప్పేది పూర్తిగా నమ్మవద్దు. అతని పని తీరు, వీసాలు కల్పించడంలో అతని సర్వీసుతో పాటు ఎంత కాలంగా ఈ పని చేస్తున్నాడో పరిశీలించాలి. వీలైతే పోలీసుల సాయం తీసుకుని అతనిపై ఫిర్యాదులున్నాయా చెక్‌ చేసుకోవాలి. 

- కొత్తగా కన్సల్టెన్సీ తెరిచిన వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. వారి పూర్వాపరాలు కనుక్కుని ముందుకు సాగాలి.

- సీటు గ్యారెంటీ, జాబ్‌ గ్యారెంటీ, వీసా ఫీ ఇలా వివిధ పేర్లతో డబ్బులు వసూలు చేస్తారు. తమ చేతికి ఒరిజినల్‌ అధికారిక పత్రాలు, వీసా వస్తేనే చెల్లిస్తామని స్పష్టంగా చెప్పగలగాలి. 

- అడ్వాన్సు చెల్లించొద్దు. పాస్‌పోర్టు, ఇతర సర్టిఫికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి చేతుల్లో పెట్టొద్దు.

- జాబ్‌ వీసా కాపీ చూపినంత మాత్రాన నమ్మొద్దు. అసలు ప్రతి చూపమనాలి. అతను చెప్పే కంపెనీతో కూడా ఫోన్‌ ద్వారా క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. సీటు గ్యారెంటీ విషయంలోనూ జాగ్రత్త పడాలి.

- ఏదైనా సమస్య వచ్చిన వెంటనే స్థానిక పోలీసులు, లేదా సీసీఎ్‌సను ఆశ్రయించాలి.

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.