ధిక్కార గొంతుకలు దళిత కథా రచయిత్రులు

ABN , First Publish Date - 2021-03-08T06:07:35+05:30 IST

కారంచేడు సంఘటన (1985) కులోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేధావులందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చింది. అనంతరం తెలుగునాట వివిధ...

ధిక్కార గొంతుకలు దళిత కథా రచయిత్రులు

కారంచేడు సంఘటన (1985) కులోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేధావులందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చింది. అనంతరం తెలుగునాట వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యమ నాయ కులు సభలు, సమావేశాలు నిర్వహించడం నిత్యకృత్యమ యింది. 1990లో పూలే శత వర్ధంతి, 1991లో అంబేడ్కర్‌ శత జయంతి సందర్భంగా సభలు, సమావేశాలు దేశ వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా జరిగాయి. దళిత మహాసభ ఏర్పడింది. ఇదే సమయంలో చుండూరు మారణహోమం జరిగింది. బాబ్రీమసీదు విధ్వంసం జరిగింది. దీన్ని నిరసిస్తూ చైతన్యవంతమైన సమాజం పెద్దఎత్తున నిరసన కార్యక్ర మాలను చేపట్టింది. ఈ ఉద్యమాల ప్రభావం, ఉద్యమకారుల స్ఫూర్తి దళిత సాహిత్యంలో ప్రతిఫలించింది. అయితే దళిత మహిళలు రాసిన తెలుగు కథానికను అంచనా వేస్తున్న సమయంలో కేవలం 1990వ దశకాన్ని మాత్రమే ప్రామా ణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతకుముందు కూడా కథలు రాసిన దళితమహిళలున్నారు. చారిత్రకంగా 1990కి ముందు కథలు, 1990-2014 మధ్య కథలు, 2014 అనంతర కథలుగా విభజించుకోవొచ్చు. వీటిలో మళ్ళీ డర్బన్‌ సదస్సుకు ముందు తర్వాత అని కూడా విభజించవచ్చు.


1990కి ముందు కథలు రాసిన దళిత మహిళల్లో తాడి నాగమ్మ ముఖ్యురాలు. ఈమె తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి దళిత కథకురాలు. 1935 నాటికే కథలు, విమర్శ వ్యాసాలు రాసి పుస్తకంగా ప్రచురించింది. ఇట్లా మొదటి పుస్తకమేసిన దళితురాలు కూడా నాగమ్మే. ఈమె కథలు నేను సంకలనం చేసి 2016లో పుస్తకంగా వెలువరించాను. మారుమూల పల్లెలో టీచర్‌ ఉద్యోగం చేసుకుంటూ అంతర్జాతీయ విషయాలపై, జాతీయ ఉద్యమాలపై పూర్తిస్థాయి అవగాహనతో కథలు రాసినారు. దేశం కోసం పరాయి వ్యక్తిని ముద్దు పెట్టుకోవడానికి ఒక యువతి సాహసించిన తీరుని ‘ఒక ముద్దు’ కథగా మలిచింది. ఆ ముద్దుని చెల్లెలి ముద్దుగా పేర్కొని ఔరా అనిపించింది. ఆ తర్వాత 1935లోనే గృహలక్ష్మి పత్రికలో దళిత జీవితాన్ని చిత్రిస్తూ గొట్టిముక్కల మంగాయమ్మ ‘అయ్యోపాపం! మంచి నీళ్ళయినా ఇవ్వని మాయ సంఘం’ పేరిట కథ రాసింది. దాహంతో తల్లడిల్లుతున్న వారికి బ్రాహ్మణ సమాజం కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన అంశాన్ని కథగా మలిచింది. ఆఖరికి ఒక ముస్లిం నీళ్ళిచ్చి ప్రాణం నిలబెట్టడం కొసమెరుపు. 


1931లో జన్మించిన నంబూరి పరిపూర్ణ తర్వాతి తరంలో ముఖ్యురాలు. కులాంతర వివాహం చేసుకున్నది. ‘మాకు ఉషస్సులుంటాయి’ పేరిట కథా సంపుటిని వెలువరించింది. ‘స్వీయ చరిత్ర’ను రాసుకుంది. ఈమె కథల్లో మహిళలు ధిక్కారస్వరాన్ని వినిపించడమే గాక, కుల చైతన్యంతో ఉన్నారు. ఈమె కూతురు దాసరి శిరీష కూడా కథలు రాసింది. శిరిష రాసిన ‘వ్యత్యాసం’ కథ ‘నల్లపొద్దు’ సంకలనంలో ఉంది. అట్లాగే శిరీష కూతురు అపర్ణ తోట కథల సంపుటి ‘బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌’ పేరిట ఇటీవల అచ్చయ్యింది. ఈమె కథల్లో ఆధునిక, అర్బన్‌ మహిళ కోరుకుంటున్న ఆంక్షలు లేని ప్రపంచాన్ని చిత్రించింది.


