అదే ముసురు

ABN , First Publish Date - 2021-07-23T05:43:39+05:30 IST

రెండో రోజూ ఉమ్మడి మెదక్‌ జిల్లాను ముసురు కమ్మేసింది. రోజంతా ఎడతెరిపి లేకుండా పడిన వానతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. సిద్దిపేట జిల్లాలో వాగులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో సిద్దిపేట - హన్మకొండ ప్రధాన దారిని మూసివేశారు. సంగారెడ్డి జిల్లాలో నారింజ వాగు షటర్‌ గేట్లపైనుంచి వరద పారుతుండడంతో కర్ణాటక రాష్ట్రానికి నీరు తరలిపోతుంది. మెదక్‌ జిల్లాలో పలు గ్రామాల్లోని ఐదు ఇళ్లు నేలకూలాయి. అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో చేలల్లో వర్షపు నీరు చేరి పంటలు దెబ్బతిన్నాయి.

అదే ముసురు
సిద్దిపేట-హన్మకొండ ప్రధాన రహదారిలోని బస్వాపూర్‌ వద్ద పొంగిపొర్లుతున్న మోయతుమ్మెద వాగు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎడతెరిపిలేని వాన

భారీ వర్షంతో ఉప్పొంగిన వాగులు

నిండుకుండలా చెరువులు.. ప్రాజెక్టులకు జలకళ

సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల నిలిచిన రాకపోకలు

పత్తి, మొక్కజొన్న, కంది, సోయా పంటలకు నష్టం


రెండో రోజూ ఉమ్మడి మెదక్‌ జిల్లాను ముసురు కమ్మేసింది. రోజంతా ఎడతెరిపి లేకుండా పడిన వానతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. సిద్దిపేట జిల్లాలో వాగులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో సిద్దిపేట - హన్మకొండ ప్రధాన దారిని మూసివేశారు. సంగారెడ్డి జిల్లాలో నారింజ వాగు షటర్‌ గేట్లపైనుంచి వరద పారుతుండడంతో కర్ణాటక రాష్ట్రానికి నీరు తరలిపోతుంది. మెదక్‌ జిల్లాలో పలు గ్రామాల్లోని ఐదు ఇళ్లు నేలకూలాయి. అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో చేలల్లో వర్షపు నీరు చేరి పంటలు దెబ్బతిన్నాయి.


సిద్దిపేట జిల్లాలో 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 22 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. వాగులు పొంగడంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాజీవ్‌ రహదారి మినహా మిగతా రోడ్లకు వర్షం ముప్పు నెలకొన్నది. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించనప్పటికీ వరుణుడి ప్రతాపానికి ఎక్కడికక్కడ కట్టడి కనిపిస్తున్నది. సిద్దిపేట రూరల్‌ మండలంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నారాయణరావుపేట, దుబ్బాక, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్‌, తొగుట, మిరుదొడ్డి, కొండపాక, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట మండలాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లోనూ 3 సెంటీమీటర్లకు మించిన వర్షం కురిసింది. జిల్లాలో సగటున 5.44 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు అధికారులు తెలిపారు. జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 244 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 557 మిల్లీమీటర్లు నమోదు కావడం విశేషం. 


కూడవెళ్లి ఉగ్రరూపం

దుబ్బాక/మిరుదొడ్డి/చేర్యాల/కొండపాక : భారీ వర్షానికి దుబ్బాక మండలంలోని కూడవెళ్లి వాగు ఉప్పొంగింది. పోతరెడ్డిపేట పెద్దచెరువు మినహా అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. దుబ్బాక పట్టణంలోని రామసముద్రం చెరువు అలుగు దూకుతోంది. దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లోని 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. చేర్యాల ఆర్టీసీ బస్డాండు ఆవరణ జలమయమైంది. పట్టణంలోని జనగామ-సిద్దిపేట ప్రధార రహదారిపై గుంతలు ఏర్పడి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని అంగడిబజార్‌లో ఓ ఇంటిగోడ కూలింది. కొండపాక మండలం ఆరేపల్లిలోని వెలికట్ట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరింది. గత వర్షాకాలంలో కూడా ఈ సబ్‌ స్టేషన్‌లో ఇదే పరిస్థితి నెలకొన్నది.మంగోల్‌ దుడ్డ చెరువు నిండి మత్తడి పారుతున్నది. తిప్పారం, సింగారం, దుద్దెడ వాగులు పారుతున్నాయి. బొబ్బాయిపల్లిలో పిడుగుపాటుతో గేదె మృతి చెందింది.


ఈ దారుల్లో రాకపోకలు బంద్‌

-కోహెడ మండలం బస్వాపూర్‌ సమీపంలోని మోయతుమ్మెద వాగు పొంగిపొర్లడంతో సిద్దిపేట-హన్మకొండ ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. వాహనాలన్నీ నిలిచిపోయాయి. నంగునూరు మండలం గట్ల మల్యాల మీదుగా కొన్ని వాహనాలను మళ్లించారు. ముళ్ల కంచెలు, ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షించారు. 

-మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ బ్రిడ్జిపై కూడవెళ్లి వాగు ఉదృతంగా ప్రవహించడంతో మిరుదొడ్డి నుంచి తొగుట, సిద్దిపేటలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. 

