సహకార సంఘాలకు ‘కర్షకమిత్ర’తో చేయూత

ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)కు ఆర్థిక చేయూతనిచ్చి మరింత పటిష్టం చేసేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కర్షకమిత్ర పథకానికి శ్రీకారం చుట్టింది.

సహకార సంఘాలకు  ‘కర్షకమిత్ర’తో చేయూత

 

- ఒక్కో సంఘానికి రూ.50 లక్షల నిధులు

- నాబార్డు సహకారంతో కేడీసీసీబీ నూతన పథకానికి శ్రీకారం 

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 27: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)కు ఆర్థిక చేయూతనిచ్చి మరింత పటిష్టం చేసేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కర్షకమిత్ర పథకానికి శ్రీకారం చుట్టింది. నాబార్డు సహకారంతో రాష్ట్రంలోనే ప్రథమంగా ఉమ్మడి జిల్లాలోని 127 సహకార సంఘాలకు ఈ పథకం ద్వారా ఆర్థికపరిపుష్టి కలిగించడంతోపాటు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఒక్కో సహకార సంఘానికి 50 లక్షల చొప్పున నిధులను మంజూరు చేయాలని తీర్మానించింది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాలు, చేనేత సహకార సంఘాలు, ఉమ్మడి బాధ్యతా సంఘాలు, స్వయం ఉపాధి పథకాలకు, ఉన్నత విద్యా, గృహ నిర్మాణ, పీఎం ఈజీపీ, వాహన, అగ్రి, మార్ట్‌ గేజ్‌, నాన్‌-అగ్రి, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ప్రధానమంత్రి స్వయం నిధి రుణాలను మంజూరు చేస్తున్నారు. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో మూడుసార్లు ఉత్తమ సంఘంగా గుర్తింపు లభించింది. మరికొన్ని సంఘాలు కూడా రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో గౌరవం అందుకున్నాయి.   జిల్లాలోని సహకార బ్యాంకులు అందిస్తున్న సేవలను దేశ, విదేశాల్లోని సహకార సంఘాలు, రైతు సంఘాలు అధ్యయనం చేస్తున్నాయి. 


 రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు


సహకార సంఘాల సేవల పరిధిని మరింత విస్తృతం చేయడంతోపాటు రైతులకు తక్కువ వడ్డీకి వివిధ రకాల రుణాలను అందించేందుకు కేడీసీసీబీ కర్షక మిత్ర పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఒక్కో సహకార సంఘానికి 50 లక్షల చొప్పున మొత్తం 127 సంఘాలకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. మొదట 80 శాతం దీర్ఘకాలిక రుణాలను వసూలు చేసిన సంఘాలకు ఇచ్చి ప్రోత్సహించాలని, ఆ తర్వాత దశలవారీగా అన్ని సంఘాలకు నిధులు ఇవ్వాలని తీర్మానించింది. కర్షక మిత్ర ద్వారా ఇచ్చే 50 లక్షలను నాలుగు శాతం వడ్డీతో సహకార సంఘాలకు విడుదల చేస్తారు. సహకార సంఘాల సభ్యులకు రుణాలను మంజూరు చేసే అవకాశం ఆయా సంఘాల చైర్మన్లు, సెక్రటరీలకు లభిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు ఎనిమిది శాతం వడ్డీతో రుణాలను మంజూరు చేస్తారు.ది. ఇప్పటికే దీర్ఘకాలిక రుణాలు పొందిన కొంత మంది రైతులు, సహకార సంఘాల సభ్యులు ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్స్‌, హార్వెస్టర్లు కొనుగోలు చేసి లబ్ధి పొందుతున్నారు. కర్షకమిత్ర రుణాలను చైర్మన్‌, సెక్రెటరీలు ఎంపిక చేసిన రైతులు, సభ్యులకు లక్ష నుంచి 2 లక్షలు యూనిట్‌ను బట్టి  మంజూరు చేస్తారు. 

Updated Date - 2022-06-27T05:30:00+05:30 IST