తెలంగాణ ప్రాంతం నుంచి 1960వ దశకంలో చివర్లో మామిడి సత్యవతి కథలు రాసింది. జనగామలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఈమె కథలు ‘తెర తొలగింది’, ‘సుశీల’, ‘స్వేచ్ఛ’ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈమె తెలంగాణ నుంచి కథలు రాసిన తొలి మహిళ. 1941లో జన్మించిన ఈమె చదువుకొని, ఉన్నతోద్యోగం చేసింది. మామిడి సత్యవతి రాసిన ‘సుశీల’ కథ మంచి శిల్పంతో పురుషుల్లోని స్త్రీ లౌల్యాన్ని ఎత్తి చూపిం చింది. ఈ కథలో చీరలు కొనడం గురించి రాస్తూనే దాని వెనుక ఉన్న ఇల్లిసిట్‌ సంబంధాల నర్మగర్భంగా రాసింది. ఈ కథ 1971 నాటి యువపత్రికలో అచ్చ య్యింది. అట్లాగే గ్లోరియా లలితా పీటర్‌, సెంటినా సరోజినీ, మానుకొండ జ్యోతి, కె.దుర్గాదేవి, గెద్దాడ కస్తూరి, గుజ్జెర్లమూడి నిర్మలారాణి, జి.నిర్మలారాణి తదితరులు 1990లకు ముందు కథలు రాసిండ్రు.


1990వ దశకంలో దళితోద్యమ చైతన్యంతో ఒక వైపు ఉద్యమాల్లో పాల్గొంటూ మరోవైపు సాహితీ రంగంలో రాణించినవారు ఇప్పటికీ అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఇట్లా కథలు రాసిన వారిలో జాజుల గౌరి, గోగు శ్యామల, జూపాక సుభద్ర, మాదాసు వినోదినిలు ఉన్నారు. ఈ నలుగురూ తమ కథలను పుస్తకాలుగా వెలువరించారు. జాజుల గౌరి అర్బన్‌ జీవితంలో చదువు విలువను, పేదరి కాన్ని, ఆధిపత్య నిరసనను ‘మన్ను బువ్వ’ కథా సంపుటిలో రికార్డు చేసిండ్రు. గోగు శ్యామల కథల పుస్తకం ‘ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం’ పేరిట ప్రచురి తమయింది. ఇందులో తెలంగాణ మాదిగల, వారి ఆశ్రిత కులాల జీవన స్థితిగతులను, వాడ బతుకులను చిత్రిం చింది. మాదిగ సాంస్కృతిక అస్తిత్వాన్ని అక్షరీకరించింది. జూపాక సుభద్ర తన కథల సంపుటి ‘రాయక్క మాన్యమ్‌’లో వివక్ష ఎన్ని రకాలుంటదో లెక్కగట్టి చెప్పింది. ‘బల్లెనే దోస్తుగానీ ఊల్లె గాదు’ అని వివక్ష రూపాన్ని చిత్రిక గట్టింది. దళిత ఉన్నతోద్యోగి ఇంటి పనిమనిషి కులం కారణంగా తకరారు బెట్టడం, ఆఫీసులో తోటి ఉద్యోగులు తినే కాడ వివక్ష చూపడం ఇట్లా అనేక కథలను రాసింది. ఆమె రాసిన ‘శుద్ధి జెయ్యాలే’ సమాజాన్ని చైతన్యపరిచే కథ. ఆంధ్రాకు చెందిన వినోదిని ఉద్యోగ రీత్యా రాయల సీమలో ఉంటూ ఎక్కడున్నా దళితుల జీవితాలు ముఖ్యంగా మహిళల జీవితాల్లో ఎట్లాంటి మార్పు లేదూ అంటూ ‘బ్లాక్‌ ఇంక్‌’ కథా సంపుటి వెలువరించింది. హాంట్‌ చేసే కథలు రాయడంలో వినోదిని మాదాసు సిద్ధహస్తురాలు. ఆమె ‘బ్లాక్‌ ఇంక్‌’ కథా సంపుటి ఆధునిక స్త్రీ ధిక్కార స్వరాన్ని వినిపించింది. అదే సమయంలో దళిత అస్తిత్వాన్ని, ఆత్మగౌరవానికి పట్టం గట్టింది. సకల ఆధిపత్యాలపై పంజా విసిరింది. ముఖ్యంగా దళిత స్త్రీలకు మాత్రమే ప్రధాన సమస్యగా ఉన్న బహిర్భూమి సమస్యను ‘కట్ట’ పేరిట రాసింది. అగ్రకుల పురుషాధిపత్యం ఎట్లా రైలు పట్టాల పక్కన చెంబట్క పొయ్యే మహిళలను వేధిస్తూ ఉంటుందో కండ్లకు కట్టినట్టు చూపించింది. కష్టాల వలపోత గాకుండా కార్యాచరణ కూడా ఆమె కథల్లో ప్రధాన లక్షణం. 


