మూసీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2022-07-01T07:14:46+05:30 IST

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

మూసీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
మూసీ నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు

పులిచింతలకు పెరిగిన వరద

డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

కేతేపల్లి/చింతలపాలెం/డిండి, జూన్‌ 30: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46టీఎంసీ) కాగా, గరిష్ఠ స్థాయికి చేరడంతో ఐదు క్రస్ట్‌ గేట్లను ఎత్తి మూడు రోజులుగా నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. క్రస్టుగేట్ల ద్వారా మూసీ ప్రాజెక్టు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. గురువారం సాయంత్రానికి ఎగువ నుంచి 21 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 3, 4, 7, 8, 10 నెంబర్‌ క్రస్టు గేట్లను అడుగున్నర మేర ఎత్తి 4,269 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టాన్ని గురువారం సాయంత్రానికి 639.40 అడుగులకు (3.08 టీఎంసీ) తగ్గించారు.

‘పులిచింతల’కు 4,800క్యూసెక్కుల వరద

చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రా జెక్టుకు ఎగువనుంచి 4,800క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పవర్‌హౌ్‌సలోని ఒక యూనిట్‌ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ గంటకు 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీ) కాగా, ప్రస్తుతం 164.20 అడుగులుగా (30.61టీఎంసీ) నమోదైంది.

డిండి నీటి విడుదల

నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు నుంచి నీటిని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ గురువారం విడుదల చేశారు. డిండి ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులుకాగా, ప్రస్తుతం 30 అడుగుల మేర ప్రాజెక్టులో నీరుంది. వర్షాధార ప్రాజెక్టు కావడంతో ఎగువన వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి వరద వస్తుంది. ప్రాజెక్టు పరిధిలో 12500 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ మేరకు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఖరీఫ్‌ పంటల సాగుకు డిండి ప్రాజెక్టు నీటిని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిండి రిజర్వాయర్‌  షట్టర్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.40లక్షలతో షట్టర్లు, ఆఫ్రాన్‌ పనులు చేస్తామన్నారు. నక్కలగండి, గొట్టిముక్కల రిజర్వాయర్‌ నిర్వాసితుల పునరావాసానికి సైతం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మ, వైస్‌ చైర్మన్‌ జంగారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ మేకల సాయమ్మకాశయ్య, ఎంపీటీసీలు బూషిపాక వెంకటయ్య, రాధిక, ఈఈ శ్రీధర్‌రావు, ఎంపీడీవో డానియేలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T07:14:46+05:30 IST