కూల్‌ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఇన్ని రకాల నష్టాలా? అవేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-19T17:56:56+05:30 IST

ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లని పానీయాలను తాగుతాం. అయితే అందుకోసం శీతల పానీయాలను ఎంచుకుంటే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇవి కలిగించే ఆరోగ్య నష్టాలు అనేకం

కూల్‌ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఇన్ని రకాల నష్టాలా? అవేంటో తెలిస్తే..

ఆంధ్రజ్యోతి(19-04-2022) 

ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లని పానీయాలను తాగుతాం. అయితే అందుకోసం శీతల పానీయాలను ఎంచుకుంటే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇవి కలిగించే ఆరోగ్య నష్టాలు అనేకం.


ఉబ్బసం: శీతలపానీయాల్లో వాడే సోడియం బెంజాయేట్‌ అనే నిల్వ పదార్థం కారణంగా ఉబ్బసం వ్యాధి తలెత్తుతుంది. ఈ రసాయనం ఇతర ఆహారంతో కలిసినప్పుడు వాటిలోని పొటాషియం శరీరం శోషించుకోకుండా అడ్డుపడుతుంది. అలాగే ఈ రసాయనం లాలాజలం, పొట్టలోని ఆమ్లాలతో కలిసినప్పుడు ఇది ప్రమాదకర ఆమ్లంగా మారుతుంది. నోటితోపాటు దంతాలు కూడా ఈ రసాయనం ప్రభావానికి లోనవుతాయి.


హృద్రోగాలు: శీతలపానీయాల్లో ఫ్రక్టోజ్‌ అనే చక్కెర ఉంటుంది. దీని వల్ల శరీరం శక్తిని ఖర్చుచేసే క్రమం (మెటబాలిక్‌ డిజార్డర్‌)లో అవకతవకలు తలెత్తుతాయి. ఫలితంగా హృద్రోగాలు తలెత్తుతాయి. శీతల పానీయాల్లో ఉండే అధిక చక్కెర వల్ల తాగిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోతాయి. రక్తపోటు పెరుగుతుంది. 


మూత్రపిండాల సమస్యలు: శీతలపానీయాల్లోని ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ జీర్ణవ్యవస్థను కుదేలు చేసి, సంబంధిత అవయవాలన్నిటినీ అనారోగ్యానికి గురి చేస్తుంది. ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ పరిమాణం పెరగడం మూలంగా మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి.


పునరుత్పత్తి సమస్యలు: శీతలపానీయాల క్యాన్‌లలో రెసిన్‌ ఉంటుంది. ఈ రెసిన్‌ బైఫినైల్‌ఎ, అనే కేన్సర్‌ కారక ఏజెంట్‌. దీని వల్ల అంతఃస్రావవ్యవస్థ దెబ్బతిని పునరుత్పత్తి వ్యవస్థ పాడై, నెలలు నిండకుండా ప్రసవాలు జరిగే ప్రమాదం ఉంటుంది.


ఎముకలు గుల్లబారడం: శీతలపానీయాలు తాగినప్పుడు విసర్జించే మూత్రంలో ఫాస్ఫారిక్‌ యాసిడ్‌తోపాటు క్యాల్షియం కూడా వెళ్లిపోతుంది. ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకునే క్యాల్షియం శోషణ జరగకుండా ఇలా మూత్రంలో బయటకు వెళ్లిపోవడం మూలంగా ఎముకలకు సరిపడా క్యాల్షియం అందక గుల్లబారిపోయి ‘ఆస్టియోపొరోసిస్‌’ సమస్య తలెత్తుతుంది. 


స్థూలకాయం: సోడా, శీతలపానీయాలు తాగేవారు స్థూలకాయులయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకే ఒక్క సోడా తాగడం వల్ల కూడా శరీర బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో రుజువైంది. 


పొట్టలో కొవ్వు: పొట్టలోని అవయవాలు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకునే స్థితి శీతలపానీయాల సేవనంతో సంక్రమిస్తుంది. పొట్ట దగ్గర విపరీతమైన కొవ్వు టైప్‌2 మధుమేహానికి దారితీస్తుంది. 


కీళ్లవాతం: కీళ్లు, మరీ ముఖ్యంగా పాదాల్లోని బొటనవేలి కీళ్లు వాచి, నొప్పితో వేధించే సమస్య ‘గౌట్‌’. రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరిగిపోయి అవి స్ఫటికాలుగా తయారయ్యే స్థితి ఇది. ఈ స్ఫటికాలు కీళ్ల మధ్య పేరుకుని కీళ్లను బాధిస్తాయి. శీతలపానీయాల్లోని ఫ్రక్టోజ్‌ రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ నిల్వలు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈపానీయాలు తాగడం మూలంగా గౌట్‌కు గురయ్యే అవకాశాలు పురుషుల్లో 75%, మహిళల్లో 50% పెరుగుతాయని పరిశోధనల్లో రుజువైంది.


మతిమరుపు: వృద్ధుల్లో మెదడు పనితీరు తగ్గడమే డిమెన్షియా! ఈ వ్యాధి మూలంగా మతిమరుపు తలెత్తుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరగడం మూలంగా కూడా ఈ వ్యాధి తలెత్తుతుందని పరిశోధకులు కనుగొన్నారు. చక్కెరతో తయారైన పానీయాలు తాగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్నపళాన పెరిగిపోవడంతో ఆ ప్రభావం మెదడు కణాలైన న్యూరాన్లపై కూడా పడుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు జరిగితే, వృద్ధాప్య దశలో డిమెన్షియాకు లోనవుతారు.

Updated Date - 2022-04-19T17:56:56+05:30 IST