వీళ్ళేగాక ఈ దశలో బలిజెపల్లి విజయలక్ష్మి, భూషి హేమ, పుట్ల హేమలత, చల్లపల్లి స్వరూపా రాణి, కొలకలూరి మధుజ్యోతి, పచ్చనూరు అనురాధ, మేరి మాదిగ, వి. నాగమణి తదితరులు కథలు రాసిండ్రు. ఇందులో చాలా కథలు గోగు శ్యామల సంకలనం చేసిన ‘నల్లపొద్దు’లో ఉన్నాయి. పచ్చనూరు అనురాధ ‘పాట నేర్చిన నెమలి’, ‘పాములు పట్టె మావులమ్మ’ కథలు రెండూ దళిత మహిళల దయనీయ స్థితిని చిత్రించాయి.


2001 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 7 వరకు దక్షిణా ఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన జాతి వివక్ష వ్యతిరేక సదస్సులో చాలామంది తెలుగువాళ్ళు కూడా పాల్గొన్నారు. అంత ర్జాతీయ స్థాయిలో డప్పుల దరువేసి వివక్ష/సమస్యలను రికార్డు చేసిండ్రు. ఈ స్ఫూర్తితో నల్లపొద్దు ‘దళిత స్త్రీల సాహిత్యం 1921-2002’ పుస్తకాన్ని గోగు శ్యా మల 2003లో వెలువరించింది. అన్వేషి సంస్థ తరపున పరిశోధన అంతకుముందునుంచే జరుగు తున్నప్పటికీ డర్బన్‌ సదస్సు పుస్తక ప్రచురణను వేగవంతం జేసింది. ఇందులో అప్పటివరకు రచనలు చేస్తున్న దాదాపు అం దరు దళిత మహిళ లని చరిత్రకెక్కించింది. గొట్టుముక్కల మంగా యమ్మలాంటి ఒకరి ద్దరు ఇందులో మిస్స యిండ్రు. ఆ తర్వాత గోగుశ్యామల, జూపాక సుభద్ర ఇద్దరూ ‘నల్లరేగటి సాల్లు మాదిగ ఉపకులాల ఆడోళ్ళ కథలు’ పేరిట 2006లో వెలువరించారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన కథకురాలు చిలుకూరు దీవెన. ఈమె కథ ‘రేపటి కిరణం’ కథ ఎవ్వరికేది ఇష్టమైతే అదే చదవాలి అని తేల్చి చెబుతుంది. ఎందుకంటే బలవంతపు చదువుల వల్ల బలవన్మరణాలుంటాయన్నది తెలిసిన విషయమే! ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు కూడా అందులో భాగస్వాములయిండ్రు. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి కొత్త కథకులు ఎక్కువమంది ఎదిగి వచ్చిండ్రు. అందులో దళిత మహిళలూ అధికంగానే ఉన్నారు.


తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు ప్రాంతాలనుంచి దళిత యువ కథా రచయిత్రులు చాలామంది కొత్తగా కథలు రాస్తున్నారు. తెలంగాణ నుంచి కథలు రాస్తున్నవారిలో ఎక్కువమంది అధ్యాపక వృత్తిలో ఉండడం గమనార్హం. విఠాలపురం పుష్పలత, హైమవతి, కొమ్ము రజిత, తాళ్లపల్లి యాకమ్మ, గంధం విజయలక్ష్మి, నిదానకవి నీరజ తదితరులందరూ అధ్యాపక వృత్తిలోనే ఉన్నారు. వీళ్ళందరూ 2014 తర్వాతనే కథారంగంలోకి అడుగుపెట్టారు. అట్లాగే ఆంధ్రప్రాంతానికి చెందిన ఎండ్లూరి మానస, రాయలసీమకు చెందిన ఎండవల్లి భారతి ఉన్నారు. ఇందులో మానస, హైమవతి, తాళ్లపల్లి యాకమ్మ, ఎండవల్లి భారతిలు కథా సంకలనాలనూ వెలువరించారు. అట్లాగే రాయలసీమ నుంచి ఇటీవలే కథలు రాస్తున్న కొత్త గొంతుక కోటమలిగ అరుణ. కెంగార మోహన్‌ సంపాదకత్వంలో ఇటీవల వెలువడ్డ దళిత కథలు ‘నిప్పులవాన’లో ఈమె కథ ‘విజేత’కు చోటు దక్కింది. ఈమె అధ్యాపక వృత్తిలో అనంతపురంలో పనిచేస్తున్నది. ఈ సంకలనంలోనే మల్లెపోగు వెంకటలక్ష్మమ్మ కథ కూడా ఉన్నది.  


