Kuwaitization Scheme: 30 మంది విదేశీ ఉద్యోగులపై వేటు వేసిన కువైట్ సర్కారు.. ప్రవాసుల్లో కొత్త టెన్షన్..!

ABN , First Publish Date - 2022-09-02T14:47:13+05:30 IST

రోజురోజుకీ కువైత్‌లో పెరిగిపోతున్న ప్రవాసుల (Expats) ప్రాబల్యాన్ని అడ్డుకట్టవేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ దేశం 2017లో కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Scheme) తీసుకొచ్చింది.

Kuwaitization Scheme: 30 మంది విదేశీ ఉద్యోగులపై వేటు వేసిన కువైట్ సర్కారు.. ప్రవాసుల్లో కొత్త టెన్షన్..!

కువైత్ సిటీ: రోజురోజుకీ కువైత్‌లో పెరిగిపోతున్న ప్రవాసుల (Expats) ప్రాబల్యాన్ని అడ్డుకట్టవేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ దేశం 2017లో కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Scheme) తీసుకొచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వలసదారులు భారీ మొత్తంలో ఉద్యోగాలు పొందుతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఐదేళ్లలో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కువైత్ ఈ ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. అనుకున్నట్లే ఇప్పుడు ఈ స్కీంను పకడ్బందీగా అమలు చేయడం మొదలెట్టింది. 


ఇప్పటికే ఇటు ప్రభుత్వ సంస్థలతో పాటు అటు ప్రైవేట్ రంగ కంపెనీల్లో కూడా ప్రవాస ఉద్యోగులపై వేటు వేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ఆ దేశ న్యాయ మంత్రిత్వశాఖ (Ministry of Justice) 30 మంది నాన్-కువైటీ ఉద్యోగులను తొలగించింది. కువైటైజేషన్ పాలసీలో భాగంగానే 30 మంది ప్రవాస ఉద్యోగులపై వేటు వేసినట్లు మంత్రిత్వశాఖ అండర్‌సెక్రటరీ ఒమర్ అల్-షరాక్వీ వెల్లడించారు. న్యాయశాఖలో ప్రవాస ఉద్యోగుల సంఖ్యను తగ్గించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వ ప్రణాళికను త్వరితగతిన ముందుకు తీసుకెళ్తున్నట్లు న్యాయశాఖ, ఎండోమెంట్స్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి జమాల్ అల్-జలావి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కువైటైజేషన్ పాలసీ ద్వారా కువైటీలు కాని ఉద్యోగుల ఒప్పందాలను త్వరగా రద్దు చేసి కువైత్ జాతీయులతో భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇదిలాఉంటే.. కువైత్‌లో ఉన్న విదేశీ ఉద్యోగుల్లో అధిక సంఖ్యలో ఉన్నది ఈజిప్టిన్లు. వీరి సంఖ్య ఏకంగా 18లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భారతీయ ప్రవాసులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు కువైటైజేషన్ పాలసీని అక్కడి సర్కార్ పకడ్బందీగా అమలు చేస్తుండడంతో ప్రవాసుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. తమపై కూడా వేటు తప్పదని, దీనికి అన్ని విధాల సిద్ధంగా ఉండాలనే నిర్ణయానికి వస్తున్నారు.   

Updated Date - 2022-09-02T14:47:13+05:30 IST