ధిక్కారం, న్యాయం

ABN , First Publish Date - 2020-08-22T05:59:16+05:30 IST

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా తన పార్టీకి చెందిన నలుగురు నాయకులతో కూర్చుని మాట్లాడుకోవడానికి అనుమతి లభించింది. ఈ నెల మొదట్లో పార్టీ సమావేశం...

ధిక్కారం, న్యాయం

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా తన పార్టీకి చెందిన నలుగురు నాయకులతో కూర్చుని మాట్లాడుకోవడానికి అనుమతి లభించింది. ఈ నెల మొదట్లో పార్టీ సమావేశం జరుపుకోవడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పరిస్థితి ఇట్లా ఉండగా, రెండేళ్ల కిందటి దాకా, బిజెపితో కలసి అధికారాన్ని పంచుకున్న పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్‌ను విభజించి, దాని ప్రతిపత్తిని పూర్తిగా మార్చివేస్తూ విధించిన ఆంక్షలు ఇంకా పూర్తిగా సడలిపోలేదు. అరెస్టయినవారు ఇంకా విడుదల కాలేదు. అంతెందుకు, ఇంకా జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో ఇంకా 4జి ఇంటర్నెట్‌ను పునరుద్ధరించలేదు. అక్కడ స్థానికులకు ఉండిన హక్కులను, కొన్ని ప్రత్యేకతలను తొలగించిన తరువాత, ఇప్పుడు కశ్మీర్‌ జనాభా నిర్మాణాన్ని, మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కలవరం వ్యక్తమవుతోంది. 


కశ్మీర్‌లో వేర్పాటువాదులకు, తీవ్ర, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు కావవి. అటువంటి వారు తమ లక్ష్యసాధన కోసం పోరాటమార్గంలోనే కొనసాగుతున్నారు. పర్యవసానాలను అనుభవిస్తున్నారు. వారి మీద ఎంతటి నిర్బంధకాండ ప్రయోగించినా, తక్కిన భారతదేశంలో ఎవరూ పెద్దగా మాట్లాడరు. కానీ, ఇక్కడ సమస్య ప్రజాస్వామ్యాన్ని నమ్మినవారితో వ్యవహరిస్తున్న తీరు. ఆగస్టు 5 నిర్ణయాల ద్వారా కశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత్‌లో అంతర్భాగం చేశామంటున్నారు. ఒక భారతీయ ప్రాంతం మీద ఎందుకు అన్ని ఆంక్షలు? ఫరూఖ్‌ అబ్దుల్లా, ముఫ్తీ, సోజ్‌ వంటి నాయకులంతా, ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటూ, కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం అని చెబుతూ వస్తున్న వారే కదా? ప్రజాస్వామిక వాదులే కదా? మరి ప్రజాస్వామిక వాదులపై ఏళ్ల తరబడి నిర్బంధం, ఆంక్షలు ఎందుకు? ఈ కట్టడులు ప్రజలలో ప్రజాస్వామ్యం మీద ప్రతికూల స్పందనలకు ఆస్కారమివ్వవా? మిలిటెంట్‌ మార్గాలను ప్రోత్సహించవా? ఎందుకు అక్కడ అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నది?


‘అప్రకటిత అత్యవసర పరిస్థితి’ – ఈ మాట సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్భూషణ్‌ను దోషిని చేసిన ట్వీట్‌లో కూడా ఉన్నది. ఆయన ట్వీట్‌లను తప్పుపడుతూ చెప్పిన తీర్పు– అప్రకటిత అత్యవసర పరిస్థితి అన్న మాటల మీద వ్యాఖ్య ఏమీ చేయలేదు. అది రాజకీయమైన వ్యాఖ్య అని మాత్రమే అన్నారు. ‘‘గత ఆరేళ్లుగా దేశంలో అధికారికంగా అత్యవసర పరిస్థితి ప్రకటించకుండానే ప్రజాస్వామ్యం ఎంతగా విధ్వంసం అయిందో, భవిష్యత్‌ చరిత్రకారులు సమీక్షించినప్పుడు, ఆ విధ్వంసంలో సుప్రీంకోర్టు పాత్రను కూడా గుర్తిస్తారు. ముఖ్యంగా, చివరి నలుగురు ప్రధాన న్యాయమూర్తుల పాత్రనూ గుర్తిస్తారు.’’ ఈ రెండో ట్వీట్‌ న్యాయవ్యవస్థపై అవిశ్వాసాన్ని పెంచే విధంగా, అభ్యంతరకరంగా, అమర్యాదకరంగా ఉన్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 


