కూలి డబుల్‌

ABN , First Publish Date - 2021-07-25T05:28:13+05:30 IST

వర్షాలు విరామం ఇవ్వడంతో వరినాట్లు ఊపందుకున్నాయి. ఓ వైపు వరినాట్లు.. మరోవైపు మెట్ట పంటల్లో కలుపుతీత పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా బోర్ల ఆధారంగా పంటలు సాగుచేస్తుంటారు.

కూలి డబుల్‌

గతేడాది రూ. 400, ఇప్పుడు రూ. 800

ఆటో చార్జీలు, బత్తా అదనం

50 శాతం పెరిగిన ట్రాక్టర్‌ కిరాయి

నాలుగు రోజుల తర్వాత తెరిపినిచ్చిన వర్షాలు

జోరుగా వరి నాట్లు, పత్తి చేలలో కలుపుతీత

పనులు పెరగడంతో కూలీలకు కొరత

రోజుకు రూ. 800 నుంచి రూ. 900 చెల్లించాలని డిమాండ్‌


అల్లాదుర్గం, జూలై 24 :  వర్షాలు విరామం ఇవ్వడంతో వరినాట్లు ఊపందుకున్నాయి. ఓ వైపు వరినాట్లు.. మరోవైపు మెట్ట పంటల్లో కలుపుతీత పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా బోర్ల ఆధారంగా పంటలు సాగుచేస్తుంటారు. వర్షాకాలం ఆరంభంలో వరుణుడు మురిపించడంతో బోర్ల దగ్గర వరి నారు పోసుకున్నారు. కొన్నిరోజులుగా ముఖం చాటేయడంతో వరి సాగు పనులు ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం పత్తి చేలలో కలుపు తీయడం, వరి నాట్లు వేయడం ఒకే సమయంలో కొనసాగుతుండటంతో వ్యవసాయ కూలీలు రెట్టింపు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో రైతులు చేసేదేమీ లేక కూలీలు అడిగినంత చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

నాలుగైదు రోజులు వరుసగా వర్షాలు కురియడంతో వరి నాట్లు వేసేందుకు వీలు చిక్కింది. ఇప్పటికే నారు తయారుగా ఉండటంతో రైతులు వర్షపు నీటి ఆధారంగా పొలాలను దమ్ము చేసుకుని నాటుకు సిద్ధం చేశారు. అందరూ ఒకేసారి నాట్లు వేసేందుకు పూనుకోవడంతో కూలీల కొరత ఏర్పడింది. స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో దూరప్రాంతాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. ఎలాగైన నాట్లు పూర్తిచేయాల్సి ఉండడంతో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కూలీలు ఒక్కసారిగా రేట్లు పెంచారు. భూమి విస్తీర్ణాన్ని బట్టి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కరోజుకు రూ. 800 కూలీతోపాటు రూ. 30 బత్తా వసూలు చేస్తున్నారు. రానుపోను ఆటో చార్జీలు ఇందుకు అదనం. ఇవన్నీ కలుపుకుంటే కూలీ రేటు రూ. 850 నుంచి రూ. 900కు చేరుతున్నది. రైతులు కూడా చేసేదేమీలేక కూలీలు అడిగినంత ఒప్పుకుంటున్నారు. గతేడాది రోజుకూలి రూ. 400 మించలేదు. ఒక్క ఎకరా నాట్లు వేయడానికి 10 మంది కూలీలు అవసరమవుతారు. ఈ లెక్కన నాటు వేయడానికి ఎకరాకు ప్రస్తుతం రూ. 8,500 నుంచి రూ.9వేల వరకు ఖర్చవుతున్నది. పత్తి చేలలో కలుపు తీయడానికి కూడా ఇదే లెక్కన డిమాండ్‌ చేస్తున్నారు. వర్షాలకు చేలల్లో కలుపు విపరీతంగా పెరిగిపోవడంతో పంట ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశమున్నది. దీంతో రైతులు అడిగినంత చెల్లించి కలుపు తీయిస్తున్నారు. ఇలా పనులన్నీ ఒకేసారి రావడంతో కూలీలకు చేతినండా పని.. జేబు నిండా డబ్బు దొరుకుతున్నది. రైతులకు మాత్రం ఇది మోయలేని భారంగా పరిణమిస్తున్నది.


ట్రాక్టర్‌ కిరాయి గంటకు రూ. 1,800

పెట్రో ధరలు పెరగడంతో వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్‌ కిరాయి కూడా భారీగా పెరిగింది. ట్రాక్టర్‌ యజమానులు పెట్రో ధరల భారాన్ని రైతులపై మోపుతుండటంతో కిరాయిలు పెరిగిపోయాయి. వరినాట్లకు పొలాన్ని సిద్ధం చేయడం కోసం ట్రాక్టర్‌ కేజివీల్‌కు కిరాయి ప్రస్తుతం ఎకరాకు రూ. 1,800 వసూలు చేస్తున్నారు. గత యాసంగి సీజన్‌లో గంటకు రూ. 1,200 మాత్రమే కిరాయి వసూలు చేశారు. పెరిగిన రేట్లతో రైతుల పెట్టుబడి అమాంతం పెరిగిపోతున్నది.

Updated Date - 2021-07-25T05:28:13+05:30 IST