తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-15T09:01:05+05:30 IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

3 కిలోమీటర్లు వ్యాపించిన క్యూలైన్‌.. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటలు


తిరుమల, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతోపాటు వివాహ ముహూర్తాలు కూడా భారీగా ఉన్న క్రమంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలలో రద్దీ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 83,422 మందికి దర్శనం కల్పించారు. ఆదివారం కూడా భక్తులు కిక్కిరిశారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 50,443 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యావనంలోని తొమ్మిది షెడ్లు భక్తులతో నిండిపోయి క్యూలైన్‌... గతంలో ఎన్నడూ లేనివిధంగా లేపాక్షి, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఫైర్‌స్టేషన్‌, సేవాసదన్‌ మీదుగా ఆక్టోపస్‌ భవనం సమీపంలోని రింగ్‌రోడ్డువరకు దాదాపు మూడు కిలోమీటర్లుకుపైగా క్యూలైన్‌ వ్యాపించింది. వీరికి దాదాపు 40 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తుంది. క్యూలైన్‌ ప్రారంభమయ్యే రింగ్‌రోడ్డులో భక్తులను విజిలెన్స్‌, పోలీసులు బృందాలుగా క్యూలైన్‌లోకి అనుమతించారు. వృద్ధులు, పిల్లలతో వచ్చిన భక్తులు క్యూలైన్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొంతమంది భారీ క్యూలైన్‌ను చూసి తిరుమల నుంచి వెనుదిరిగారు. ఆలయ మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నదాన భవనం, బస్టాండ్‌ ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. కాలినడకమార్గాల ద్వారా భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. రద్దీ భారీగా పెరిగిన క్రమంలో గదుల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని గదుల కేటాయింపు కేంద్రాల్లో నో రూమ్స్‌ బోర్డులు పెట్టేశారు. గదులు లభించని భక్తులు కార్యాలయాలు, షెడ్లు, రోడ్డు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌లపై సేదతీరుతున్నారు. కనీసం లాకర్లు కూడా లభించని పరిస్థితి నెలకొంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా యాత్రికులతో నిండిపోయాయి. కాలినడక మార్గం ద్వారా వచ్చిన భక్తులు డిపాజిట్‌ చేసిన లగేజీ కోసం గంటలు తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. మంగళవారం వరకు రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి. రద్దీ పెరిగిన క్రమంలో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించేలా ఈ నెల 21వ తేదీ వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కేవలం ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. 


తిరుమలేశుడి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. వీరిలో.. డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎం వైద్య, టీటీడీ ఆస్థాన గాయకురాలు శోభారాజ్‌ ఉన్నారు.



Updated Date - 2022-08-15T09:01:05+05:30 IST