ప్రశాంత్భూషణ్‌ వివాదంలో న్యాయశాస్త్ర పరమైన అంశాలు, చర్చలు చాలా సంక్లిష్టంగా ఉండవచ్చు. వాటిని పక్కనబెడితే, న్యాయరంగంతో సహా ఏదైనా బహిరంగ విమర్శకు సిద్ధపడాలని ప్రశాంత భూషణ్‌ అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి, ఆచరించడానికి ఎంతటి మూల్యమైనా చెల్లించడానికి తాను సిద్ధమని తన కోర్టు ప్రకటన ద్వారా ఆయన స్పష్టం చేశారు. విమర్శను ధిక్కారంగా భావించడం సరైనదేనా, న్యాయస్థానాల విశ్వసనీయతను విమర్శలు దెబ్బతీస్తాయా– అన్న చర్చ ఎట్లా ఉన్నప్పటికీ, గత ఐదారు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం అనేక పరీక్షలు ఎదుర్కొంటున్నదని, ఆ పరీక్షలలో న్యాయస్థానాల నుంచి ప్రజాస్వామ్యానికి కావలిసినంత సహాయం అందడం లేదని, భావించేవారు దేశంలో ఎందరో ఉన్నారు. మితిమీరిన జనామోదంతో, అధికారం సాయంతో రాజ్యాంగ స్ఫూర్తిని పక్కకు నెట్టివేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, మూడు ముఖ్యవ్యవస్థలలోను స్వతంత్రమూ గౌరవనీయమూ అయిన న్యాయవ్యవస్థ ప్రమాదాలను నివారించాలి. ఆ నమ్మకం సడలడమే సమస్య తప్ప, ధిక్కారం సమస్య కాకూడదు. తీర్పరులైనవారికి నిందితుల విధేయత వల్ల, లొంగుబాటు వల్ల ఆధిక్యం సమకూరదు. సత్యనిష్ఠ, నిష్పాక్షికత, నిప్పులాంటి నిజాయితీ – వల్ల గౌరవం లభిస్తుంది. ఆ గౌరవమే వారికి ఆధిక్యం ఇస్తుంది. ఇవన్నీ న్యాయమూర్తులకు తెలియనివి కావు. 


ఈ మొత్తం ఉదంతంలో చివరికేమవుతుందన్న ప్రశ్నకు సమాధానం– ప్రశాంత్‌భూషణ్‌కు ఏ శిక్ష పడుతుందన్న విచికిత్సలో ఉండదు. ఆయన లేవనెత్తిన అంశాన్ని దేశం ఏ మాత్రం ఖాతరు చేస్తుందన్నదానిలో ఉంటుంది. అనధికార అత్యవసర స్థితి ఉన్నదా, కశ్మీర్‌లోనే కాదు, దేశమంతటా ఉన్నదా? ఆ స్థితిని కొనసాగించడంలో సమస్త వ్యవస్థలూ సహాయపడుతున్నాయా? న్యాయవ్యవస్థతో పాటు మీడియా, పౌరసమాజం అంతా మౌనంతోనో, అంగీకారంతోనో, భయంతోనో, భక్తితోనో అందుకు ఉపయోగపడుతున్నాయా? ఆ క్రమాన్ని ఎట్లా నిరోధించగలం? వారి వర్తన వల్ల మన అగౌరవమా? మన అగౌరవం వల్లనే ప్రమాదమా? – వంటి అనేక ప్రశ్నలను ఎదుర్కొని మాత్రమే ముందుకు వెళ్లగలం.

Updated Date - 2020-08-22T05:59:16+05:30 IST