కాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?.. ఈ సమస్యలు రాకూడదంటే మీ అలవాటు మార్చుకోండి!

ABN , First Publish Date - 2022-01-22T16:59:11+05:30 IST

టీ తాగే అలవాటు ప్రతీఒక్కరికీ ఉంటుంది.

కాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?.. ఈ సమస్యలు రాకూడదంటే మీ అలవాటు మార్చుకోండి!

టీ తాగే అలవాటు ప్రతీఒక్కరికీ ఉంటుంది. ఎక్కువగా శ్రమించేవారు అధికంగా టీ తాగుతారు. టీలో ఉండే కెఫిన్ మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే అతిగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. దీనికితోడు ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.. చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగుతుంటారు. టీ అందుబాటులో లేకుంటే తమకు తలనొప్పి వస్తుందని చాలామంది చెబుతుంటారు. అయితే వైద్యులు టీతో పాటు ఏదైనా తేలికపాటి ఆహారం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. తద్వారా టీ వల్ల శరీరానికి హాని కలగదని చెబుతారు.  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఊబకాయం 

స్థూలకాయం కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటివారు కొన్ని ఆహారపు అలవాట్లకు అస్సలు రాజీ పడకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులోని షుగర్ కూడా శరీరం లోపలికి వెళ్లి బరువు పెరగడానికి, ఊబకాయ సమస్యకు దారితీస్తుంది. 

కీళ్ల నొప్పులు

చాలా మందికి కీళ్ల నొప్పుల సమస్య ఉంటుంది. ఈ సమస్యకు గల కారణాలలో టీ తీసుకోవడం కూడా ఉంది. అధికంగా టీ తీసుకోవడం వల్ల ఎముకలలో నొప్పికలుగుతుంది. దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. 

మరింత ఒత్తిడికి 

అధికంగా పనిచేసేవారు తాజాగా ఉండేందుకు అధికంగా టీ తాగుతుంటారు. ఫలితంగా  వారి శరీరంలో కెఫిన్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. దీంతో అతని మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది. నిద్ర సరిగా పట్టదు. ఎక్కువ టీ తాగడం లేదా ఖాళీ కడుపుతో టీ తాగడం అనేది ఒత్తిడి, డిప్రెషన్ తదితర సమస్యలకు దారి తీస్తుంది.

అల్సర్ 

చాలామంది స్ట్రాంగ్ టీని తాగడానికి ఇష్టపడతారు. ఇలా ఉదయాన్నే టీ తాగడం వల్ల కడుపు లోపలి ఉపరితలంపై గాయాలు ఏర్పడతాయి. ఇది క్రమంగా ఉదర సమస్యలకు దారితీస్తుంది. 

జీర్ణక్రియలో ఇబ్బందులు

ఉదయం పూట చాలామంది ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో టీ తాగుతారు. ఫలితంగా కడుపులో గ్యాస్ సమస్య తలెత్తి జీర్ణశక్తి మందగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కడుపులో వికారం కలుగుతుంది.

అలసట, చిరాకు

టీ తాగడం వల్ల చురుకుదనం వస్తుందని అంటుంటారు. కానీ ఉదయాన్నే పాలతో కూడిన టీ తాగడం వల్ల రోజంతా అలసటగా ఉంటుంది. చిరాకు స్వభావం ఏర్పడుతుంది.

గుండె జబ్బులు

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. 



Updated Date - 2022-01-22T16:59:11+05:30 IST