‘కూల్‌’గా కబళిస్తుంది

ABN , First Publish Date - 2022-04-08T06:42:26+05:30 IST

జ్యూస్‌ షాపులు, రహదారుల పక్కన దుకాణాల్లో పానీయాలను సేవించారంటే...రోగాలు కొనితెచ్చుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

‘కూల్‌’గా కబళిస్తుంది

అపరిశుభ్రమైన నీటితో తయారైన ఐస్‌ను వినియోగిస్తున్న శీతల పానీయాల దుకాణదారులు

చెరువులు, బావులు, బోర్ల నీరు వినియోగం

ఆరోగ్యానికి ముప్పంటున్న నిపుణులు

డయేరియా, టైఫాయిడ్‌ సోకే ప్రమాదం 

నీటిలో రసాయనాలు కలిస్తే కేన్సర్‌ ముప్పు

తనిఖీలు మరచిన అధికారులు

తినుబండారాల్లో వినియోగించే ఐస్‌ తయారీకి జిల్లాలో రెండు, మూడు కంపెనీలకు అనుమతి

 

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జ్యూస్‌ షాపులు, రహదారుల పక్కన దుకాణాల్లో పానీయాలను సేవించారంటే...రోగాలు కొనితెచ్చుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. పానీయాలను చల్లబరిచేందుకు వినియోగించే ఐస్‌ తయారీకి అపరిశుభ్రమైన నీటిని వాడుతుండడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంటున్నారు. అంతేకాదు దీర్ఘకాలంలో కేన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందంటున్నారు.

జిల్లాలోని ఐస్‌ తయారీ కంపెనీల్లో అధికశాతం అపరిశుభ్ర నీటినే వినియోగిస్తున్నాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలన్నీ ఆహారంలో వినియోగించేందుకు పనికిరాని ఐస్‌ తయారీకి మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కానీ తక్కువ ధరకు లభిస్తుండడంతో కూలింగ్‌ పాయింట్ల నిర్వాహకులు దానినే విచ్చలవిడిగా వినియోగిస్తున్నారంటున్నారు. ఆటోనగర్‌ ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో ఐస్‌ తయారుచేసే కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలోని పలు కంపెనీలు అపరిశుభ్ర వాతావరణంలో, కలుషిత నీటితో ఐస్‌ తయారుచేస్తున్నాయి. దీనిని సముద్ర ఉత్పత్తులను భద్రపరిచేందుకు, ఇతర అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఐస్‌ తక్కువ ధరకు లభిస్తుండడంతో కొంతమంది దళారులు భారీగా కొనుగోలు చేసి నగరంలోని 90 శాతం జ్యూస్‌ సెంటర్లు, కూల్‌పాయింట్లు, చల్లని పానీయ కేంద్రాలు, షర్బత్‌ సెంటర్లు, చెరకు రసం దుకాణాలకు విక్రయిస్తున్నారు. వాటిని సేవిస్తున్న జనం రోగాల బారినపడుతున్నారు. 


పోటబుల్‌ వాటర్‌తో ఐస్‌.. 

తినుబండారాల్లో వినియోగించే ఐస్‌ తయారీకి పోటబుల్‌ వాటర్‌ను మాత్రమే వినియోగించాలి. ఆ నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే బాక్టీరియాలు, రసాయనాలు లేకుండా చూడాలి. అంటే ప్రాసెస్డ్‌ వాటర్‌ లేదా మినరల్‌ వాటర్‌తో ఐస్‌ను తయారుచేయాలి. నగరంలో ఎడిబుల్‌ పర్పస్‌ (తిను బండారాల్లో వినియోగించేందుకు) ఐస్‌ తయారుచేసేందుకు ఒకటి, రెండు కంపెనీలు మాత్రమే అనుమతులు తీసుకున్నాయి. మిగిలినవన్నీ ఇతర అవసరాల కోసమే ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్నాయి. కానీ ఈ ఐస్‌నే తినుబండారాల్లో వినియోగించేందుకు విక్రయిస్తున్నారు. దీనికి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


అనారోగ్య సమస్యలు ఎన్నో...

కలుషిత నీటితో తయారైన ఐస్‌ వినియోగంతో  ప్రజలు  అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీటిలో వుండే సూక్ష్మక్రిముల వల్ల నీళ్ల విరేచనాలు అవుతాయని, బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్‌, పారా టైఫాయిడ్‌, కలరా, ప్రోటోజోవాల వల్ల అమీబియాసిస్‌, జియార్డియాసిస్‌, కిపోటస్పోరిడియాసిస్‌, వైరస్‌ల వల్ల గ్యాస్ర్టో ఎంటరైటిస్‌కు గురవుతారు. పచ్చకామెర్లు, నార కురుపు, రక్తహీనత వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఆమ్లం, క్షారం ఎక్కువగా వుంటే గ్యాస్ర్టిక్‌ ఇరిటేషన్‌, ఎసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. కళ్లు, చర్మం, ముక్కు సంబంధిత సమస్యలు గొంతు ఇన్‌ఫెక్షన్లు, థైరాయిడ్‌, సైనటైటిస్‌, జలుబు తదితర వ్యాధులు వచ్చే ప్రమాదముంది. 


రసాయనాలతో ప్రమాదం

ఐస్‌ తయారుచేసేందుకు వినియోగించే నీటిలో రసాయనాలుంటే దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు. నీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా వుంటే ఫ్లోరోసిస్‌ (ఎముకలు గుల్ల బారడం), నైట్రేట్‌ ఎక్కువగా వుంటే నీలి రంగుగా మారడం, మాంగనీసు ఎక్కువగా ఉంటే మెదడువాపు వ్యాధి, ఆర్సినిక్‌ వుంటే కేన్సర్లు, మెర్క్యూరీ ఉంటే శ్వాసకోశ వ్యాధుల బారినపడే  ప్రమాదముంది.  


ఆ ఐస్‌కు దూరంగా ఉండడం మేలు

వేసవి నేపథ్యంలో కూలింగ్‌ పాయింట్లలో కలుషిత నీటితో తయారయ్యే ఐస్‌నే ఎక్కువగా వినియోగిస్తుంటారు.   ఆరోగ్యానికి ఇది చాలా హాని కలిగిస్తుంది. చల్లదనం కోసం  ఇంట్లోనే మంచి నీటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని, వినియోగించడం ఉత్తమం. కలుషిత నీటితో తయారయ్యే ఐస్‌ వినియోగంతో దీర్ఘకాలంలో వ్యాధులకు గురయ్యే ప్రమాదముంటుంది. 

- నందాజీ, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌


Updated Date - 2022-04-08T06:42:26+05:30 IST