మహబూబ్‌నగరలో లెక్చరర్‌గా పనిచేస్తున్న విఠాల పురం పుష్పలత ‘కిరాయి ఇల్లు’ పేరిట రాసిన కథలో దళితులు జనారణ్యంలో ఎట్లా వివక్షతకు గురవుతున్నారో రికార్డు చేసింది. మరో లెక్చరర్‌ హైమవతి ‘జోలె విలువ’ పేరిట ఆరు కథలతో సంపుటాన్ని వెలువరించింది. ఈ పుస్తకాన్ని 2018లో విరసం ప్రచురించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మఖ్తల్‌కు చెందిన హైమవతి కథల్లో అంతర్లీనంగా కుల వివక్షకు వ్యతిరేకత ఉన్నది. దళిత క్రైస్తవ, ట్రాన్స్‌జెండర్‌ జీవితాలు నేపథ్యంగా, అర్బన్‌ కేంద్రంగా కథలు రాస్తున్న ధిక్కార స్వరం ఎండ్లూరి మానస. ‘మిళింద’ పేరిట కథల సంపుటిని వెలువరించిందివి. తెలం గాణలోని వరంగల్‌కు చెందిన తాళ్లపల్లి యాకమ్మ రెండు కథా సంపుటాలు వెలు వరించింది. ‘రక్షణ’ పేరుతో యాకమ్మ తమ సామాజిక వర్గం సామూహిక జీవిత చిత్రాన్ని మన ముందుంచుతున్నది. 14 కథల ఈ సంపుటిలో దళిత విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ (సాధికారత), మాదిగ ఆశ్రిత కులాల దయనీయ స్థితి, అంబేడ్కర్‌ స్ఫూర్తి, విద్య వల్ల కలిగే విజయాలను, సక్సెస్‌ స్టోరీలను రికార్డు చేసింది. మెర్సీ మార్గరెట్‌, కొమ్ము రజిత, పులి కవిత, జూపూడి జిగీష తదితరులు ఆధునిక స్త్రీ దృక్కోణంలో సమాజాన్ని పరిశీలిస్తూ అనుభవాలను అక్షరాలుగా మలుస్తున్నారు.  


ఇటీవలి కాలంలో రాయలసీమ నుంచి కెంగార మోహన్‌ ‘నిప్పుల వాన’ పేరిట దళిత కథలను వెలువరించారు. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్‌ లాంటి మిత్రులు ‘దళిత కథా వార్షిక’ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అట్లాగే ‘మడి నారు’ పేరిట మళయాల దళిత కథలు, సమకాలీన కన్నడ దళిత కథలు, ‘జీవనాడి’ తమిళ దళిత కథలు వెలువ డ్డాయి. వీటికి తోడు మరాఠీ దళిత సాహిత్యం కూడా తెలుగులోకి బాగానే అనువాదమయింది. పరభాషల నుంచి తెలుగులోకి ఇంకా విస్తృతంగా కథలు అనువాదం కావాలి. అయితే అదే స్థాయిలో తెలుగు నుంచి కూడా ఆయా భాషల్లోకి కథలు తర్జుమా కావాలి. తర్జుమా కావాలి అంటే ముందు అవి మన తెలుగు భాషలో అచ్చు కావాలి. ఇప్పటి వరకు ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన కథలు సంకలనంగా వెలువడలేదు. ఇందుకు ఇటీవల కథకురాలు, కవయిత్రి షాజహానా ‘మొహర్‌’ ముస్లిం స్త్రీల కథల ద్వారా దారులు వేసింది. ఆ దారిలో దళిత స్త్రీల కథలు రావాలి. ఒక్కో కథకురాలివి ఒక్కో కథ ఎంపిక జేసి 40మందికి పైగా ఉన్న దళిత కథాయిత్రులను ఒక్కదగ్గరికి తీసుకొచ్చినట్లయితే స్త్రీలు సృజించిన కథా సాహిత్యంపై ప్రత్యేకమైన శ్రద్ధతో అధ్యయనం చేయడానికి వీలవు తుంది. ఈ దారిని మిత్రులు నిర్మించాలని కోరుకుంటూ...

(రాయలసీమ మిత్రులు జి.వెంకటకృష్ణకు కృతజ్ఞతలు) 

సంగిశెట్టి శ్రీనివాస్‌

(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)


Updated Date - 2021-03-08T06:07:35+05:30 IST