వివాదాస్పదంగా నోముల ఫేక్‌ ఆడియో

ABN , First Publish Date - 2020-12-03T07:11:52+05:30 IST

ఎర్రజెండా బిడ్డగా తనను సాగనంపాలంటూ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చెప్పినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో వైరల్‌ అయింది.

వివాదాస్పదంగా నోముల ఫేక్‌ ఆడియో

 పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు

 నోములతో అనుబంధం మేరకే చేశానన్న ఓ కళాకారుడు

 క్షమాపణ కోరడంతో కేసు ఉపసంహరణ 

నల్లగొండ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎర్రజెండా బిడ్డగా తనను సాగనంపాలంటూ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చెప్పినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో వైరల్‌ అయింది. ఇది టీఆర్‌ఎస్‌, సీపీఎం, వామపక్ష అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ‘మీ ఎర్రజెండా బిడ్డగా కోరుకునేది ఒక్కటే, మీ అందరినీ ఎడబాసి ఏడేళ్లు గడిచింది, ఈ ఏడేళ్లలో ఏడేడు లోకాలకు అందకుండా పోతానని ఎప్పుడూ అనుకోలేదు, ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను ఎప్పుడూ కలగనలేదు, ఆ భగవంతుడు పిలిచినాడు, నేను వెళతావున్నా, మీరందరూ మీ నర్సింహయ్యగా నా అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మీరు కమ్యూనిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు’ అని ఆ ఆడియోలో ఉంది.


కాగా ఈ ఆడియోపై నోముల కుమారుడు భగత్‌ స్పందించారు. ‘మా నాన్న బతికున్నప్పడు ఇబ్బంది పెట్టిన కొందరు ఇప్పుడు సైతం ఇబ్బంది పెడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.  ఫేక్‌ ఆడియో వైరల్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రంగనాథ్‌ను ఆయన కోరారు. కాగా ఈ ఆడియో వివాదాస్పదం కావడంలో అందులోని గొంతు తనదేనంటూ కోదాడ ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు కొండల్‌  పేర్కొన్నారు. పాతికేళ్లుగా నోములతో ఉన్న అనుబంధంతోనే ఆయన గొంతుతో మిమిక్రీ చేశానని చెప్పారు. ఈ మేరకు ఆయన మరో ఆడియో విడుదల చేశారు.

గతంలో ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేశానని, స్వతహాగా మిమిక్రీ కళాకారుడినని, ఉమ్మడి నల్లగొండ జిల్లా కళాకారులమంతా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టుకున్నామని తెలిపారు. నర్సింహయ్య మనతో ఉంటే ఎలా ఉండేదని గుర్తుచేసుకుంటూ అందరూ మిమిక్రీ చేయమని కోరడంతోనే ఆయన గొంతుతో మిమిక్రీ చేశానన్నారు. కొంతమంది ఆ ఆడియోను వైరల్‌ చేయడంతో నోముల కుటుంబం కలత చెందిందని తెలిసిందన్నారు. నోముల కుటుంబసభ్యులు తనను క్షమించాలని.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కోరారు. దీంతో  నోముల కుమార్‌ భరత్‌ కేసు నమోదు చేయొద్దంటూ  ఎస్పీ రంగనాథ్‌కు తెలపడంతో కథ సుఖాంతమైంది. 


Updated Date - 2020-12-03T07:11:52+05:30 IST