సమగ్ర రక్షిత నీటి పథకాల కాంట్రాక్టర్లు అల్టిమేటం

Jul 30 2021 @ 00:32AM
ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంట్రాక్టర్లు

 వెంటనే బిల్లులు చెల్లించకపోతే ఒకటి నుంచి నిర్వహణ బంద్‌

 రూ.12 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌

 నెల క్రితం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు అప్‌లోడ్‌

 ఇంతవరకు క్లియర్‌ కాని వైనం

 నీటి పథకాలను నిర్వహించలేమంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

  వందలాది గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు

అచ్యుతాపురం/విశాఖపట్నం, జూలై 29: జిల్లాలో సమగ్ర రక్షిత నీటి పథకాల(సీపీడబ్ల్యూ) నిర్వహణ బిల్లులు చెల్లించకపోవడంతో వీటిని నిర్వహిం చలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. నీటి పథకాల వద్ద పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వ డానికి అప్పులు చేస్తున్నట్టు వాపోతున్నారు. రూ.12 కోట్ల బకాయిలను రెండు మూడు రోజుల్లో చెల్లించకపోతే ఆగస్టు ఒకటి నుంచి పథకాలను నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామీణ నీటి పథకం ఎస్‌ఈ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 43 సమగ్ర రక్షిత నీటి పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ పథకాల నిర్వహణ బాధ్యతలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టర్లు అవసరమైన మేర సిబ్బందిని నియమించుకుని, పంప్‌ హౌస్‌ల నుంచి ఫిల్టర్‌ పాయింట్లకు నీటిని పంపింగ్‌ చేయడం, అక్కడి నుంచి ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు ఎక్కించడం, రోజూ కుళాయిలకు నీటిని సరఫరా చేయడం, వాటర్‌ ట్యాంక్‌లను తరచూ శుభ్రం చేయడం, పైప్‌లైన్‌కు మరమ్మతులు వంటివి చేస్తుంటారు. విద్యుత్తు బిల్లులతో కలిపి ఏటా సుమారు రూ.20 కోట్లను గ్రామీణ నీటి పథకం అధికారులు చెల్లించాల్సి వుంటుంది. అయితే కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరులో ప్రభుత్వాలు కొంత అలసత్వం వహిస్తుంటాయి. గతంలో విడతల వారీగా నిధులు మంజూరు చేసేవారు. అయితే 2020-21లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దాదాపు ఏడాది నుంచి సుమారు రూ.20 కోట్ల మేర బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు విలవిలలాడుతున్నారు. 

ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లా పరిషత్‌కు కొంతమేర నిధులు వచ్చాయి. వీటి నుంచి సీపీడబ్ల్యూల నిర్వహణకు నిధులు కేటాయించుకునే వెసులుబాటు ఉంది. నెల క్రితం జిల్లా పరిషత్‌ నుంచి రూ.12 కోట్లను సీపీడబ్ల్యూల నిర్వహణకు విడుదల చేయడానికి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.8 కోట్ల మేర వున్నాయి. 

వీటిపై ఈపీడీసీఎల్‌ అధికారులకు విజ్ఞప్తిచేయడంతో వారు సానుకూలంగా స్పందించారు. కాగా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పెట్టిన రూ.12 కోట్ల బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి నీటి పథకాలను నిర్వహించడం తమ వల్ల కాదంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో సమగ్ర రక్షిత నీటి పథకాల పరిధిలో వున్న వందలాది గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకం అవుతుంది.

రూ.12 కోట్లకు బిల్లు పెట్టాం

-వి.రవికుమార్‌, ఎస్‌ఈ, గ్రామీణ నీటి పథకం

జిల్లాలో 43 సీపీడబ్ల్యూలు నిర్వహించే కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం నుంచి నిధులు రాలేదు. అంతకు ముందు కొంతమేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రావడంతో రూ.12 కోట్ల చెల్లింపులకు జిల్లా పరిషత్‌ సీఈవో బిల్లులు పెట్టారు. ఇవి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లిస్తాం. ఆగస్టు ఒకటి నుంచి పథకాలను నిర్వహించలేమంటూ కాంట్రాక్టర్లు వినతిపత్రం ఇచ్చారు. ఈలోగానే నిధులు విడుదల కావచ్చని భావిస్తున్నాం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.