వరద తెచ్చిన వివాదం

ABN , First Publish Date - 2021-11-26T08:15:30+05:30 IST

తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చెరువు వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేరూరు చెరువు నిండడంతో చెరువులోని నీటిని పాతకాల్వ, సి. గొల్లపల్లె పొలాల మీదుగా స్వర్ణముఖి నదిలోకి తరలించడానికి ప్రయత్నం జరుగుతోంది.

వరద తెచ్చిన వివాదం
లాఠీఛార్జిలో గాయపడిన సరిత

తిరుపతి రూరల్‌, నవంబరు 25: తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చెరువు వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేరూరు చెరువు నిండడంతో చెరువులోని నీటిని పాతకాల్వ, సి. గొల్లపల్లె పొలాల మీదుగా స్వర్ణముఖి నదిలోకి తరలించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం పేరూరు చెరువు వద్ద నుంచీ దక్షిణ భాగంలో కాలువ తీసి  నీటిని విడుదల చేశారు. ఈ నీరు పాతకాల్వ గ్రామ సమీపంగా ఉదృతంగా ప్రవహించింది. దీంతో ఓ విద్యుత్‌ స్తంభం వాలింది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందోనని పాతకాల్వ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.పేరూరు చెరువుకు తూర్పువైపు సహజసిద్ధమైన సప్లయ్‌ చానల్స్‌ తుమ్మలగుంట, అవిలాల,ఓటేరు చెరువులుండగా అధికారయంత్రాంగం దక్షిణంవైపున్న పాతకాల్వ వైపు కాలువ తవ్వారంటూ ఆక్షేపించారు. గొల్లపల్లె మీదుగా స్వర్ణముఖిలోకి నీటిని పంపితే తమ పొలాలు ముంపునకు గురవుతాయని, గ్రామాలకూ ప్రమాదమని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా జేసీబీతో పేరూరు చెరువుకు దిగువన కాలువ తీశారు. దీంతో దిగువ ప్రాంతానికి పెద్దఎత్తున నీరు ప్రవహించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. పేరూరు చెరువుకు కింద కాలువ తవ్వుతున్న వారిపై లాఠీఛార్జి చేశారు. ఈ లాఠీ ఛార్జిలో సరిత అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఐదుగురు మహిళలు గాయపడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో పేరూరు చెరువుకు దిగువ ప్రాంతంలో తవ్విన కాలువను మూసేశారు. లేకపోతే దిగువన ఉన్న పేరూరు, తుమ్మలగుంట గ్రామాలకు ప్రమాదం ఏర్పడేది. ఈ నేపథ్యంలో చిత్తూరు - నాయుడుపేట జాతీయ రహదారిపై పాతకాల్వ బైపాస్‌ వద్ద గురువారం రాత్రి పాతకాల్వవాసులు బైఠాయించారు. తమ గ్రామం వైపు నీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. ఈ సందర్భంలో  పేరూరుకు చెందిన ప్రజలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేరుకొని పాతకాల్వవాసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక గంట సమయం ఇస్తే పాతకాల్వ వైపు మళ్ళించిన నీటిని నిలుపుదల చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇంతకు మునుపు కూడా ఇలాగే చెప్పి మళ్లీ చెరువుకు గండికొట్టేశారని ఆయనపై ఆందోళనకారులు అసహనం వ్యక్తంచేశారు.చివరకు నీటిని ఆపివేయిస్తామని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఇంత లో ఎస్పీ వెంకటఅప్పలనాయుడు అక్కడికి చేరుకున్నారు.గ్రామస్తులు ఆందోళన విరమించాక మళ్లీ చెరువు దక్షిణం వైపున్న పాతకాల్వ వైపే పోలీసులు నీటిని మళ్లించారు.దీంతో గ్రామంవైపు నీళ్లు ప్రవహిస్తుండడంతో పాతకాల్వవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు పెద్దసంఖ్యలో మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.


తిరుపతిని తాకకుండా కపిలతీర్థం నీరు మళ్లించవచ్చు

కపిలతీర్థం నుంచీ వర్షపు నీరు నగరంలోకి ప్రవేశించకుండా కొండల చివరగా కాలువ తవ్వి నగర పరిధి దాటాక స్వర్ణముఖి వైపు మళ్ళించవచ్చని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతానికి ఈ నిర్మాణం చేపట్టి, భవిష్యత్తులో కపిలతీర్థం నీటిని బాలాజీ రిజర్వాయర్‌కు మళ్ళించే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలచెరువు తూములు, మొరవ పటిష్ఠం చేయాలని సూచించారు. స్వర్ణముఖి నదిపై పలుచోట్ల బ్రిడ్జిలన్నీ కూలిపోయాయన్నారు. తిరుచానూరు, పాపానాయుడు పేట, తనపల్లి, మంగాపురం దగ్గర బ్రిడ్జిలు కూడా కూలిపోయాయని వీటిని యుద్ధప్రాతిపదికన పునర్నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అలాగే నదిలో చెక్‌డ్యాములన్నీ నీటి ఉధృతికి కొట్టుకుపోయాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా తిరిగి నిర్మించాలని సూచించారు. దానివల్ల భూగర్భ జలాలు రీఛార్జి అవుతాయని, ఆ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందుబాటులో వుంటుందన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు నష్టపరిహారం మొత్తాలను పెంచాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబు సకాలంలో ఆ సాయం అందించని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి అమరనాధరెడ్డి, తిరుపతి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల టీడీపీ అధ్యక్షులు నరసింహయాదవ్‌, పులివర్తి నాని, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పుంగనూరు, సత్యవేడు టీడీపీ ఇంఛార్జులు చల్లా రామచంద్రారెడ్డి, జేడీ రాజశేఖర్‌, మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, మద్దిపట్ల సూర్యప్రకాష్‌, రవినాయుడు, దశరధ వాసు, రాగల ఆనంద్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-26T08:15:30+05:30 IST