వంట గ్యాస్‌ ధర రెండేళ్లలో రూ.461 పెంపు

ABN , First Publish Date - 2022-07-07T06:25:21+05:30 IST

అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసరమైన వంట గ్యాస్‌ ధరను కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా పెంచేస్తున్నది.

వంట గ్యాస్‌ ధర రెండేళ్లలో రూ.461 పెంపు
గ్యాస్‌ సిలిండర్లు

2020 జూన్‌లో రూ.600... ఇప్పుడు రూ.1,061!

77 శాతం పెరుగుదల


అనకాపల్లిఅర్బన్‌, జూలై 6: అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసరమైన వంట గ్యాస్‌ ధరను కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా పెంచేస్తున్నది. మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడేళ్ల కాలంలో గ్యాస్‌  సిలిండర్‌ ధర రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా రెండేళ్ల నుంచి తరచూ రూ.25 నుంచి రూ.50 వరకు పెంచుతున్నది.  2020 జూన్‌లో గృహవినియోగ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.600 వుంది. అప్పటి నుంచి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి ధర పెంచుతున్నారు. తాజాగా మరో రూ.50 బాదుడుతో సిలిండర్‌ ధర రూ.1,061కు (77 శాతం) చేరింది.  అనకాపల్లి జిల్లాలో 21 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో  4,82,267 వంట గ్యాస్‌ కనెక్షన్లు వున్నాయి. ప్రతి నెలా  సగటున 2.4 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతున్నట్టు ఏజెన్సీ వర్గాల సమాచారం. తాజాగా గ్యాస్‌ ధర పెంచడంతో జిల్లా వినియోగదారులపై నెలకు ఒక కోటి 20 లక్షల రూపాయల అదనపు భారం పడుతుంది.

మోదీ నేతృత్వంలో 2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చేనాటికి  వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.450 వుండేది. తరువాత కొద్దిగా పెంచుకుంటూ 2020 జూన్‌నాటికి రూ.600కు చేర్చారు. అప్పటి నుంచి గ్యాస్‌ ధర పెంపులో కేంద్రం దూకుడు పెంచింది. అదే ఏడాది నవంబరులో రూ.620కి, డిసెంబరులో రూ.702కి, 2021 ఫిబ్రవరిలో రూ.727కి పెంచింది. అదే ఏడాది మే నెలలో రూ.830, జూలైలో  రూ.843కి, సెప్టెంబరులో రూ.893కి, నవంబరులో రూ.908కి, ఈ ఏడాది మార్చిలో రూ.958కి పెంచేసింది. మే నెలలో రూ.50, జూన్‌లో రూ.3 పెంచడంతో సిలిండర్‌ ధర రూ.1,011 అయ్యింది. తాజాగా మరో రూ.50 పెంపుతో రూ.1,061కి చేరింది. గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ వసూళ్లు దీనికి అదనం. వాస్తవంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలోనే రవాణా, హోమ్‌ డెలివరీ చార్జీలు వుంటాయి. కానీ డెలివరీ బాయ్స్‌ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 



గ్యాస్‌ ధర పెంపుతో మరింత భారం

కె.లక్ష్మి, కస్పావీధి, అనకాపల్లి 

వంట గ్యాస్‌ ధరను ప్రభుత్వం విపరీతంగా పెంచేస్తున్నది. గతంలో సబ్సిడీ రూపంలో కొంత సొమ్మును  బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. కొన్నేళ్ల నుంచి అది కూడా లేదు. మాకు నెలకో సిలిండర్‌ అవుతుంది. ప్రతిసారీ రూ.50 చొప్పున గ్యాస్‌ ధర పెంచుకుంటూ పోతుండడంతో ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. 

---

పేదలు ఎలా బతకాలి?

కాసర్ల పవన్‌, మసీదు వీధి, అనకాపల్లి  

నిత్యావసర వస్తువులతోపాటు వంట గ్యాస్‌ ధర కూడా విపరీతంగా పెరిగిపోతున్నది. దినసరి కార్మికులు, అరకొర జీతాలతో బతికే ప్రైవేటు ఉద్యోగులకు గ్యాస్‌ ధర పెంపు  శరాఘాతం అవుతుంది. అన్నింటి ధరలు ఇలా పెంచుకుంటూ పోతే మాలాంటి వారు ఎలా బతకాలి?


Updated Date - 2022-07-07T06:25:21+05:30 IST