సమాచారమివ్వకుండా కార్‌ సీజ్‌.. దిమ్మతిరిగే షాకిచ్చిన Consumer Forum

ABN , First Publish Date - 2022-05-27T18:54:50+05:30 IST

ఇంటి అడ్రస్‌కు నోటీసులు పంపామంటూ కార్‌ సీజ్‌ చేసి, మానసిక వేదనకు గురిచేసినందుకుగాను ..

సమాచారమివ్వకుండా కార్‌ సీజ్‌.. దిమ్మతిరిగే షాకిచ్చిన Consumer Forum

  • రూ. 50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించిన ఫోరం


హైదరాబాద్‌ సిటీ  : ఇంటి అడ్రస్‌కు నోటీసులు పంపామంటూ కార్‌ సీజ్‌ చేసి, మానసిక వేదనకు గురిచేసినందుకుగాను రూ. 50 వేల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పును వెలువరించింది. కూకట్‌పల్లికి చెందిన ఇంజనీర్‌ ఓ కారు కొనుగోలుకు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో రూ. 10.65లక్షలు లోన్‌ తీసుకొన్నాడు. లోన్‌ మొత్తం 60 వాయిదాలు చెల్లించాల్సి ఉండగా 38 వాయిదాలు చెల్లించాడు. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 14 ఏపిల్ర్‌ 2018న బ్యాంకు రికవరీ ఏజెంట్లు కారును సీజ్‌ చేసి తీసుకెళ్లారు. అనంతరం కారును అమ్మించి మిగతా డబ్బు వసూలు చేశారు. తన ప్రమేయం లేకుండా నకిలీ పత్రాలతో తన కారును విక్రయించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అంతేకాకుండా ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారమివ్వకుండా వాహనాన్ని సీజ్‌ చేశారని, దాని కారణంగా వృత్తి పరంగా, సామాజికంగా నష్టం జరిగిందని, పరిహారం కోరుతూ బ్యాంకు అధికారులను ప్రతివాదులుగా చేర్చి హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఫోరం ముందు హాజరైన బ్యాంకు అధికారులు ఈఎంఐలు సరిగా చెల్లించేవాడు కాదని, అతడి 40 పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు బౌన్స్‌ అయ్యాయని, అతడి ఇంటి అడ్ర్‌సకు పలుమార్లు జప్తు నోటీసులు పంపామని వాటిని తీసుకొని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. సీజ్‌ చేసిన నాటికి కారుపై చెల్లించాల్సిన మొత్తం రూ. 8.23,364కు చేరిందని, ఒప్పందం ప్రకారం రికవరీ చేసేందుకు కారును విక్రయించినట్లు తెలిపారు. 


ఇందులో సేవాలోపం లేదని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఫోరం ముందస్తు సమాచారమ్వికుండా కారును సీజ్‌ చేయడం ద్వారా వినియోగదారుడికి మానసిక వేదనతోపాటు, నష్టం కలిగినట్లు గుర్తించింది. బాధితుడికి రూ. 50 వేల పరిహారం, మరో రూ.5 వేలు కోర్టు ఖర్చుల నిమిత్తం మొత్తం కలిపి రూ. 55 వేలు పరిహారం 45 రోజుల్లో చెల్లించాలని ఫోరం-01 ప్రెసిడెంట్‌ జస్టిస్‌ బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, జస్టిస్‌ సి.లక్ష్మీ ప్రసన్న, జస్టిస్‌ రాంమోహన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Updated Date - 2022-05-27T18:54:50+05:30 IST