TRS Party లో ఆగని ధిక్కారం.. రోజు రోజుకు ముదురుతున్న వివాదాలు.. తెలంగాణ భవన్‌కు పంచాయితీ!

ABN , First Publish Date - 2021-10-12T14:57:36+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో సంస్థాగత సమరం సద్దుమణగలేదు....

TRS Party లో ఆగని ధిక్కారం.. రోజు రోజుకు ముదురుతున్న వివాదాలు.. తెలంగాణ భవన్‌కు పంచాయితీ!

  • అధికార పార్టీలో సంస్థాగత సమరం
  • తెలంగాణ భవన్‌కు గోషామహల్‌ పంచాయితీ
  • పోటాపోటీగా కమిటీల ఎంపిక
  • ఏకపక్షంగా కమిటీలు వేయడంపై ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో సంస్థాగత సమరం సద్దుమణగలేదు. కమిటీల ఎంపిక కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. మొన్న అంబర్‌పేటలో ధిక్కార స్వరం వినిపిస్తే.. తాజాగా గోషామహల్‌ నియోజకవర్గం పంచాయితీ తెలంగాణ భవన్‌కు చేరింది. కమిటీల ఎంపిక ఏకపక్షంగా జరిగిందంటూ సోమవారం 300 మంది నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌ ఆఫీస్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివా్‌సరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జీలు వేసిన కమిటీలకు పోటీగా కొందరు నేతలు మూడు డివిజన్‌లలో కొత్త కమిటీలను ప్రకటించారు. ఈ వివరాలను కూడా ఆఫీస్‌ ఇన్‌చార్జ్‌కు అందజేశారు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు డివిజన్‌, బస్తీ కమిటీల నివేదికను టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జ్‌ ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌ ఈ నెల 10న పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డికి సమర్పించారు.


మర్నాడే కొందరు నేతలు ఆ కమిటీలపై ఫిర్యాదు చేస్తూనే.. కొత్త కమిటీల వివరాలు అందజేయడం గమనార్హం. కార్పొరేటర్లుగా పోటీ చేసిన నాయకుల(డివిజన్‌ ఇంచార్జిల) అభిప్రాయాలతో ప్రేమ్‌సింగ్‌ ఆధ్వర్యంలో డివిజన్‌, బస్తీ కమిటీలు ఎంపిక చేశారు. దత్తాత్రేయనగర్‌, బేగంబజార్‌, గన్‌ఫౌండ్రి డివిజన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ మంగళ్‌హాట్‌, గోషామహల్‌, జాంబాగ్‌ డివిజన్ల కమిటీలపై వివాదం ఏర్పడింది. ఆ మూడు డివిజన్లకు పోటీగా నాయకులు కమిటీలు ప్రకటించారు. అంతకుముందు అసంతృప్త నేతలు మంత్రి తలసాని శ్రీనివా‌స్‌యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.


ప్రేమ్‌సింగ్‌ తెలంగాణ భవన్‌లో డివిజన్‌, బస్తీ కమిటీల వివరాలు సమర్పించిన ఆదివారం నాడే.. జాంబాగ్‌, మంగళ్‌హట్‌ డివిజన్లలో సమావేశాలు నిర్వహించి కొత్త కమిటీలను ఎంపిక చేశారు. గోషామహల్‌ డివిజన్‌ కమిటీని ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గం ఇన్‌చార్జి అందరిని కలుపుకొని పోవడం లేదని, తన బంధువులు, అనుచరులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఇరు వైపుల నుంచి వచ్చిన నివేదికలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అందజేస్తామని శ్రీనివా్‌సరెడ్డి చెప్పినట్టు ఓ నాయకుడు తెలిపారు.

Updated Date - 2021-10-12T14:57:36+05:30 IST