పరమాత్మతో సంభాషణ సాధ్యమే

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

భగవంతుడు సర్వశక్తిమంతుడు. సకలచరాచర రక్షకుడు. ‘సర్వేశ్వరుడైన ఆ పరమాత్మను మనం దర్శించుకోగలగడం సాధ్యమేనా?’ అని సామాన్యులైన మానవులు అనుకోవడం చాలా సహజం. అయితే, భగవంతుణ్ణి దర్శించడమే కాదు,

పరమాత్మతో సంభాషణ సాధ్యమే

భగవంతుడు సర్వశక్తిమంతుడు. సకలచరాచర రక్షకుడు. ‘సర్వేశ్వరుడైన ఆ పరమాత్మను మనం దర్శించుకోగలగడం సాధ్యమేనా?’ అని సామాన్యులైన మానవులు అనుకోవడం చాలా సహజం. అయితే, భగవంతుణ్ణి దర్శించడమే కాదు, ఆ పరమాత్మతో సంభాషించగలం కూడా! ప్రధానమంత్రితో, ముఖ్యమంత్రితో, మంత్రులతో ఎవరైనా సమస్యలు చెప్పుకోవాలంటే అపాయింట్‌మెంట్‌ కావాలి. ఒకవేళ అవకాశం దొరికితే వారితో ప్రత్యేకంగా మాట్లాడేందుకు సమయం కావాలని అడుగుతాం. అలాంటిది అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన భగవంతుణ్ణి దర్శించగల భాగ్యం కోసం ఒక సమయం, సందర్భం ఉంటుంది కదా! ఆ సమయాన్నే ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. అర్థరాత్రి ముగిసిన తరువాత, తెల్లవారుతూ ఉండగా... సూర్యుడు తన వెలుగులు పంచడానికి ముందు... అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి... తన సంతానమైన మనకు శక్తులను ప్రదానం చెయ్యడానికి ఆ పరమాత్ముడు సిద్ధంగా ఉంటాడు. ఆ అమృత క్షణాలలో మన భావాలు, సంకల్పాలు శుద్ధంగా ఉంటాయి. మనసు స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది.


బుద్ధి నిశ్చయంగా... నిర్ణయ శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి మన సంకల్పాలు అలలు అలలుగా... పరమాత్మునితో సంబంధం ఏర్పరచుకొని, ఆయనతో సంభాషించే మార్గంలో ఆటంకం లేకుండా ఉంటాయి. లౌకిక భాషలో చెప్పాలంటే ‘మనస్సు’ అనే లైన్‌ క్లియర్‌గా ఉండడం అన్నమాట. మన మనసుల్లో వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు. ఆ భగవంతుడి మీదే మనసు లగ్నమై ఉండాలి. భగవంతుడి ఆలోచనలతో నిండి ఉండాలి. వ్యతిరేక ఆలోచనలకు చోటు లేకుండా, కేవలం మంచి భావాలకు మాత్రమే ప్రాధాన్యం ఉండాలి. అప్పుడే... ప్రపంచానికి వెలుగు ప్రసరించే జ్ఞాన సూర్యుడైన పరమాత్మునితో ఆత్మిక సంభాషణ సాధ్యం అవుతుంది. దీనికోసం బుద్ధి కల్మషాలు, కలహాలు లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. ఈ స్థితి కోసం ఏకాగ్రతా శక్తి, ఏకాంతం ఎంతో అవసరం. అలాంటప్పుడే మన బాధలు, సమస్యలు ఆ దేవదేవునికి విన్నవించుకోగలం. 


పులి పాలు బంగారు పాత్రలో మాత్రమే నిలుస్తాయి. అలాగే ‘బుద్ధి’ అనే పాత్రలో వైషమ్యాలు, విరుద్ధ భావాలు ఉండకూడదు. ముందుగా దేవునితో మన ఆత్మను అనుసంధానం చెయ్యగలగాలి. ప్రాపంచిక సంబంధాలకు, తుచ్ఛమైన కోరికలకు మనసు అతీతం అయిన కొద్దీ ఆత్మతో మమేకం అవుతుంది. అప్పుడు ఎంతసేపైనా పరమాత్మతో మన సుఖ దుఃఖాలను పంచుకోగలము. దేవుడు పరంజ్యోతి స్వరూపుడు. మనలాంటి దేహం ఉన్నవాడు కాదు. కాబట్టి మన ఆత్మను కూడా నిరాకారంగా మార్చుకుంటేనే పరమాత్మతో దాన్ని అనుసంధానం చెయ్యగలం. ఆత్మలో జ్యోతిని వెలిగించుకుంటే దేవునితో సంభాషించడం చాలా సులభం అవుతుంది. 


బ్రహ్మకుమారీస్‌ ,9010161616

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST