కానరాని..కంటైన్మెంట్‌

ABN , First Publish Date - 2020-08-08T09:59:39+05:30 IST

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటు ఒకటి

కానరాని..కంటైన్మెంట్‌

బులిటెన్‌లో ప్రభుత్వ ప్రకటనలు

కట్టడి ప్రాంతాల్లో కనిపించని జోన్లు


వనపర్తి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటు ఒకటి. అయితే, ప్రభుత్వం విడుదల చేస్తున్న కంటైన్మెంట్‌ జాబితాలోని లెక్కలతో, ఏ జిల్లాలో ఏర్పాటు చేసిన జోన్ల సంఖ్య సరిపోవడం లేదు. ఉదాహరణకు వనపర్తి జిల్లాలో 44 జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొంటుండగా, 30 మాత్రమే ఏర్పాటు చేశారు. అవి కూడా మూడు రోజుల కిందట ఏర్పాటు చేసినవే. జోగుళాంబ గద్వాల జిల్లాలో 47 జోన్లు ఏర్పాటు చేశామని చెబుతుండగా, 80 మినీ కంటైన్మెంట్‌ జోన్లు మినహా అసలు కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయలేదు.


నాగర్‌కర్నూలు జిల్లాలో కంటైన్మెంట్‌ ఏర్పాటు చేయలేదని బులిటెన్‌లో ఉండగా, జిల్లా బులిటెన్‌లో యాక్టివ్‌ కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య ఏడుగా చూపిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 192 జోన్లు ఉన్నట్లు బులిటెన్‌లో ఉండగా, 368 జోన్లు ఉన్నట్లు జిల్లాల బులిటెన్‌లో ఉంది. నారాయణపేట జిల్లాలో ఏడు జోన్లు ఉన్నాయి. అయితే, జోన్లలో ఎక్కడా కట్టడి చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. శానిటైజేషన్‌, రాకపోకలపై ఆంక్షల విషయంలో ఇంకా నిర్లక్ష్యపూరిత వైఖరి కనిపిస్తోంది. ‘వనపర్తిలో నో కంటైన్‌మెంట్‌’ అని ఆంధ్రజ్యోతిలో వార్తాకథనం ప్రచురించిన తర్వాత ఇటీవల తొమ్మిది కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. రోడ్డు వద్ద కర్రలతో అడ్డు కట్టారు కానీ, శానిటైజేషన్‌ చర్యలు చేపట్టలేదు.

Updated Date - 2020-08-08T09:59:39+05:30 IST