ప్రాణం తీసిన చేపల కూర.. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-01-24T05:37:39+05:30 IST

అంతవరకూ కలసి మెలసి ఉన్న వారి మధ్య చేపల..

ప్రాణం తీసిన చేపల కూర.. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే..
మృతదేహాన్ని పూడ్చిన స్ధలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

చేపల కూరపై వివాదంతోనే...

వలస కూలీ హత్య 

ఏడుగురి అరెస్టు


సారవకోట(శ్రీకాకుళం): అంతవరకూ కలసి మెలసి ఉన్న వారి మధ్య చేపల కూర చిచ్చుపెట్టింది. ఒకరి హత్యకు దారి తీసింది.  నిందితుడితో పాటు ఏడుగురిని జైలుపాలు చేసింది. సారవకోట మండలం అవలింగిలో గురువారం రాత్రి జరిగిన వలస కూలీ హత్య కేసుకు సంబంధించి పాతపట్నం సీఐ రవిప్రసాద్‌ తెలిపిన వివరాలివీ... తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాలమూరు ప్రసాద్‌(60)ను అదే ప్రాంతానికి చెందిన పాండురంగడు అవలింగిలో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. రంగడికి ఆరుగురు సహకరించినట్టు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పాతపట్నం సీఐ రవిప్రసాద్‌ శనివారం వెల్లడించారు.


కాకినాడకు చెందిన పాండురంగడు కొంతకాలంగా అవలింగిలో నివాసం ఉంటున్నాడు. రక్షితనీటి పథకం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్లి.. ఇటీవల తనతో పాటు కాకినాడ నుంచి పాలమూరు ప్రసాద్‌ను అవలింగి తీసుకొచ్చాడు. గురువారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. చేపల కూర దగ్గర ఇద్దరికీ గొడవ తలెత్తింది. ప్రసాద్‌ తల, చేతులపైన పాండురంగడు బలంగా కొట్టాడు. దీంతో ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం బయటపడకుండా.. పాండురంగడు జాగ్రత్తపడ్డాడు. ఇందులో భాగంగా ప్రసాద్‌ మృతదేహాన్ని గ్రామ సమీపంలోని చెరువులో ఖననం చేశాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు రంగంలోకి దిగారు.


ఈ ఘటనపై విచారణ చేపట్టారు. కాకినాడకు చెందిన ఒక కాంట్రాక్టర్‌, గ్రామానికి చెందిన మరో ఐదుగురి సహకారంతో ప్రసాద్‌ మృతదేహాన్ని పాండురంగడు ఖననం చేశాడని గుర్తించారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని సారవకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శనివారం తహసీల్దార్‌ రాజమోహనరావు సమక్షంలో ప్రసాద్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించామని సీఐ రవిప్రసాద్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-24T05:37:39+05:30 IST