బాతువలో సద్దుమణిగిన వివాదం

ABN , First Publish Date - 2022-10-08T04:56:12+05:30 IST

బాతువ గ్రామంలో నాలుగు రోజులుగా ఇరు కులాల మధ్య జరుగుతున్న వివాదం శుక్రవారం సద్దుమణిగింది. ఇటీవల గ్రామంలోని రజకులు తాము ఇక బట్టలు ఉతకలేమని గ్రామస్థులకు తెగేసి చెప్పారు. దీంతో వారికి ఎలాంటి పనులు చెప్పకూడదని, నిత్యవసరాలు విక్రయించకూడదని గామస్థులు నిర్ణయించుకున్నారు.

బాతువలో సద్దుమణిగిన వివాదం
గ్రామ పెద్దలతో చర్చిస్తున్న అధికారులు

- ఇరు కులాల పెద్దలతో చర్చించిన అధికారులు
- రజకులకు నిత్యవసరాలు అందించేందుకు అంగీకారం
జి.సిగడాం, అక్టోబరు 7:
బాతువ గ్రామంలో నాలుగు రోజులుగా ఇరు కులాల మధ్య జరుగుతున్న వివాదం శుక్రవారం సద్దుమణిగింది. ఇటీవల గ్రామంలోని రజకులు తాము ఇక బట్టలు ఉతకలేమని గ్రామస్థులకు తెగేసి చెప్పారు. దీంతో వారికి ఎలాంటి పనులు చెప్పకూడదని, నిత్యవసరాలు విక్రయించకూడదని గామస్థులు నిర్ణయించుకున్నారు. ఈ విషయమై రజకులు జిల్లా అధికారులను ఆశ్రయించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారులు రెండు రోజుల కిందట ఇరు కులాల పెద్దలతో మాట్లాడి కుల, మత భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లా ఉండాలని నచ్చజెప్పారు. రజకులకు నిత్యవసరాలు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే,  గురువారం సాయంత్రానికి కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో గ్రామంలో ప్రత్యేక బలగాలతో పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి, డీఎస్పీ ఎస్‌.వాసుదేవ్‌తో పాటు తహసీల్దార్‌ పి.వేణుగోపాలరావు, జేఆర్‌పురం సీఐ సీహెచ్‌ స్వామినాయుడు, జి.సిగడాం, రణస్థలం ఎస్‌ఐలు సామంతుల రామారావు, జి.రాజేష్‌లు బాతువ గ్రామానికి చేరుకున్నారు. స్థానిక రామాలయం వద్ద ఇరు కులాల నాయకులు, గ్రామ స్థులతో చర్చలు నిర్వహించారు. సమాజంలో ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు ఉందని, వాటికి ఎవరు ఆటంకం కలిగించినా, వివక్షత చూపించినా చట్టరీత్యా నేరస్తులు అవుతారని ఆర్డీవో, డీఎస్పీ హెచ్చరించారు. రజకులు తమ కుల వృత్తిని వదిలేశారని వారికి నిత్యవసర సరుకులు ఇవ్వకపోవడం పద్ధతి కాదన్నారు. పంతాలకు, పట్టుదలకు, గొడవలకు తావిస్తే జరిగే పరిణామాలను గురించి వివరించారు. రజకులకు ఎప్పటిలాగే నిత్యవసర సరుకులు అందించాలని తెలిపారు. వారికి మిగతా పనులు చెప్పడం, చెప్పకపోవడం గ్రామస్థుల ఇష్టం బట్టి ఉంటుందన్నారు. దీనికి గ్రామస్థులు అంగీకరించడంతో సమస్య సద్దుమనిగింది. ఈ చర్చల్లో సర్పంచ్‌ డబ్బాడ కళ్యాణి,  గ్రామ పెద్దలు డబ్బాడ ఆదినారాయణ, బూటు అప్పారావు, కూనుబిల్లి కూర్మారావు, పల్లీడు సన్యాసిరావు,  సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-10-08T04:56:12+05:30 IST