-నారాయణరావు పేట మండలం లక్ష్మీదేవిపల్లి నుంచి నారాయణరావుపేటకు వచ్చే దారిలో గల కాజ్‌వే బ్రిడ్జి మునిగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

-బెజ్జంకి-పోతారం, బెజ్జంకి- బేగంపేట గ్రామాల నడుమ ఉన్న లెవల్‌ కల్వర్టులు నీటి ప్రవాహంలో మునిగాయి. ఫలితంగా ఈ గ్రామాల నడుమ రాకపోకలు పూర్తిగా నిలిచాయి. 

-మద్దూరు మండలం లింగాపూర్‌ చెక్‌డ్యామ్‌ కాజ్‌వేకు మరమ్మతులు చేసినప్పటికీ ప్రస్తుత వర్షాలకు అంతా కొట్టుకుపోయింది. దీంతో జాలపల్లి, దూలిమిట్ట, లింగాపూర్‌, తోర్నాల నుంచి మద్దూరుకు వచ్చే దారికి అంతరాయం ఏర్పడింది. 

-చేర్యాల మండలం తాడూరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాడూరు, దానంపల్లి, చిట్యాల, కొండపాక, కడవేర్గు వెళ్లడానికి రాకపోకలు నిలిచిపోయాయి. 

-చేర్యాల మండలంలోని కడవేరుగు చెరువు మత్తడి దూకి చేర్యాల-నాగపురి గ్రామ ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండటంతో పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, నాగపురి, షబాషీ గూడెనికి రాకపోకలు నిలిచిపోయాయి. 


మెదక్‌ జిల్లాలో ముంచెత్తిన వాన

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూలై 22 : మెదక్‌ జిల్లాను రెండు రోజులుగా వర్షం ముంచెత్తుతోంది. మంగళవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతుంది. ముసురుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కూలీలకు పని, పశువులకు మేత లేకుండా పోయింది. వర్షాలు ఇలాగే కురుస్తే వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సగటున 3.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామాయంపేట మండలంలో అధికంగా 5.62 సెం.మీ. వర్షం కురిసింది. చిన్నశంకరంపేట, మనోహరాబాద్‌, నార్సింగ్‌, నిజాంపేట  మండలాల్లో 5 సెం.మీ. వాన పడింది. హవేళీఘనపూర్‌, మెదక్‌, మాసాయిపేట మండలాల్లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చేగుంట, నర్సాపూర్‌, శివ్వంపేట, తూప్రాన్‌, వెల్దుర్తి, కౌడిపల్లి మండలాల్లో మూడు సెం.మీ., పెద్దశంకరంపేట, పాపన్నపేట, అల్లాదుర్గం, టేక్మాల్‌, చిల్‌పచెడ్‌ మండలాల్లో 2 సెం.మీ.కుపైగా వర్షపాతం కురిసింది. రేగోడు మండలంలో సెంటీమీటర్‌ పడింది. వెల్దుర్తి మండలంలోని గోన మైసమ్మ ఆలయ సమీపంలో ఉన్నదేవతల చెరువు కట్ట కుంగి పగుళ్లు ఏర్పడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐదు ఇళ్లు నేలకూలగా, 15 ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో వరద ఉధృతితో రోడ్లు తెగిపోయిన, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించినా, ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్పీ చందనాదీప్తి ఒక ప్రకటనలో కోరారు. లేదా వాట్సాప్‌ 7330671900, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 08452-223533కు సమాచారమిస్తే సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని ఎస్పీ పేర్కొన్నారు.


వెయ్యి ఎకరాల్లో పంట నష్టం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/కోహీర్‌/కల్హేర్‌/పుల్కల్‌, జూలై 22 : సంగారెడ్డి జిల్లాలో సగటున 2.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గుమ్మడిదల మండలంలో అధికంగా 3.5 సెం.మీ. వర్షం కురిసింది. మంగళవారం నుంచి ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కోహీర్‌, నారాయణఖేడ్‌, గుమ్మడిదల తదితర ప్రాంతాల్లోని పత్తి, మొక్కజొన్న, సోయా చేలల్లో వర్షపు నీరు చేరింది. కోహీర్‌ మండల పరిధిలోని నారింజ వాగు పరీవాహక ప్రాంతాల్లో 1000 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో వర్షపు నీళ్లు చేరడంతో పంటలన్నీ ఎదుగుదలను కోల్పోయాయి. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని జడ్పీటీసీ రాందాస్‌ కోరారు. సిర్గాపూర్‌ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు మరోసారి అలుగుపై నుంచి పొంగిపొర్లింది. ప్రాజెక్టు సామర్థ్యం 1,493 అడుగులు కాగా పూర్తిస్థాయి మట్టాన్ని చేరుకుని అలుగు దూకుతోంది. దీంతో దిగువన ఉన్న మంజీరా నదిలోకి వరద నీరు ప్రవహిస్తున్నది. సిర్గాపూర్‌ మండంలోని జంలా తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని జీవ్లా తాండాలో కేలోత్‌ కమ్లిబాయికి చెందిన ఇంటి వెనుక భాగం కూలింది. పుల్కల్‌ మండలంలలోని సింగూరు ప్రాజెక్టుకు 3,347 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గురువారం ఉదయం నాటికి ప్రాజెక్టులో 521.376 మీటర్లకు 19.518 టీఎంసీల నీరు ఉంది. 

Updated Date - 2021-07-23T05:43:39+05:30 IST