నోటీసులతో సరి..!

ABN , First Publish Date - 2022-06-26T15:00:36+05:30 IST

హానగర పరిధిలో భవనాల నిర్మాణంలో భాగంగా పదుల సంఖ్యలో సెల్లార్ల తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షాలు కురుస్తున్న

నోటీసులతో సరి..!

సెల్లార్ల కింద నిబంధనల పాతర

ఇష్టారాజ్యంగా తవ్వకాలు

పనులకు వెళ్తే ప్రాణాలకు ముప్పు

అధికారుల అశ్రద్ధ.. నిర్మాణదారుల నిర్లక్ష్యం

ఇష్టానికి వ్యవహరిస్తోన్న డెవలపర్లు


బహుళ అంతస్తుల కోసం తవ్వుతున్న సెల్లార్లలో పని చేసేందుకు వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. అధికారులు,   నిర్మాణదారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపేదలు బలవుతున్నారు. పుప్పాల్‌గూడలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం తవ్విన సెల్లార్‌ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. రిటైనింగ్‌ వాల్‌ పనులు చేస్తోన్న క్రమంలో శనివారం మట్టి పెళ్లలు కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.  


హైదరాబాద్‌ సిటీ: మహానగర పరిధిలో భవనాల నిర్మాణంలో భాగంగా పదుల సంఖ్యలో సెల్లార్ల తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రక్షణా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించాలని జీహెచ్‌ఎంసీ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసింది. మాన్‌సూన్‌ వస్తోందంటే నోటీసులు పంపి చేతులు దులుపుకునే బల్దియా, హెచ్‌ఎండీఏ, శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు క్షేత్రస్థాయి తనిఖీలను పట్టించుకోవడం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తుండడంతో పొట్ట కూటి కోసం పనిచేసే నిరుపేదలు సమిధలవుతున్నారు. అధికారుల అశ్రద్ధ, డెవలపర్ల అత్యాశ.. అమాయకులను పొట్టన పెట్టుకుంటోంది. వారి కుటుంబాలు రోడ్డున పడేందుకు కారణమవుతోంది. గ్రేటర్‌లో శనివారం నాటి ప్రమాదం మొదటిది కాదు. గతంలోనూ పలు ఘటనలు జరిగాయి. పదుల సంఖ్యలో పేదలు ప్రాణాలు కోల్పోయారు. 


కనిపించని పరిశీలన

సెల్లార్‌ తవ్వకాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వర్షాకాలం ముందు ప్రభుత్వ విభాగాలు నిర్మాణదారులకు నోటిసులిస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయనేది పరిశీలించడం లేదు. ‘సిబ్బంది కొరత ఉంది. ఆఫీసు పనులతోనే బిజీగా ఉంటున్నాం.. సైట్లకు వెళ్లి చూసే తీరిక ఎక్కడిది’ అని జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలోని ఓ ఏసీపీ పేర్కొన్నారు. ఉన్నతస్థాయి ఒత్తిళ్లే కాకుండా.. కొందరు అధికారుల ఆర్థిక లబ్ధి ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా పుప్పాల్‌గూడలో, గతంలో మాదాపూర్‌, అంతకుముందు నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రమాదాలు జరిగాయి. సైట్లలో ఉండే ఇంజనీర్లు కూడా కూలీల భద్రతను పట్టించుకోవడం లేదు.


సమాచారం ఇవ్వకుండా..

జీహెచ్‌ఎంసీ చట్టం 1955 సెక్షన్‌ 440 ప్రకారం అనుమతులు తీసుకున్న నిర్మాణదారుడు పనులు ప్రారంభించేటప్పుడు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడే అనుమతి తీసుకున్న ప్లాన్‌ ప్రకారం పనులు జరుగుతున్నాయా, లేదా? అన్నది వారు పరిశీలించే అవకాశం ఉంటుంది. అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్మాణదారులు పనులు ప్రారంభిస్తున్నారు. ఇదేంటని అడిగే పరిస్థితి కూడా పట్టణ ప్రణాళికా విభాగంలో లేదు. సెల్లార్ల లోతును బట్టి నిర్ణీత స్థాయిలో సెట్‌ బ్యాక్‌లు వదలాలి. స్టీల్‌, కంకర, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి తవ్విన చోట వేయకూడదు. వానలు పడుతోన్న దృష్ట్యా.. ఆ బరువుకు మట్టి కూలే ప్రమాదముంది. ఇవేవీ క్షేత్రస్థాయిలో నిర్మాణదారులు పాటించడం లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో 1000 చ.గల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలోనూ సెల్లార్లు తవ్వుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ.. అధికారులు పట్టించుకోవడం లేదు.

Updated Date - 2022-06-26T15:00:36+05:30 IST