ముసురు వాన

Nov 29 2021 @ 00:51AM
టమోటా తోటలో నీళ్లు నిలిచి రాలిపోయిన కాయలు

తంబళ్లపల్లె, నవంబరు 28: తంబళ్లపల్లెలో ఆదివారం ముసురు వాన కురిసింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ ఎడ తెరిపిలేకుండా తేలికపాటి చిరుజల్లులు కురుస్తూనే వున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వగా, రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. పలు గ్రామాల్లో వర్షానికి  ఇళ్లు ఉరుస్తున్నాయి. ఇటీవల తుపాను కారణంగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో  మండలవ్యాప్తంగా 220 హెక్టార్లలో  పంటలకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన వరి మొలకలు వస్తుండగా, టమోటా తోటలో నీళ్లు నిలిచి కాయలకు నల్ల మచ్చలు ఏర్పడి రాలి పోతున్నాయి.  

బురదయమమైన ములకలచెరువు మార్కెట్‌ యార్డు ప్రాంగణం

వీధులన్నీ బురదమయం 


ములకలచెరువు: మండలంలో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు వరుసగా వచ్చిన రెండు తుఫాన్ల కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ మరో తుఫాను కారణంగా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ములకలచెరువులో ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ బురదమయమయ్యాయి. మార్కెట్‌ యార్డు ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండు ప్రాగణం, వినాయకనగర్‌, పోస్టాఫీసు తదితర వీధులన్నీ రొచ్చుగా మారాయి. దీంతో రాకపోకలు సాగించడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు గ్రామాల రోడ్లు కూడా బురదమయం కావడంతో గ్రామీణులకు అవస్థలు తప్పడం లేదు. 

చిన్నపాటి వర్షం 


పెద్దమండ్యం:  మండలంలో ఆదివారం చిన్నపాటి వర్షం కురిసింది. ముసురుకున్న మబ్బులు కమ్ముకున్న వాతావరణంతో చలి నెలకొంది. చెరువుల మొరవలు, నది ప్రవాహాలు సాధారణ స్థితిలో ప్రవహిస్తున్నాయి. మండల ప్రజలు రాత్రివేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సర్పంచులు కోరారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.